. సమసమాజ స్థాపన, రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యత అవసరం
. పార్టీ బలోపేతానికి పటిష్ఠ చర్యలు
. పార్టీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి
. సీపీఐ జాతీయ సమితి నిర్ణయాలు
న్యూదిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మతోన్మాదం మరింత బలపడుతోందని, ప్రజాస్వామ్యవాదులకు ఇది సవాల్‌గా మారుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. విద్వేష రాజకీయాలపై సైద్ధాంతిక పోరాటాలు ఉధృతం చేయాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. భారత్‌లోనే కాకుండా యూరప్‌లోనూ మతతత్వ రాజకీయ శక్తులు బలపడ్డాయని, శరణార్థులు, వలసవాదులు, ముఖ్యంగా ముస్లింలను ద్వేషించే రాజకీయ ధోరణి ఆందోళనకరమని తెలిపారు. ఉదాసీన, ప్రజాస్వామ్య పార్టీలు, వామపక్షాలకు, మైనారిటీలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సాగించే దమననీతిని పటిష్ఠ సైద్ధాంతిక పోరాటంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏకపార్టీ పాలన వ్యూహంలో బీజేపీ విఫలమైనప్పటికీ దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగిస్తోందని విమర్శించారు. నయా ఉదారవాద విధానాలను విచ్ఛిన్నం చేయడం, కార్పొరేట్ల అజెండాకు పదును పెంచడం వంటివి జరుగుతున్నాయని రాజా విమర్శించారు. ఈ పరిస్థితుల్లో లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు ఐక్యంగా లౌకిక, ప్రజాస్వామిక సమాజాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అత్యవసరమని నొక్కిచెప్పారు. ఈ లక్ష్యసాధన కోసం ఇండియా ఐక్య సంఘటన పోరాటం పార్లమెంటు లోపల, బయట కొనసాగుతోందని తెలిపారు. ఈనెల 13,14,15 తేదీల్లో న్యూదిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్భవన్లో జరిగిన పార్టీ జాతీయ సమితి సమావేశాల నిర్ణయాలను డి.రాజా మంగళవారం మీడియాకు వెల్లడిరచారు. సమావేశాల్లో మొత్తం 11 తీర్మానాలు ఆమోదించినట్లు రాజా చెప్పారు. సమావేశాల్లో రాజకీయఆర్థిక పరిణామాలు, సార్వత్రిక ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బలమైన శక్తిగా ఇండియా ఐక్య సంఘటన ఆవిర్భవించిందని, భవిష్యత్‌లో మరింత బలోపేతం కానున్నదని రాజా దీమాగా చెప్పారు. ప్రతిపక్షాలపై బీజేపీ కక్షసాధింపునకు పాల్పడుతోందని, మోదీ సర్కారు అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన చెప్పారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలును ఆక్షేపించారు. 543 స్థానాల్లో కేవలం తొమ్మిది (సీపీఐ 2, సీపీఎం 4, సీపీఐఎంఎల్ 2, ఆర్ఎస్పీ 1) సీట్లను వామపక్షాలు గెలుచుకోవడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని రాజా తెలిపారు. పార్టీ బలోపేతానికి, ఉద్యమ పునరేకీకరణకు సూచనలు చేశారన్నారు. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీన సీపీఐ 100వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. పార్టీ, వామపక్ష ఉద్యమాన్ని పునరుత్తేజపర్చే కార్యకలాపాలు జరగబోతున్నట్లు తెలిపారు. వామపక్ష పార్టీన్నింటినీ కలుపుకొని ప్రజల జీవనోపాధి సమస్యల పరిష్కారానికి సుస్థిర పోరాటాలు సాగించాలని నిర్ణయించామన్నారు. ఈ పోరాటాలు జాతీయ, ప్రాంతీయ పార్టీలపై సైద్ధాంతికంగా, రాజకీయంగా ప్రభావం చూపుతాయని రాజా చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలు...నాటోకు వ్యతిరేకంగా, పలస్తీనియన్లకు సంఫీుభావంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా, రాష్ట్ర
జిల్లా స్థాయిల్లో అధికార దుర్వినియోగానికి విరుద్ధంగా ఉధృత ఉద్యమాలు సాగించాలని నిర్ణయించామన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా ఐక్య సంఘటనలో భాగంగా కమ్యూనిస్టు, వామపక్షాల పునరేకీకరణకు పార్టీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్మికులు, కర్షకులు, యువత, మహిళలు, విద్యార్థుల ఐక్య పోరాటాలు, స్వతంత్ర పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవాలని, ప్రజాస్వామిక, మానవహక్కుల పరిరక్షణకు పాటు పడాలని నిర్ణయించినట్లు చెప్పారు. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూకశ్మీర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాజకీయంగానే కాకుండా సంస్థాగతంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టాలని నిర్ణయించామని రాజా వెల్లడిరచారు. సమావేశాలు ఆమోదించిన 11 తీర్మానాలను వివరించారు.
