విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : అనకాపల్లి జిల్లా చోడవరం శివారు అన్నవరం లో రైతన్నల పాలిట కరెంట్ కష్టాలు దాపురించాయి. సాగునీరు లేక పచ్చటి పంట పొలాలు బీడు బారిపోతున్నాయి. చెంతనే సాగునీటి బోర్లున్నను, కరెంట్ లేకపోవడం వలన పొలాలకు సాగు నీరు పారే పరిస్థితి కరువయ్యింది. ఈ కరెంట్ మోటార్లు క్రింద సాగులో ఉన్న మొత్తం పంట పొలాలు సాగు తడుల్లేక ఎండిపోయాయి. దీనిపై విద్యుత్ కార్యాలయం చుట్టూ రైతన్నలు కాళ్లరిగేలా తిరిగి పలుమార్లు ఫిర్యాదులు చేసినను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఇలాంటి పరిస్థితి వుంటే, రేపటి సాగునీరు అందేదెలా అని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారు ఇరవై రోజులు పైగా ఇక్కడ పరిస్థితి ఇలానే వున్నను, విద్యుత్ అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు అనిపించడం లేదు. అన్నవరం సర్వీస్ నెంబర్. 7235 లైన్ లో నాలుగు సాగునీటి బోర్లు ఉన్నాయి. విద్యుత్ అంతరాయంతో వీటి క్రింద సాగయ్యే సుమారు ఏబై ఎకరాల భూమిలో పంటలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ పరిస్థితులు పై చోడవరం విద్యుత్ శాఖ ఏ.ఈ, అధికారులకు వివరించినప్పటికీ నిమ్మకి నీరు ఎత్తనట్లుగా వ్యవహరిస్తూ, సమాధానం చెప్పే తీరిక కూడా లేదంటున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఈ సమస్యను పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవలసిందిగా ఏ.పి. రైతు సంఘం అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి అప్పలరాజు, అన్నవరం అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.