Wednesday, October 30, 2024
Wednesday, October 30, 2024

తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి

ధరణి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఆరోగ్యశ్రీ – రేషన్ కార్డుకు లింక్ వద్దు

విశాలాంధ్ర – హైదరాబాద్ :: తెలంగాణ రాష్ట్రాన్ని మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలని, ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా మీరు పనిచేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలని, కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు. మీ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలని, ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్​ కమిషన్లర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్​ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్​, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్​ నిర్మూలనపై సమావేశంలో చర్చ సాగింది. ఈ సందర్భంగా సీఎం.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామని, ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించామన్నారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే అని తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారని అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోందని ఈ నేపథ్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమైన అంశం అని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారని, అలాగే కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలని సూచించారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మీ పై ఉందన్నారు.
ధరణి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి,…
ధరణి సమస్యల పరిష్కారం వివరాలపై ఆరా తీసిన సీఎం పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ధరణిలో సమస్యపై దరఖాస్తు చేసేవారి అప్లికేషన్ తిరస్కరణకు కారణాన్ని తెలిపేలా చర్యలు చేపట్టాలన్నారు. ధరణిలో కొన్ని టెక్నికల్ సమస్యలకు పరిష్కారం చూపేలా అదనపు ఆప్షన్స్ పొందుపరిచే అంశాన్ని పరిశీలించాలించాలని తెలిపారు. ఆగస్టు 15లోగా పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలపై దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ – రేషన్ కార్డుకు లింక్ వద్దు,….
ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జరిచేస్తు రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని సూచించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img