1) ఆరోగ్య బడ్జెట్ పెంచాలి: జీడీపీలో 3 శాతం నిధులను ఆరోగ్యం కోసం కేటాయించాలని సీపీఐ జాతీయ సమితి సూచించింది. తద్వారా ప్రజారోగ్య మౌలికవసతులు పటిష్ఠపర్చుకోవచ్చు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించవచ్చు. వైద్యారోగ్య కార్యక్రమాలు, పథకాలు విస్తరించవచ్చు. ఆరోగ్య పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలు పెంపొందించుకోవచ్చని తీర్మానం పేర్కొంది. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యానికి జీడీపీలో 3 శాతం కేటాయించడం ద్వారా దేశ ఆరోగ్యసంరక్షణ రంగాన్ని బలోపేతం చేయాలని ఆర్థిక మంత్రిని కోరుతూ తీర్మానించింది.
2) అధిక ఉష్ణోగ్రతల బాధితులకు చేయూత: అధిక/శీతల ఉష్ణోగ్రతల కారణంగా చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానించింది. ఆహారం, నీరు, వసతి, ప్రోత్సాహకాలు అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తీర్మానం పేర్కొంది. కార్మికశాఖ, రెవెన్యూ శాఖ, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా అధిక/శీతల ఉష్ణోగ్రతలతో కార్మిక, రైతు కుటుంబాలు ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు జరిగిన నష్టాన్ని కచ్చితంగా అంచనా వేయాలని కోరింది. అసంఘటిత రంగ కార్మికుల మరణాలన్నింటినీ నమోదు చేసి అర్హులకు సముచిత పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అత్యవసర పరిస్థితులు, సమస్యల పరిష్కారానికి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేయాలని, కార్మిక చట్టాలు పున:సమీక్షించాలని తీర్మానంలో సీపీఐ కోరింది.
3) చత్తీస్‌గఢ్‌లో బూటకపు ఎన్కౌంటర్లు: చత్తీస్‌గఢ్‌లో గిరిజనుల బూటకపు ఎన్కౌంటర్లు, ఆదివాసీలపై దురాగతాలు, సహజ వనరులను అదానీ వంటి కార్పొరేట్ పెద్దలు దోచుకోవడంపై చర్యలు తీసుకోవాలని తీర్మానం పేర్కొంది. అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేసింది.
4) త్రిపురలో లెఫ్ట్‌పై దాడులు, శాంతిభద్రతల క్షీణత: త్రిపురలో పార్టీ కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేయడాన్ని సీపీఐ ఖండిరచింది. వామపక్ష మద్దతుదారులు, సానుభూతిపరులకు వేధింపులను ఆక్షేపించింది. రాజకీయ హింసను ప్రతిఘటించాలని ప్రజాస్వామిక శక్తులకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల సమగ్రతను కాపాడాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది.
