Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

వెయ్యి కోట్లు అడిగానని రుజువు చేయండి రాజకీయాలు వదిలేస్తా: వైఎస్ షర్మిల

కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని.. తాను రూ.వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. తాను జగన్‌ను ఒక్క పైసా సహాయం అడగలేదని.. ఒకవేళ తీసుకున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. జగన్ పక్కన ఉండే వాళ్లు ఊసరవెల్లులు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక పుట్టుకనే అనుమానిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను రూ. వెయ్యి కోట్లు కాదు.. రూ.10వేల కోట్ల వర్క్ అడిగానని కూడా ప్రచారం చేస్తారన్నారు. ఇలా మాట్లాడిన వాళ్లకు ఎంత అందుతుందో చెప్పాలన్నారు. జగన్‌ను చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన తల్లి విజయమ్మపై నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని జగన్ అన్నారని.. అంతా నమ్మారు, ఆ సంస్థపై దాడులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వారికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని షర్మిల ఆరోపించారు. వివేకా హత్య కేసుపై జగన్‌ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని.. అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అప్పుడో మాట, ఇప్పుడో మాట మాట్లాడారన్నారు. తన భర్త అనిల్ పై అవినాష్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. అవినాష్ రెడ్డిలా అర్థరాత్రి గొడ్డలితో వెళ్లడం తమకు చేతకాదన్నారు. అనిల్‌ బీజేపీ నేతలను ఎక్కడా కలవలేదు.. ఏ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. కంటికి కనిపించని పొత్తును జగన్‌ కొనసాగిస్తున్నారని షర్మిల విమర్శించారు. క్రైస్తవులపై దాడి ఘటనలో కూడా వైఎస్సార్‌సీపీ స్పందించలేదని.. అదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను సీఎం దోచిపెట్టారని ధ్వజమెత్తారు. జగన్‌ బీజేపీ దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్‌ చెప్పారని.. ఆయన మోదీ వారసుడిగానే ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఇంత అవినీతిలో కూరుకుపోయినా బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. జగన్‌ ఆ పార్టీకి దత్తపుత్రుడు, తొత్తు కాబట్టే చర్యలు తీసుకోలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img