Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

ఉపపోరులో ‘ఇండియా’ జోరు

. 10 అసెంబ్లీ సీట్లలో విజయం
. రెండు సీట్లకే బీజేపీ పరిమితం

న్యూదిల్లీ : సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార, విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీల ఉపఎన్నికల్లో ఇండియా ఐక్యసంఘటన విజయకేతనం ఎగురవేసింది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో విపక్ష కూటమి 10 చోట్ల అద్భుత విజయం సాధించింది. బీజేపీ కేవలం రెండు స్థానాలకు పరిమితమైంది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్‌ ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు, పంజాబ్‌, బీహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఒక్కో స్థానానికి జులై 10న ఉపఎన్నిక పోలింగ్‌ జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా… మరో మూడుచోట్ల ఎన్డీయే ప్రభుత్వం ఉంది. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని దేహ్రాలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకూర్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 9 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్‌ స్థానంలో కాంగ్రెస్‌ నేత హర్‌దీప్‌ సింగ్‌ బవా 8,990 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. హమీర్‌పుర్‌ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశీష్‌ శర్మ గెలుపొందారు. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్‌ కాంగ్రెస్‌… తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్‌గంజ్‌, రాణాఘాట్‌, బాగ్దా, మాణిక్‌తలా స్థానాల్లో తృణమూల్‌ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఉత్తరాఖండ్‌లో మంగలౌర్‌, బద్రీనాథ్‌ స్థానాలను కాంగ్రెస్‌ దక్కించుకుంది. పంజాబ్‌లోని జలంధర్‌ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్‌ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడాలో బీజేపీ నేత కమలేశ్‌ షా గెలుపొందారు. బీహార్‌లోని రూపాలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్‌ సింగ్‌ జయకేతనం ఎగురవేశారు. ఉప ఎన్నికలను అటు ఇండియా ఐక్యసంఘన, ఇటు ఎన్‌డీఏ కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. విస్తృత ప్రచారం చేశాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో చతికిల పడిన బీజేపీ…ఉప ఎన్నికల్లోనైనా పరువు నిలుపుకోవడానికి నానాతంటాలు పడిరది. అయినా ఇండియా పార్టీలు ఐక్యంగా నిలిచి తమ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయి. బీజేపీకి మరోసారి ఓటమి రుచిచూపించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img