Thursday, October 31, 2024
Thursday, October 31, 2024

నెల వ్యవధి ఉండాల్సిందే

. ఏపీ టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌ మార్చాలి
. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
. అభ్యర్థులకు ఊరట

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ టెట్‌, డీఎస్సీ-2024 పరీక్షల మధ్య కనీసం నాలుగు వారాల సమయం (నెల రోజులు) ఉండాలని, ఆ దిశగా షెడ్యూలు మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వానికి కొంత ఎదురుదెబ్బ తగిలినట్లయింది. నాలుగున్నరేళ్లు డీఎస్సీ ఇవ్వకుండా ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రభుత్వం టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లు వేర్వేరుగా జారీజేసింది. ఈ రెండు పరీక్షల మధ్య అతి తక్కువ వ్యవధి మాత్రమే ఉంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టెట్‌ పరీక్ష ఫీజు, దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా ఫిబ్రవరి ఎనిమిది నుంచి 18వ తేదీ వరకు స్వీకరించారు.పరీక్షలకు ఫిబ్రవరి 27 నుంచి ఈనెల ఆరో తేదీ వరకు షెడ్యూలు జారీజేశారు. ఆ దిశగా అభ్యర్థులు ఆయా సబ్జెక్టులకు అనుగుణంగా పేపర్‌ -1(ఏ), (బి), పేపర్‌ -2(ఏ), (బీ) పరీక్షలు రాస్తున్నారు. టెట్‌ కీను ఈనెల 10న విడుదల చేసి, అభ్యంతరాలను 11వ తేదీన స్వీకరిస్తారు. ఫైనల్‌ కీ 13న ప్రకటించి 14వ తేదీన తుది కీ ప్రకటిస్తారు. దీంతో టెట్‌ పరీక్షల షెడ్యూలు ప్రక్రియ గత నెల ఫిబ్రవరి ఎనిమిది నుంచి ప్రారంభమై ఈనెల 14వ తేదీతో ముగుస్తుంది.
డీఎస్సీ పరీక్షలకు ఫిబ్రవరి 12న నోటిఫికేషన్‌ జారీజేశారు. పరీక్ష ఫీజు, దరఖాస్తుల నమోదుకు ఆన్‌లైన్‌ ద్వారా అదేరోజు నుంచి 24 వరకు అవకాశమిచ్చారు. హాల్‌ టికెట్లను ఈనెల 5న విడుదల చేస్తారు. డీఎస్సీ పరీక్షలను 15వ తేదీ నుంచి 30వరకు ఆయా సబ్జెక్టుల ఆధారంగా నిర్వహిస్తారు. డీఎస్సీ కీ ఈనెల 31 న ప్రకటించి, వాటిపై అభ్యంతరాలను ఏప్రిల్‌ మూడో తేదీన స్వీకరిస్తారు. తుది కీను ఎనిమిదిన ప్రకటించి, తుది ఫలితాలను 15వ తేదీన వెల్లడిస్తారు. దీని ఆధారంగా చూస్తే, ఏపీ డీఎస్సీ షెడ్యూలు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభమై ఏప్రిల్‌ 15 వరకు కొనసాగనుంది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల మధ్య కనీసం నెల రోజుల వ్యవధి కూడా లేదు. దీనిపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట లభించింది. 2018లో జరిగిన టెట్‌, టీఆర్టీ మధ్య తగిన సమయం ఇచ్చారని, ఇప్పుడు మాత్రం హడావుడిగా నిర్వహిస్తున్నట్లు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పరీక్షల మధ్య నాలుగు వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తర్వాత కీపై అభ్యంతరాల స్వీకరణకూ వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. నిరుద్యోగులను మభ్యపెట్టేందుకుగాను ఎన్నికల ముందు హడావుడిగా 6,100 పోస్టులతో జారీజేసిన డీఎస్సీకి ఆటంకాలు ఎదురయ్యాయి. హైకోర్టు తీర్పు ఆధారంగా పరీక్షల మధ్య వ్యవధి పెంచితే, డీఎస్సీ పరీక్షలను మరో నెల రోజులు పొడిగించే అవసరముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img