5) పారదర్శకంగా నీట్: నీట్ వివాదాలపై సమ్రగ దర్యాప్తు జరిపించాలని, సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ సాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. తమిళనాడు ప్రజలకు తక్షణమే ఊరట కల్పించాలని కేంద్రాన్ని కోరింది.
6) మహారాష్ట్ర ప్రత్యేక భద్రతా బిల్లు రద్దు: కర్కశమైన నిబంధనలతో రూపొందిన మహారాష్ట్ర ప్రత్యేక ప్రజా భద్రతా బిల్లు 2024ను రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను, జర్నలిస్టులను, రైతులను, సామాజిక కార్యకర్తలను వేధించేందుకు, ‘అర్బన్ నక్సలిజం’ పేరుతో ఉపా, సెక్షన్ 124 ఎ (ఐపీసీ), ఎన్ఎస్ఏ, ప్రజా భద్రతా చట్టం తదితరాల ద్వారా ఇబ్బంది పెట్టేందుకు ఈ రాక్షస బిల్లు దోహదం కాగలదని, దీనిని రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
7) అమెరికా రాయబారి వ్యాఖ్యలు ఆక్షేపణీయం: రష్యాఉక్రెయిన్ మధ్య పోరు సాగుతున్న సమయంలో భారత ప్రధాని రష్యాలో పర్యటించడంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ చేసిన వ్యాఖ్యలు దేశ సార్వభౌమత్వం, వ్యూహాలపై పరోక్ష దాడిగా సీపీఐ అభివర్ణించింది. ఈ వ్యాఖ్యలను ప్రతిఘటించాలని అన్ని వర్గాలకు పిలుపునిచ్చింది. 8) క్రిమినల్ చట్టాలు ఉపసంహరించాలి: కొత్త క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తూ సీపీఐ తీర్మానించింది. దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. నిరసనల్లో భాగంగా చట్టాల ప్రతులు దహనం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ చట్టాలు ఉపసంహరించేంత వరకు పోరాడతామని తేల్చిచెప్పింది. 9) జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా: సెప్టెంబరులోగా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్‌కు అదనపు అధికారాలు కట్టబెట్టేలా జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019కు చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్ర హోదా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అర్థం లేకుండా పోతుందని అభిప్రాయపడిరది. 10) బీఎస్ఎన్ఎల్ను కాపాడాలి: బీఎస్ఎన్ఎల్ అందించే మొబైల్ సేవలు అధ్వానంగా ఉండటంతో ఇతర సర్వీస్ ప్రొవైడర్ల వైపునకు ప్రజలు మొగ్గు చూపుతున్నారని, బీఎస్ఎన్ఎల్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గమనిస్తే ప్రైవేటు సర్వీస్ ప్రొవైడర్ల లాబీయింగ్ అర్థమవుతుందని సీపీఐ పేర్కొంది. ఉద్దేశపూర్వంగా మొబైల్ సెక్టార్ నుంచి బీఎస్ఎన్ఎల్ను దూరంగా ఉంచారని విమర్శించింది. ఈ సంస్థను పరిరక్షించుకునేందుకు కలిసి రావాలని వినియోగదారులకు పిలుపునిచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆస్తులు ఆవిరికానివ్వబోమని సంకల్పించింది. ప్రైవేటు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు బీఎస్ఎన్ఎల్ను బలి కానివ్వబోమని సీపీఐ తీర్మానించింది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, వారి సంఘాలకు సంపూర్ణ మద్దతు, సంఫీుభావం ప్రకటించింది. 11) బీరేన్ సింగ్ రాజీనామా చేయాలి: మణిపూర్‌లో ఏడాదిన్నరగా సాగుతున్న హింసపై సీపీఐ ఆవేదన వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు నెలకొల్పడంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర
కేంద్ర దళాలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొంది. ఈ పరిస్థితులకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మణిపూర్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలను వెంటనే తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి, ప్రధానిని సీపీఐ డిమాండ్ చేసింది.