Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

మోదీయే విద్వేష గురువు

ఓటమి భయంతో మతాల మధ్య చిచ్చు పెడుతూ విద్వేష గురువుగా మారిన మోదీని ఉద్దేశించి గోవాకు చెందిన యువతి విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఆ యువతి ప్రత్యక్షంగా ప్రధాని మోదీని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సంఫ్‌ు పరివార్‌, బీజేపీ వ్యవహార శైలిని సూటిగా నిలదీస్తూ చేసిన ఆ ప్రసంగం జనం మెదళ్లను తీవ్రంగా కదిలిస్తోంది. హిందూ సమాజానికే చెందిన సదరు మహిళ చేసిన ప్రసంగ పాఠం ఇలావుంది.

మోదీ జీ…
దక్షిణ గోవాలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. మీరు చేస్తున్న దేమిటో గుర్తు చేస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో పర్యటించిన మీరు భారతీయ ముస్లిం సమాజంపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ముస్లింలు సహా ఇతర మైనారిటీలు కల్తీలంటూ మీరు దారుణమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. భారతీయ ముస్లింలను అవమానించడం, దూషించడం మీకు ఎప్పటి నుంచో అలవాటైన పనే.
కేవలం ముస్లింనే కాదు క్రిస్టియన్‌ల విషయంలోనే ఇదే తీరులో వ్యవహరిస్తున్నారు. మీ అనుబంధ శక్తులు క్రిష్టయన్‌ పాఠశాలలకు వెళ్లి అక్కడుంటున్న క్రైస్తవ సన్యాసినులు (నన్‌) లను వేధింపులకు గురి చేశారు. జీసస్‌ విగ్రహాలను ధ్వంసం చేశారు. మణిపూర్‌ ఇప్పటికీ మండుతోంది. ఆ రాష్ట్రంలో 300లకు పైగా చర్చిలను తగులబెట్టారు. గోవా విషయంలో మీ పార్టీ నేతలు, సంఫ్‌ు పరివార్‌ శక్తులు చర్చిలను, విగ్రహాలను, ఆరాధ్యనీయ చిహ్నాలను ధ్వంసం చేశారు. మతతత్వ రక్కసిని పెంచి పోషించారు. మైనారిటీలపై దాడులు, నేరాలు తీవ్రమయ్యాయి. మీరు చేస్త్తున్న వ్యాఖ్యలు, ప్రసంగాలు అన్ని మైనారిటీలకు వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ఈ విధంగా మీరు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరపూరిత ప్రవృత్తిని పెంచి పోషించారు. కానీ వీటన్నింటినీ మరుగుపరిచేలా భారత రాజ్యాంగాన్ని మేమే కాపాడుతున్నామంటూ గొప్పలు చెబుతారు. అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగం పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ మీరు, మీ పార్టీ నేతలు రాజ్యాంగం విషయంలో ఘోరమైన నేరానికి పాల్పడుతున్నారు. ప్రత్యక్ష్యంగా కేంద్ర మంత్రులే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొందరు మంత్రులు తాము హిందూ రాష్ట్ర కోసం కృషి చేస్తున్నట్టు బాహాటంగా అంటున్నారు. హిందూ రాష్ట్ర అంటే ఏమిటి…? హిందూ రాష్ట్ర అనేది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన భావజాలం. రాజ్యాంగాన్ని రూపుమాపడమే కదా. మీ మంత్రి మండలిలోని సభ్యులు, మీ పార్టీకి చెందిన ఎంపీలు మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక సవరణలు చేసి రాజ్యాంగాన్ని బలహీనపరిచారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మైనారిటీలను నిత్యం ఆడిపోసుకుంటారు. ఇప్పుడు చెప్పండి ఎవరు నేర పూరిత వ్రవర్తన కలవారో…?
