Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఇది మా రాష్ట్ర ప్రజల మన్ కి బాత్ మోదీజీ..మీరు వినాలి…

పది పాయింట్లతో ప్రధానిపై  చార్జిషీట్ విడుదల చేసిన ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల

పదేళ్ల పాలనలో దేశంలోని అన్నివర్గాల వారినీ మోదీ మోసం చేశారంటూ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మతం పేరుతో దేశ ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల చార్జిషీట్ విడుదల చేశారు. ప్రధానిగా మోదీ పది ఫెయిల్యూర్లను ఎత్తిచూపుతూ దీనిని రూపొందించినట్లు చెప్పారు. తిరుమల సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి ఏపీ ప్రజలను మోసం చేశారని షర్మిల ఆరోపించారు. కేంద్రంలో మోదీ పాలనలో ఏపీ తీవ్రంగా నష్టపోయి అన్నివిధాలుగా నాశనమైందని తీవ్ర విమర్శలు చేశారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ కేంద్రంలోని బీజేపీకి అంటకాగుతూ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని చెప్పారు.

కుమారుడి కోసం చంద్రబాబు.. కేసుల భయంతో జగన్.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని నిలదీసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. గడిచిన రెండు పర్యాయాలు ఒక్కొక్కరితో దోస్తీ చేసిన బీజేపీ ఈసారి మాత్రం తెరపైన చంద్రబాబుతో, తెరవెనుక జగన్ తో చేతులు కలిపి సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారని షర్మిల విమర్శించారు. పదేళ్లుగా అన్నివిధాలుగా ఆంధ్రప్రదేశ్ వినాశనంలో ఇక్కడి పాలక, ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి, కీలక పాత్ర పోషించిన మోదీ గారిపై, రాష్ట్రానికి సంబంధించి పది అతిముఖ్య వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేశాము. మీ మన్ కీ బాత్ కాదు మోదీజీ, ఇది మా రాష్ట్ర ప్రజల మన్ కి బాత్, ఇది స్పష్టంగా ఘోషిస్తోంది మీరు నేరస్తులని అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగుపెట్టిన ప్రతిసారీ రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని షర్మిల పేర్కొన్నారు.

పది అంశాలతో చార్జిషీట్..

పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అని హామీ ఇచ్చారు.. ఆ తర్వాత మాట మార్చి మా రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు.
జగన్ రివర్స్ టెండరింగ్ ను అడ్డుకోకపోగా పోలవరం ఎత్తు తగ్గించే కుట్రలు చేస్తూ ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారు.
నాడు మీరు భూమి పూజ చేసిన అమరావతి పదేళ్ల తర్వాత కూడా నేటికీ నిర్మాణం పూర్తికాలేదు.
ప్రజా పోరాటాలు, ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మేద్దామని ప్రయత్నిస్తూ మళ్లీ విశాఖపై దొంగ ప్రేమను ఒలకబోస్తున్నారు.
విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు.. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ తదితర హామీలను అమలు చేయకుండా ఏపీకి తీరని అన్యాయం చేశారు.
మీ దత్తపుత్రుడు మద్యం సిండికేటు నడుపుతూ కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా మీలో చలనం లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు కానీ ఏపీలో ఎలాంటి చర్యలు తీసుకోలేదేం?
దేశంలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ఫిర్యాదులపై ఉలుకూ పలుకు లేకుండా ఏపీ సర్కారును ప్రశ్నించకుండా, చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారు.
ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, దొడ్డిదారిలో ఏపీ సర్కారు చేస్తున్న అప్పులపైనా ఎలాంటి హెచ్చరికలూ లేవు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కర్నూలు వచ్చిన సీబీఐ బృందం.. శాంతిభద్రతల సమస్య పేరుతో వెనుదిరిగినా కేంద్ర ప్రభుత్వం మిన్నకుండిపోవడం యావత్ దేశానికే అవమానం.
దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ మాటిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీనే మరిచిపోయారు. నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img