Monday, May 20, 2024
Monday, May 20, 2024

బీజేపీలో దుమారం

. కాషాయ పార్టీ అభ్యర్థుల్లో టీడీపీ ముద్ర?
. ఓట్ల బదిలీపై ఆందోళన
. నేతల్లో అసంతృప్తి జ్వాల
. కేంద్ర నేతలకు బీజేపీ ఫిర్యాదులు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : బీజేపీ రాష్ట్ర పార్టీలో తీవ్ర దుమారం చెలరేగింది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లకు అభ్యర్థుల ఎంపిక తీరుపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఓటమి పాలయ్యే సీట్లను టీడీపీ కట్టబెడుతోందంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీకి ఐదు ఎంపీ, పది అసెంబ్లీ స్థానాలను టీడీపీ కేటాయించింది. దేశ వ్యాప్తంగా ఎన్‌డీఏ కూటమిపైన, నరేంద్ర మోదీపై ఉన్న వ్యతిరేకతతో ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలులో బీజేపీ పూర్తిగా విఫలమైంది. ప్రజల నుంచి వాటిని చెరిపివేసే దిశగా బీజేపీ తనదైన శైలిలో మతపరమైన అంశాలతో ముందుకు వెళుతోంది. 2019 ఎన్నికల్లో ఒక శాతంలోపు ఓటింగ్‌ ఉన్న బీజేపీ ఓట్ల వాటాపై కలవరం చెందుతోంది. టీడీపీ, జనసేన ఓట్లు బీజేపీకి మరలుతాయా?, లేదా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. ఈ కూటమిలో టీడీపీ ఇప్పటివరకు మూడు జాబితాలను విడుదల చేసింది. బీజేపీ మాత్రం వెనుకబాటుకు గురైంది. ఎంపీ స్థానాల కోసం అంతా టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన నేతలుగానీ లేక చంద్రబాబుకు సానుకూలంగా ఉన్న వారు గానీ పోటీలో ఉండేలా కసరత్తు చేయడంపై బీజేపీలో పెద్ద దుమారం నెలకొంది. తొలుత విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఒంగోలు, రాజంపేట, హిందూపురం ఎంపీ స్థానాలను బీజేపీ ఆశించింది. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన 13 ఎంపీ స్థానాల్లో విశాఖపట్నం, హిందూపురం ఎంపీ స్థానాలు ఉన్నాయి. విశాఖపట్నం టీడీపీ అభ్యర్థిగా మాత్కుమిల్లి భరత్‌, హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని ప్రకటించారు. దీంతో తాము కోరిన స్థానాలు ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు అసంతృప్తికి గురవుతున్నారు.
టీడీపీకే విశాఖ… జీవీఎల్‌కు చుక్కెదురు
బీజేపీ నాయకుడు జీవీఎల్‌ నరసింహారావు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు కొంత కాలంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గర సైతం ఆయన పోటీకి సానుకూల వాతావరణం ఏర్పడిరది. టీడీపీతో పొత్తు కారణంగా విశాఖ ఎంపీ సీటును బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కు ఇవ్వడంతో ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఈ ఎన్నికల్లో జీవీఎల్‌కు సీటు లేనట్లేనని స్పష్టమైంది. ఏలూరు ఎంపీ సీటు కోసం మాజీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడ బీజేపీ నేత మరొకరు తనకు బీజేపీ ఎంపీ టికెట్‌ వస్తుందని ఆశించారు. దీంతో టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్‌ యాదవ్‌ను ప్రకటించడంపై అక్కడ బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లేందుకు దాదాపు ఖరారైంది. ఇక్కడ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజు మాత్రం పొత్తుల్లో భాగంగా టీడీపీ లేదా, బీజేపీలో ఎవ్వరికి ఖరారైనా తానే అభ్యర్థిననే దీమాతో ఉన్నారు. అయితే నరసాపురం ఎంపీ స్థానం బీజేపీకి ఇస్తే, బీజేపీలో ఉన్న అసలైన నేతలకు మాత్రమే ఇవ్వాలంటూ ఆ పార్టీ రాష్ట్ర నేతలు పట్టుపడుతున్నారు. దీంతో రఘురామ కృష్ణరాజు సీటుకు ఎసరు పడే అవకాశముంది. అటు పొత్తుల్లో భాగంగా టీడీపీకి ఆ సీటు వచ్చినా, అక్కడ రఘురామ కృష్ణరాజుకు ఎంపీ అభ్యర్థి ఇచ్చే అంశంపై టీడీపీ ఆలోచనలో పడిరది. గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన అనంతరం దాదాపు నాలుగున్నరేళ్లపాటు ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీయలేదు. దీంతో ఆయన టీడీపీ, లేదా బీజేపీ నుంచి పోటీకి దిగితే ఓటమి తథ్యమనే సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే నరసాపురం వైసీపీ ఎంపీ సీటును బీసీ మహిళలకు కేటాయించింది. దానికి అనుగుణంగా బీజేపీ లేదా టీడీపీ అభ్యర్థిని నిలిపే ఆలోచనలు ఉన్నాయి. ఇది రఘురామ కృష్ణరాజుకు మింగుడు పడటం లేదు.
సీఎం రమేశ్‌పై వ్యతిరేకత
అనకాపల్లి నుంచి బీజీపీ నేత సీఎం రమేశ్‌ బరిలో దిగేందుకు అన్ని విధాలా. చక్కదిద్దుకున్నారు. ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా మెలుగుతున్నారు. సీఎం రమేశ్‌కు అనకాపల్లి టికెట్‌ ఇవ్వడంపై సొంత బీజేపీలోనే వ్యతిరేకత నెలకొంది. తాజాగా ఆయనపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సినీనటుడు వేణు ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. వేణుకు చెందిన పీసీఎల్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో రూ.450 కోట్ల మేర మొత్తానికి రమేశ్‌ ఫోర్జరీకి పాల్పడినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇది సీఎం రమేశ్‌కు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు రాజమండ్రి పార్లమెంటు సీటుపై, పోటీ చేసే స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. రాజంపేట ఎంపీ బరిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, బీజేపీ నేత సత్యకుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వైసీపీ కంచుకోటగా రాజంపేట ఎంపీ స్థానం ఉంది. అటు ఎమ్మెల్యే సీట్లపైనా బీజేపీ ఆశించిన సీట్లు కాకుండా, టీడీపీ ఓటమి పాలయ్యే సీట్లను బీజేపీకి కేటాయించడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఓడిపోయే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను బీజేపీకి అంటగట్టి, టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తోందని బీజేపీ శ్రేణులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img