అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు అధికారికంగా ఖరారైంది. మిల్వాకీలో జరిగిన ఆ పార్టీ జాతీయ సదస్సులో ఈ మేరకు ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదం లభించింది. అయితే, ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జేమ్స్ డేవిడ్ వాన్స్‌ను ట్రంప్ ఎంపిక చేశారు. దీంతో ఆయన ఎవరు అనే చర్చ జరుగుతోంది. అయితే, జేడీ వాన్స్ సతీమణి తెలుగు కుటుంబానికి చెందిన మహిళ కావడం విశేషం. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్. ఉషా తల్లిదండ్రులు తెలుగు గడ్డ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. దక్షిణ ఓహియోలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన వాన్స్ బాల్యం కష్టాలతో సాగింది. మెరైన్ కార్ప్స్లో పనిచేస్తూ.. విద్యాభ్యాసం కొనసాగించారు. యేల్ లా స్కూల్ నుంచి స్కాలర్షిప్ను అందుకున్నారు. లా డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. యేల్ లా జర్నల్‌కు సంపాదకుడిగా ఉన్నారు. తరువాత శాన్ ఫ్రాన్సిస్కోలో వెంచర్ క్యాపిటలిస్ట్‌గా పనిచేశారు. ఆర్థిక అసమానతలపై వాన్స్ రాసిన ాహిల్బిల్లీ ఎలెజీ్ణ పుస్తకం అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోవడంతోపాటు సినిమాగానూ రూపొందింది. బాల్యంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్న తాను.. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన తీరును వాన్స్ కళ్లకు కట్టారు..అనంతరం 2016లో రాజకీయాల్లోకి వచ్చిన వాన్స్.. 2022లో ఓహియో నుంచి అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయనను ఇడియట్, అమెరికా హిట్లర్ అంటూ విమర్శలు గుప్పించారు. చివరకు ఆయనకు వీరవిధేయుల్లో ఒక్కరిగా మారారు. జనవరి 6, 2021లో అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన కీలక పాత్ర పోషించడం గమనార్హం.ఇక ఉషా చిలుకూరి విషయానికి వస్తే.. ఆమె తల్లిదండ్రులు ఏపీకి చెందినవారు. ఉషా మాత్రం 1986లో అమెరికాలో జన్మించారు. యేల్ వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ చదివిన ఉషా.. లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. యేల్ యూనివర్సిటీ లా అండ్ టెక్ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్‌గా, లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. యేల్ యూనివర్సిటీలోనే జేడీ వాన్స్‌తో ఉషా చిలుకూరికి పరిచయమైంది. తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయంలో వాన్స్-ఉష వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వాన్స్ విజయంలో ఉషా పాత్ర ఎంతో కీలకం. రాజకీయంగా ఆయనకు అనేక అంశాల్లో మద్దతుగా నిలవడమే కాదు… హిల్‌బిల్లీ ఎలెజీ రచనలో ఆయనకు సహకారం అందించారు. ఒహియో సెనేటర్‌గా ఆయన పోటీచేసినప్పుడు ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. వాన్స్ ప్రజాకర్షక విధానాలతో ముందుకెళ్తున్నారని ప్రత్యర్ధులు చేసిన విమర్శలను దీటుగా తిప్పికొట్టారు.