Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఏపీలో హోరా హోరీ

. పతాకస్థాయికి ఎన్నికల ప్రచారం
. అన్ని పార్టీల అగ్ర నేతల విస్తృత పర్యటనలు
. వైసీపీ, ఎన్‌డీఏకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇండియా కూటమి
. నేడు విజయవాడ, గుంటూరు నగరాల్లో ‘ఇండియా’ సభలు
. హాజరుకానున్న ఖడ్గే, రాజా, ఏచూరి
. నేడు ఒకేరోజు 5 సభల్లో చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ముగింపు ఘడియలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం పతాకస్థాయికి చేరింది. ఇంటింటి ప్రచారాలు, ప్రదర్శనలు, ఆయా పార్టీల అధినేతల రోడ్‌ షోలు, బహిరంగ సభలు, మోటారు సైకిళ్ల ర్యాలీలు, మైకుల ధ్వనితో ప్రచారం హోరెత్తుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరపున సీఎం జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. తనను చూసి ఓటెయ్యాలని, మీ ఇంట్లో మేలు జరిగిందని భావిస్తే దీవించాలని కోరుతున్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టో 99 శాతం అమలు చేసి ధైర్యంగా ఓటు అడుగుతున్నానని చెబుతున్నారు. మరోపక్క గతంలో ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండానే, మరలా ఇప్పుడు అలవికాని హామీలతో మిమ్మల్ని మోసగించేందుకు వస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమి తరపున టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజాగళం పేరిట వీరు ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పలమనేరులో మార్చి 27న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పటికే 82 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేశారు. శనివారం ఒక్కరోజే ఐదు నియోజకవర్గాల్లో ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు సభల్లో పాల్గొననున్నారు. ప్రచార గడువు ముగిసేనాటికి 90 నియోజవర్గాలు పూర్తవనున్నాయి. అలాగే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కూడా ఎన్‌డీఏ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వేర్వేరుగా రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతి, అక్రమాలను ఎన్‌డీఏ నేతలు వివరిస్తున్నారు. మరోవైపు, 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలను గెలిపించినా విభజన అంశాల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయించలేకపోవడం, అమరావతి విధ్వంసం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోవడం, ఏపీ అప్పును రూ.13 లక్షల కోట్లకు చేర్చడం, సొంత బాబాయి వివేకా హత్య కేసును నీరుగార్చిన తీరు, సీఎం సొంత చెల్లెల్లు షర్మిల, సునీతే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తుండటం, అన్నింటికి మించి రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడటం, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, పోలీసుల అరాచకాలు తదితర అంశాలపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు వివరిస్తూ, మళ్లీ వైసీపీ గెలిస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందని హెచ్చరిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఎన్‌డీఏ కూటమి అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
‘ఇండియా’ అభ్యర్థుల ప్రచారానికి విశేష స్పందన
ఇండియా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా సాగుతోంది. ఎర్రని జెండాలు, గొడుగులు, ప్రజానాట్య మండలి కళాకారుల గేయ బృందాలతో సాగుతున్న వీరి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రచారంలో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌తో పాటు ఆయా పార్టీల ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలకు చెందిన శ్రేణులు ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం ఎవరికి వారే స్వచ్ఛందంగా విస్తృత ప్రచారం చేపడుతున్నారు. చట్ట సభల్లో కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల జరిగే నష్టాలను ఓటర్లకు వివరిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులకు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఈ దేశంలో ప్రజాస్వామ్య రక్షణకు, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ‘ఇండియా’ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. సీపీఐ, సీపీఎం చెరో 8 అసెంబ్లీ, ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప పార్లమెంటు నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితమై ప్రచారం నిర్వహిస్తుండగా, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఇండియా కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన గుంటూరు, విజయవాడ నగరాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వీటికి ముఖ్య అతిథులుగా సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖడ్గేతో పాటు రాష్ట్ర నేతలు హాజరవుతున్నారు. ‘ఇండియా’ అభ్యర్థులు రాష్ట్రంలోని వైసీపీ, ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మొత్తానికి ఎన్నికల ప్రచారానికి ఇక 48 గంటల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో రాష్ట్రంలో ఎటు చూసినా ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img