జైలు శిక్ష అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు!
మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం స్టే విధించింది. శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.