Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

సీపీఐ ఎంపీ సెల్వరాజ్‌కన్నుమూత

చెన్నై: సీపీఐ సీనియర్‌ నేత, నాగపట్నం ఎంపీ ఎం.సెల్వరాజ్‌ (67) కన్నుమూశారు. శ్వాసకోశ, మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సెల్వరాజ్‌… చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. నాగపట్నం ప్రస్తుత ఎంపీగా ఉన్న 67 ఏళ్ల ఎం.సెల్వరాజ్‌కి గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. రైతు, సామాజిక కార్యకర్త అయిన సెల్వరాజ్‌ సీపీఐలో అత్యంత సీనియర్‌ నేత. నాగపట్నం నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తిరువారూర్‌ జిల్లా పరిధిలో ఉన్న నీడమంగళం టౌన్‌ పంచాయతీ కప్పలుదయాన్‌ గ్రామంలో 1957లో జన్మించిన సెల్వరాజ్‌…చిన్నతనంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. సీపీఐ విద్యార్థి, యువజన విభాగాలైన ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌లో అనేక కీలక పదవులు నిర్వహించారు. నీడమంగళం నుండి పార్టీలో స్థానిక కమిటీ సభ్యునిగా పనిచేసిన సెల్వరాజ్‌… నాగపట్నం జిల్లా కార్యదర్శిగా, సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎదిగారు. సెల్వరాజ్‌ తొలిసారిగా 1989లో నాగపట్నం నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి, 1996, 1998, 2019లోనూ మొత్తం నాలుగు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. సెల్వరాజ్‌కు భార్య కమలావతనం, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని చెన్నై నుంచి నాగపట్నం తరలించారు. నాగపట్నం ఎంపీ ఎం.సెల్వరాజ్‌ మృతికి సీపీఐ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయనను ఆదర్శప్రాయమైన నేతగా అభివర్ణించింది. తిరువారూర్‌ జిల్లాలోని సీతమల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ తెలిపింది.
దళితులకు అండగా…
యాభై ఏళ్ల క్రితం నాగపట్నంలోని వెన్మనై గ్రామంలో స్థానిక భూస్వాములు 29 మంది మహిళలు ,పిల్లలతో సహా 44 మంది అమాయక వ్యవసాయ కూలీలను (ఎక్కువగా దళితులు) గుడిసెలో బంధించి సజీవదహనం చేసిన దారుణ ఘటన జరిగింది. అప్పట్లో దళితుల పట్ల అంటరానితనం, ఆలయ ప్రవేశంపై నిషేధం చాలా ప్రబలంగా ఉంది. బాధితులకు సీపీఐ, సీపీఎం అండగా నిలిచాయి. ఈ పోరాటంతో పాటు గ్రామాల్లో వ్యవసాయ కూలీల వేతనాల పెంపు, భూ పంపిణీకోసం పోరాడిన సీపీఐని ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరువలేరు.
స్టాలిన్‌ సంతాపం
నాగపట్నం ఎంపీ సెల్వరాజ్‌ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత ఎంపీ డెల్టా ప్రాంత ప్రజల హక్కుల కోసం, రైతుల కోసం అనేక పోరాటాలు చేశారని, కొత్త రైల్వే ప్రాజెక్టుల డిమాండ్‌లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని స్టాలిన్‌ కొనియాడారు. తనలాగే డెల్టా ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆయనపై ప్రత్యేక అభిమానం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img