హిందూ సమాజానికి చెందిన మహిళగా నేను భారత దేశంలో నా చుట్టూ ఉన్న సమాజంతో, కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటున్నాను. ప్రత్యేకంగా మైనారిటీలతోనూ సంతోషంగా కలసి జీవిస్తున్నాను. నేను హిందువునే అయినా క్రిస్టియన్‌ స్నేహితులతో కలసి చర్చికి వెళతాను, వారితో కలసి ప్రార్థన చేస్తాను. ముస్లింలతో కలసి ఈద్‌ సంబరాల్లోనూ భాగస్వామ్యం అవుతాను. అనునిత్యం అన్ని మతాల వారితో భుజం భుజం కలపి నడుస్తాను. వారంతా నాతో ఉంటున్నారు. నేను వారితో ఉంటున్నాను. ఇది రాజ్యాంగం సూచించిన అసలైన భారతీయత. రాజ్యాంగం అందించిన వెలుగు ద్వారానే ఇది సాధ్యమైంది.
మీరు భారత రాజ్యాంగాన్ని చదవండి. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందులోని కీలక అంశాలు. ఇవేవీ మీకు ఇష్టం ఉన్నట్టు కనిపించడం లేదని భావిస్తున్నాను. నేను హిందువుగా భావిస్తున్నదేమిటంటే మీలో ఎక్కడా నైతికత ఉన్నట్టు లేదు. ప్రతిసారి రాముని పేరు వాడుతారు కదా. రాముడు మర్యాద పురుషోత్తముడు. మరి ఆయనలోని భావజాలం మీలో ఎక్కడుంది. రాముని చరిత్ర నుంచి అందించే ఆదర్శం, నైతికత విలువలు వంటి సుగుణాలు మీలో లేనే లేవు. మీరు రాముని పేరుతో ఏమి చేసినా, మాట్లాడినా కేవలం రాజకీయం కోసమే అనేది సుస్పష్టం. రాజకీయ లబ్ధి, అధికారమే పరమావధిగా అన్ని అడ్డుదారులు తొక్కుతున్నారు. ఇది కాదు భారతీయత అంటే. భారతీయత గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇప్పటికే అధికారం అడ్డుపెట్టుకుని వివిధ రాజ్యాంగ సంస్థలను అనుకూలంగా మలచుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ను కూడా అలాగే వాడుకుంటున్నారు. మీరు చేస్త్తున్న విద్వేష పూరిత ప్రసంగాలపై ఈసీ చర్యలు తీసుకోవడం లేదు. మీరు చేస్తున్న మతతత్వ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకం కాదా, ఇది కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుంది.
మీరే కాదు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా చాలా మంది మంత్రులు పదే పదే మతం కార్డును రాజకీయాల్లోకి తెస్తున్నారు. ఇది ఏ విధంగానూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గౌరవించినట్టు. ఇది నైతికత అనిపించుకుంటుందా…అని నిలదీశారు. ఇదేనా భారత రాజ్యాంగాన్ని , అంబేద్కర్‌ను గౌరవించే తీరు. అంబేద్కర్‌ పేరును పలకాలంటే ముందు మీరు రాజ్యాంగాన్ని చదవండి. ఈ దేశంలో ప్రతి పౌరుడు సమానమే. అన్ని మతాలను అవలంబించే వారి హక్కులూ సమానమే అని రాజ్యాంగంలోనే ఉంది. నాతో పాటు కోట్ల మంది హిందువులు రాజ్యాంగానికి బద్దులుగానే ఉంటున్నాం. ఇండియన్స్‌ అనే భావనకు రాజ్యాంగమే ఆధారం. అయితే మీరు మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ మేము భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అనకుంటున్నాం. రాజ్యాంగం విషయంలో మీకు ఏ హక్కులు లేవు. అంబేద్కర్‌ పేరును ఉచ్చరించే హక్కే మీకు లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేసేవారెవరికీ ఈ హక్కు ఉండదు.
మోదీజీ ఇప్పటికైనా మీ మైండ్‌ గేమ్‌లు ఆపండి. మీ ముసుగులు తొలగిపోయాయి. మీ మోసపూరిత వ్యవహారాల్ని జనం గ్రహించారు. ఎవ్వరూ దేశ భవిష్యత్తుపట్ల ఆశలు వదులు కోవద్దు. సంఫ్‌ు పరివార్‌ చేస్త్తున్న మతతత్వ విభజనకు, సామాజిక విభజనకు మేమంతా వ్యతిరేకం. దేశంలోని మైనారిటీలు ఎవ్వరూ అధైర్యపడవద్దు. మేము మీతో ఉన్నాం. అందరం కల్సి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img