Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

సంగమయ్య కొండ చరిత్రకు ముప్పు!

-ఇంటాక్ ప్రేక్షక పాత్ర
–చరిత్ర పరిశోధకులు నల్లి ధర్మారావు ఆందోళన

విశాలాంధ్ర – ఆమదాలవలస ( శ్రీకాకుళం): వారసత్వ సంపద పరిరక్షణ, స్మారక చిహ్నాల పునరుద్ధరణ వంటి చారిత్రక బాధ్యతలను చూడాల్సిన ఇంటాక్ సంస్థ, ఆ బాధ్యతలను మరచిపోయినట్టుగా ఉందని కళింగాంధ్ర చరిత్ర పరిశోధకులు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాలవలస-సరుబుజ్జిలి రోడ్డు లోని క్రీస్తుపూర్వం నాటి సంఘమయ్య కొండ అనే చారిత్రక గుహ ఆలయాన్ని, స్థానికులు కొందరు దురాక్రమించారని, పురావస్తు శాఖ హెచ్చరిక బోర్డును తొలగించి, ఇష్టానుసారం ఆలయ రూపురేఖలను మార్చేస్తున్నారని చెప్పారు. జైన, బౌద్ధ, శైవ మతాల సంఘర్షణలకు సాక్షిభూతంగా ఈ గుహాలయం కనిపిస్తుందని తెలిపారు. గుహలో ఉన్న నిలువెత్తు దిగంబర జైన విగ్రహానికి వస్త్రం తొడిగి, అడ్డు నామాలు పెట్టి శివుడంటూ, స్థానికుల కొందరు పూజారులుగా మారి సొమ్ము చేసుకుంటున్నారని, వారి మనోభావాలు, జీవన ఉపాధి వ్యవహారాలు ఎలా ఉన్నా, చారిత్రక సంపదకు ముప్పు కలిగించకుండా వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అన్నారు. గుహాలయం ముందు, రామ మందిరం కట్టించిన నుంచి, ఇక్కడి చారిత్రక ఆనవాళ్లు నానాటికి అంతరించిపోవడం మొదలైందని చెప్పారు. ఒక జిల్లాకు చెందిన సాధువు కొన్నాళ్లు కొండమీద నివసించి, మరికొంత నష్టపరిచారని గుర్తు చేశారు. గుహ ముందు బుద్ధుని విగ్రహమే కాకుండా, జైన మతం లోని 24 వ తీర్థంకరులలో 10వ తీర్థంకరుడు శీతలనాధుని విగ్రహం ఇక్కడ ఉందన్నారు. కలింగులు ఇతడినే ఎక్కువగా ఆరాధించే వారిని చరిత్ర చెబుతున్నట్టు ధర్మారావు తెలిపారు. తొలి కళింగ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఖారవేలుని కాలంలో సీతలనాథుడి ఆరాధన ఎక్కువగా ఉండేది అన్నారు. కలింగలో భాగమైన ప్రస్తుత శ్రీకాకుళం జిల్లాకు ఖరవేలుని కాలంలోనే జైనం వ్యాప్తి చెందిందని చెప్పారు. ఆదిపత్యం కోసం జైన, బౌద్ధాల మధ్య సంఘర్షణ జరిగిందని, వాటి ఆనవాళ్లు సంగమయ్య కొండ దగ్గర కనిపిస్తాయని, ఆయన అన్నారు. ఈ రెండు మతాలపై గంగరాజుల కాలంలో శైవం ఆదిపత్యం సంపాదించిందని, దానికి నిదర్శనంగా గుహలోని దిగంబర జైన విగ్రహం ఎదుట గల ప్రాచీన శివలింగాన్ని చూడవచ్చునన్నారు.
సంగమయ్య కొండను శుక్రవారం సందర్శించిన ధర్మారావు, కొత్తగా ఒక ధ్వజస్తంభాన్ని స్థాపించడం, ఎక్కడో తయారు చేయించిన శిల్పాలను తీసుకురావడం, కొత్త నిర్మాణాలకు ఇటుకలను పోగు వేయడం చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇంటాక్ సంస్థ, పర్యాటక శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి, వేల సంవత్సరాల చరిత్ర గల ఈ గుహాలయాన్ని రూపురేఖలు మార్చకుండా సంరక్షించాలని ధర్మారావు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img