Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

ఏపీలో మాఫియా పాలన

. అభివృద్ధి సున్నా… అవినీతి వందశాతం
. వైసీపీ ప్రభుత్వంపై మోదీ విమర్శలదాడి
. దేశంలో, రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని ధీమా
. ఆంధ్రాలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ

రాజమహేంద్రవరం/అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పాలన అవినీతికి అరాచకాలకు నిలయంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. శాండ్‌, ల్యాండ్‌, మద్యం మాఫియా పాలన సాగుతోందని, ఈ దోపిడీ నుంచి విముక్తి కల్పించేందుకు ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అనకాలపల్లి జిల్లా రాజుపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభల్లో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉండాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అవినీతి జెట్‌స్పీడ్‌తో పరిగెత్తించిందన్నారు. అభివృద్ధి సున్నా…అవినీతి వందశాతం అంటూ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తారని చెబుతూ… రాష్ట్రమైనా, దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే ప్రభుత్వం ఉండాలని చెప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, కేంద్ర ప్రాజెక్టుల అమలును జాప్యం చేసిందని మండిపడ్డారు. ‘మూడు రాజధానులు చేస్తామన్నారు.. చేయలేదు కానీ, మూడు రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు. ఏపీలో మద్యం నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ… గద్దె నెక్కిన తర్వాత మద్యం సిండికేట్‌గా తయారైంది. ఈ ప్రభుత్వానికి అవినీతి నిర్వహణ తప్ప రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ఖాళీ చేసింది. పోలవరం కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ఇచ్చింది కానీ, ఆ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది’ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం సహా ఏపీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలనుకుంది కానీ, కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందుకోలేక పోయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక చరిత్ర ఉన్న భూమి అని, రాముడి చరిత్రను సినిమాల ద్వారా ఎన్టీఆర్‌ ఇంటింటికీ తీసుకెళ్లారన్నారు. ఏపీకి మోదీ గ్యారంటీ, చంద్రబాబు నేతృత్వం, పవన్‌ విశ్వాసం ఉన్నాయని కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లిలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ… ‘‘అనకాపల్లి చెరకు రైతులకు పెద్ద కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చాలా చక్కెర పరిశ్రమలు మూతపడి రైతులు ఆందోళన చెందుతున్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వచ్చాక చెరకు రైతుల జీవితాల్లో మాధుర్యం తెస్తాం. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నాం. దీంతో దాదాపు రూ.8వేల కోట్ల వరకు చెరకు రైతులు లబ్ధి పొందుతున్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశాం. ఏపీలో కాంగ్రెస్‌ పోయి వైసీపీ వచ్చినా మార్పులేదు. రెండూ అవినీతి పార్టీలే. పక్కనే ఉన్న కర్నాటకలో ట్యాంకర్‌ మాఫియా, భూ మాఫియాతో ప్రభుత్వం నడుపుతున్నారు. ఏపీలో శాండ్‌, ల్యాండ్‌, మద్యం మాఫియాతో పాలన సాగిస్తున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విముక్తి చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఎన్నుకోవాలి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తాం’’ అని పేర్కొన్నారు. అనకాపల్లి నుంచి అనంతపురం వరకూ ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మించామని, రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వరకూ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణంలో ఉందని చెప్పుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏపీలోని యువత కోసం పనిచేస్తోందంటూ… ట్రిపుల్‌ ఐటీ, ఐసర్‌, ఐఐఎం లాంటి జాతీయ విద్యా సంస్థలు ప్రారంభించామన్నారు. వైసీపీ మంత్రం అవినీతి అని, ఎన్డీయే మంత్ర అభివృద్ధి అని చెప్పారు. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పిస్తోందని మోదీ ఆరోపించారు. విశాఖ రైల్వేజోన్‌ మంజూరు చేసినా… రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా ఇవ్వడం లేదన్నారు. పేదల కోసం 21లక్షల పీఎంఏవై గృహాలు మంజూరు చేస్తే.. వాటిలో సగం కూడా వారికి ఇవ్వలేదన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగిందన్నారు. కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూ… ‘పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధోగతి పాలు చేసింది. ఈడీ.. ఈడీ.. అంటూ ఇండియా కూటమి గగ్గోలు పెడుతోంది. కాంగ్రెస్‌ నేతల వద్ద గుట్టల కొద్దీ డబ్బు బయట పడుతోంది. ఆ పార్టీ నేతల డబ్బును మెషీన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయి’ అన్నారు. రాజమండ్రి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ… భారత సమాజానికి గుండె ధైర్యమే మోదీ అన్న పవన్‌ … పదేళ్ల పాలనలో శత్రువులు భారత్‌వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. కేంద్ర పథకాలను వైసీపీ తన పథకాలుగా చెప్పుకొంటోందన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూడా ప్రసంగించారు. కాగా అనకాపల్లి సభలో మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అయితే మోదీ ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత చంద్రబాబు సభలో మాట్లాడారు. . ప్రధాని మోదీ అనకాపల్లి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చారని తెలిపారు. తద్వారా రాబోయే రోజుల్లో ఏపీకి అన్నీ మంచి శకునాలే, వైసీపీకి అన్నీ పీడ శకునాలే అని అభివర్ణించారు.
మూడు పార్టీలు ఎందుకు కలిశాయని చాలామందికి సందేహాలు ఉన్నాయని, దానిపై నిన్న అమిత్‌ షా స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఇవాళ మోదీ చాలా స్పష్టంగా చెప్పారని వెల్లడిరచారు. నిన్న ఉద్యోగులను చూస్తే కడుపు నిండిపోయింది. నిన్న, ఇవాళ పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైసీపీ వాళ్లు వెళితే… ఒంగోలులో ఛీ కొట్టారని చెప్పారు. ‘ఇవాళ మోదీ చెప్పినట్టు మళ్లీ పోలవరం కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మోదీ గ్యారెంటీలను, మన మేనిఫెస్టోను శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి’ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img