Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

నూతన డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా

ఈసీ ఆదేశాలతో వెంటనే బాధ్యతల స్వీకరణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్‌రెడ్డికి సమాచారం అందించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం గుప్తా డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ ), మాదిరెడ్డి ప్రతాప్‌, హరీశ్‌కుమార్‌ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్‌కుమార్‌ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది. వాస్తవానికి ద్వారకా తిరుమలరావు 1990 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆయనే డీజీపీగా ఎంపిక కావచ్చునని పోలీస్‌ వర్గాలు భావించాయి. ఆయన ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాదిరెడ్డి ప్రతాప్‌ 1991, హరీశ్‌కుమార్‌ గుప్తా 1992 బ్యాచ్‌లకు చెందినవారు. హరీశ్‌కుమార్‌ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. మరోవారంలో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్న ఆయనవైపే ఈసీ మొగ్గు చూపింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. తొలినాళ్లలో మెదక్‌, కరీంనగర్‌ ఏఎస్పీగా, తర్వాత కృష్ణా, నల్గొండ జిల్లాలకు ఎస్పీగా, గుంటూరు రేంజ్‌ ఐజీగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2022లో డీజీపీ ర్యాంక్‌ ప్రమోషన్‌ పొందారు. ద్వారకా తిరుమలరావు నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపకపోవడంతో గుప్తా ట్రాక్‌ రికార్డును పరిశీలించిన ఈసీ ఆయనను నూతన డీజీపీగా నియమించి తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఆ మేరకు హరీశ్‌కుమార్‌ గుప్తా సోమవారం డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌లో బాధ్యతలు స్వీకరించగా, పోలీస్‌ ఉన్నతాధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img