సినీ నటుడు రాజ్ తరుణ్‌కు హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా రాజ్ తరుణ్‌కు ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కొత్త న్యాయచట్టం బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు ఇచ్చారు. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అతనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ 1గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రని పేర్కొన్నారు. మాల్వీ సోదరుడు తనను చంపేస్తానని బెదిరించాడని లావణ్య పేర్కొంది. వారిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.