Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

దేశంలో కొనసాగుతున్న నాలుగో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై, మాధవీలతపై కేసు నమోదు

దేశంలో సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా.. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతోపాటు తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామునుంచే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూ లైన్లలో నిలుచుంటున్నారు. ఎండ వస్తే తట్టుకోలేమని భావించిన ఓటర్లు.. ఉదయం 7 గంటల లోపే పోలింగ్ బూత్ లకు చేరుకుంటున్నారు. ఇక తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పలు చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది.
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించడంతో మంగళ్ హట్ పోలీస్ స్టేషన్‌లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు.

మాధవీలతపై కేసు నమోదు
మరోవైపు.. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలతపై కేసు నమోదు అయింది. ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళల బురఖాలు తీసి వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేయగా.. కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు.

ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా వెళ్లి ఓటు వేశారు. కొడంగల్‌లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు.. తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేశారు. సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తమ తమ నియోజకవర్గాల్లో ఓటు వేసిన మంత్రులు
నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబంతో కలిసి వెళ్లి ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి, సూర్యాపేట జిల్లా కోదాడలో మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటు వేశారు.

ఓటు వేసిన కేటీఆర్
బంజారాహిల్స్‌లోని నందీనగర్‌లో ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఓటు వేశారు. సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న వెంకయ్యనాయుడు
ఇక హైదరాబాద్‌లో పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి వచ్చి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img