Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

మోదీ, బాబు కూటమిమళ్లీ మోసం

రాష్ట్ర అవసరాలు ప్రస్తావించని వైనం

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : రాష్ట్ర ప్రజలను మోదీ, బాబు కూటమి మరోసారి మోసం చేసింది. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం రాజుపాలెం వద్ద ఎన్‌డీఏ కూటమి సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కనీసం పెదవి విప్పలేదు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై తమ వైఖరి వెల్లడించకపోయినా ప్లాంట్‌ను ప్రైవేటీకరించే మోదీని భుజానికి ఎత్తుకొని చంద్రబాబు మాట్లాడారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేశ్‌ మాత్రం…మోదీతో తనకు అత్యంత సాన్నిహిత్యం ఉందని ప్రగల్భాలు పలికారు. తనను గెలిపించాలని వేడుకున్నారు. కానీ విశాఖ ప్రైవేటీకరణపై మోదీతో ఒక్క మాట చెప్పించలేకపోయారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మోదీతో ఎందుకు ప్రకటన చేయించలేకపోయారని చంద్రబాబును, సీఎం రమేశ్‌ను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు ప్రశ్నించారు. పోలవరం నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇచ్చానని, అవన్నీ కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లాయని మోదీ చెప్పుకున్నారు. స్థానికుల పునరావాసం గురించి ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉపసంహరణ ప్రకటన, సొంత గనులు కేటాయింపు వంటి ప్రాధాన్యత అంశాలను విస్మరించారు. విశాఖ రైల్వేజోన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలేవీ ప్రస్తావించకుండా జగన్‌ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమయ్యారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, సీపీఎస్‌ రద్దు వంటి అంశాలపై స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ గొంతుకోసింది టీడీపీ అయితే…వైసీపీ వచ్చాక తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు మూసివేశారు. వీటికి ప్రధాన కారణం మోడీ ప్రభుత్వ విధానాలే. చెరుకు రైతులు గురించి మాట్లాడిన మోదీ… ఆ రైతులకు జీవనాధరమైన షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణ గురించి ప్రస్తావించకపోవడం రైతులను మోసగించడం తప్ప మరొకటి కాదు. పేదరికం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా రామమందిర నిర్మాణాన్ని విజయంగా చెప్పుకోవడం బాధ్యతారాహిత్యమే. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టారు. ప్రజలు అప్రమత్తమై బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ను, ఆ పార్టీకి మద్ధతిస్తున్న టీడీపీ, జనసేనలను, బీజేపీతో అంటకాగుతున్న వైసీపీని ఓడించడం ద్వారా దేశ ఐక్యతను, మత సామరస్యాన్ని కాపాడుకోగలమని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img