Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రజాశక్తిని చాటిన ఐరాస తీర్మానం

బెన్‌చాకొ గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సోమవారం తీర్మానాన్ని ఆమోదించడం ప్రజాశక్తిని చాటిచెపుతోంది. ఐక్యరాజ్య సమితి తీర్మానం క్షేత్రస్థాయిలో పటిష్ఠవంతంగా అమలుజరిగేలా చూడడం తదుపరి దశ కార్యాచరణ. దాదాపు ఆరునెలలుగా ఇజ్రాయిల్‌`పలస్తీనా గాజాప్రాంతంలో బాంబులు కురిపించి మారణకాండ జరిపిన తర్వాత ఐక్యరాజ్యాసమితి భద్రతామండలి తక్షణం కాల్పుల విరమణ తీర్మానాన్ని ఆమోదిం చింది. ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని ఖండిస్తూ అనేక దేశాల్లో లక్షలాదిమంది ప్రదర్శనలు జరిపారు. గత అక్టోబరు 7న రాత్రి హమాస్‌ పోరాటదళాలు ఇజ్రాయిల్‌పై దాడి జరిపాయి. దాడిలో దాదాపు 1400 మంది మృతిచెందారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ పలసీౖనాపై హింసాకాండ జరుపుతోంది. దీన్ని భరించలేని హమాస్‌ వీరులు ఇజ్రాయిల్‌పై బాంబులతో దాడిచేశారు. దీంతో ఇజ్రాయిల్‌ సైన్యం రెచ్చిపోయి గాజాలో ఆస్పత్రులపైన, జనావాసాలపైన బాంబులు కురిపించి పిల్లలు, స్త్రీలు అనే విచక్షణలేకుండా ఇంతవరకు 30వేల మందికిపై ప్రజలను చంపి వేశారు. ప్రపంచంలో వందకుపైగా దేశాలు పలస్తీనాకు మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి సైతం ఇజ్రాయిల్‌ హింసాకాండను ఖండిస్తూ కాల్పుల విరమణకు తీర్మానం చేసింది. ఇజ్రాయిల్‌ యుద్ధకాండకు అమెరికా, నాటో దేశాలు, పశ్చిమ దేశాలు మద్దతు తెలిపాయి. అయితే క్రమంగా ఇజ్రాయిల్‌ను సమర్థించే దేశాలు తగ్గిపోయాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం ఇజ్రాయిల్‌ కాల్పులు విరమించాలని కోరారు. అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సందర్భంగా కాల్పుల విరమణపై బైడెన్‌ మాట్లాడారు. ఆరునెలలుగా ఇజ్రాయిల్‌కు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఆయుధాలను విక్రయిస్తూ ప్రయోజనం పొందుతోంది. పలస్తీనా నగరాలను, పట్టణాలను ధ్వంసం చేశారు. గాజా ప్రాంతంలోని లక్షలాదిమంది ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఆహారం, మందులు తదితర వస్తువులను గాజా ప్రాంత ప్రజలకు అందకుండా ఇజ్రాయిల్‌ సైన్యం అడ్డుకుంటోంది. ఏ మాత్రం మానవత్వం లేకుండా చంటిపిల్లలున్న ఆస్పత్రులపైన కావాలని బాంబులు కురిపించి హతమార్చారు. ఆహార వస్తువులను విమానాలు, హెలికాప్టర్ల ద్వారా కిందకు జారవిడుస్తుండగా వాటిని తీసుకునేందుకు పరుగులు పెడుతున్న పిల్లలు, స్త్రీలపై బాంబులువేసి వందలాదిమందిని హతమార్చారు. ప్రతిరోజు ఇలాంటి దుర్మార్గాలకే పాల్పడుతున్నారు. పలస్తీనా ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తామని ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. గత రెండు నెలలుగా కాల్పుల విరమణ తీర్మానానికి బ్రిటన్‌, అమెరికాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. భద్రతామండలి సమావేశానికి బ్రిటన్‌ హాజరుకావడం లేదు. అమెరికా వీటో చేసింది. సోమవారం భద్రతామండలి కాల్పులవిరమణ తీర్మానాన్ని అమోదించింది. కాల్పులు విరమించి శాంతిని నెలకొల్పాలని బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమదేశాల్లో వేలాదిమంది తాజాగా ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. సోమవారం సమావేశానికి అమెరికా హాజరుకాలేదు. బ్రిటన్‌లో అత్యంత భారీగా శాంతికాముకులు అనేక ప్రధాన వీధుల్లో ప్రదర్శనలు, ధర్నాలు జరుపుతున్నారు. ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్నారు. సెంట్రల్‌ లండన్‌ ప్రాంతాల్లో ఇటీవలికాలంలో ఏనాడూ జరగనంత భారీగా నిరసన ప్రదర్శనలు చేస్తూ మంత్రులను సైతం ఈ మార్గాల్లో తిరగకుండా నిలువ రించారు. ప్రభుత్వం మాత్రం ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ గాజాపై మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వచ్చింది. ఎట్టకేలకు రంజాన్‌ పండుగ ముగిసేవరకు కాల్పుల విరమణకు అనుమతించింది. కార్మిక నాయకులు కాల్పుల విరమణకు మద్దతు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పలస్తీనాకు మద్దతు తెలియజేస్తూ ఇజ్రాయిల్‌ చర్యలను ఖండిస్తున్నందున ఈ తీర్మానాన్ని పశ్చిమదేశాలు అనుమతించాయి. అయితే తీర్మానాన్ని అమలు చేయడం అతి ముఖ్యమైన అంశం. బ్రస్సెల్స్‌, లండన్‌, వాషింగ్టన్‌ తదితర నగరాల్లో కాల్పుల విరమణకు దౌత్యవేత్తలు అనుకూలతను ప్రదర్శించాలని, లేకుంటే అంతర్జాతీయంగా ప్రభుత్వాలు ప్రజల మద్దతును కోల్పోతాయని హెచ్చరించారు. ప్రజలు పశ్చిమాసియా ప్రాంతంలోని పలస్తీనాకు మద్దతు పలుకుతూ అమెరికాను వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయిల్‌పై యెమెన్‌ దాడులను అమెరికా నిలువరించలేకపోతోంది. ఇజ్రాయిల్‌కు సంబంధించిన నౌకలపై యెమెన్‌ దాడులు సాగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే మార్గాలలో భారీగా ధర్నాలు జరుగుతున్నందున, ఆయన మరో మార్గంలో కార్యాలయానికి వెళ్లవలసి వస్తోంది. ఈ పరిస్థితిపై డెమోక్రాట్లు, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతామండలి కాల్పుల విరమణకు తీర్మానం చేయడం చరిత్రాత్మకమైనది. ఈ తీర్మానాన్ని ఇజ్రాయిల్‌, ఇతర ఐరాస సభ్యదేశాలు తప్పక అమలు చేయవలసి ఉంటుందని చైనా రాయబారి రaాంగ్‌జన్‌ అన్నారు. ఇతర సభ్యదేశాలు కాల్పుల విరమణ అమలుకు కృషిచేస్తామని ప్రకటించాయి. తీర్మానం చేసిన తర్వాత కూడా బ్రిటన్‌ ఆయుధాలను సరఫరా చేసినట్లయితే మా మద్దతకు అర్ధం ఉండదు. తమపై ఒత్తిడిచేస్తున్నందున అమెరికాను శిక్షించాలని ఇజ్రాయిల్‌ మాట్లాడుతోంది. దౌత్యవేత్తలు గాజా ప్రాంతాన్ని సందర్శించాలని అక్కడ జరుగుతున్న పరిణామాలను, దారుణ హింసాకాండను గుర్తించాలని, ఒకవేళ తిరస్కరిస్తే తగిన మూల్యం చెల్లించవలసివస్తుందని ధర్నా చేస్తున్న ప్రజలు హెచ్చరించారు. గాజాలో శాంతికోసం మరో జాతీయ ప్రదర్శన రానున్న శనివారం బ్రిటన్‌లో జరుగనున్నది. న్యూయార్క్‌లోను భారీ ప్రదర్శనే జరుగుతుందని ప్రకటించారు. ఇజ్రాయిల్‌ దాడులపై బ్రిటన్‌ నిర్లక్ష్యంగా ఉందని, యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలని, పలస్తీనాను అక్రమంగా ఆక్రమించిందని దీనికి అంతం పలకాలని ప్రదర్శనల నిర్వాహకులు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img