న్యూదిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం`2019 నిబంధనలను సవరించి హోం శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వులతో జమ్మూకశ్మీర్‌కు మోదీ ప్రభుత్వ నమ్మకద్రోహం నిరాటంకంగా కొనసాగుతోందని స్పష్టమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే వ్యాఖ్యానించారు. మోదీ హయాంలో నిత్య ‘సంవిధాన్ హత్యా దివస్’కు మరొక ఉదాహరణ ఇదని ‘ఎక్స్’లో విమర్శించారు. ‘జమ్మూకశ్మీర్‌ను మోదీ ప్రభుత్వం మోసగిస్తోంది. ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోకి కొత్త సెక్షన్లను చేర్చి లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. సెప్టెంబరు 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని తాజా పరిణామంతో స్పష్టమైంది. ఒకవేళ రాష్ట్ర హోదాను పునరుద్ధరించినా కొత్త ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దయదాక్షిణ్యాలకు వదిలేయాలని సర్కార్ భావిస్తోందని అర్థమవుతోంది’ అని ఖడ్గే వ్యాఖ్యానించారు.