Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

అమరవీరుల స్ఫూర్తితో అభివృద్ధివైపు అడుగులు

జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

  • బాపట్లలో ఘనంగా 75వ గణతంత్ర వేడుకలు

విశాలాంధ్ర – బాపట్ల : దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. 75వ భారత గణతంత్ర దినోత్సవం కలెక్టరేట్ ఆవరణలోని పోలీస్ కవాతు మైదానంలో శుక్రవారం ఘనంగా జరిగింది. జిల్లా యంత్రాంగం నిర్వహించిన గణతంత్ర వేడుకలు అంబరాన్ని అంటాయి. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రాంగణమంతా పర్యటించారు. పోలీసు కవాతును పరిశీలించిన తదుపరి ప్రజలకు ఆయన అభివాదం చేశారు. పోలీస్ కవాతు మైదానంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. జిల్లా అభివృద్ధిని చాటుతూ సాగిన శకటాల ప్రదర్శన ఎంతో అబ్బురపరిచాయి. దేశభక్తిని చాటుతూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల కేరింతలు, కరతాల ధ్వనులతో ప్రాంగణం మార్మోగింది. జాతీయ గీతం రూపకర్త పింగళి వెంకయ్య ముని మనవడు సాయి పరుశురాం, అమర జవాన్ జస్వంత్ రెడ్డి తల్లి వెంకటేశ్వరమ్మలను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకర్షించాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేషంగా కృషి చేస్తూ ఉత్తమ సేవలందించిన జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలతో జిల్లా కలెక్టర్ సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం రూపొందించారని జిల్లా కలెక్టర్ చెప్పారు. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. అప్పటినుంచి గణతంత్ర దినాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. జాతి పిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టారని తెలిపారు. 536 ప్రభుత్వ సేవలు ఒకే చోట లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలోని రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వమే అందుబాటులోకి తెచ్చిందన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తీర ప్రాంతాలు అధికంగా ఉన్నందున మత్స్య సంపద అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 288 లేఅవుట్ లలో 47,805 గృహాలు మంజూరయ్యాయాన్నారు. 15,678 గృహాలు నిర్మాణం పూర్తికాగా, మిగిలినవి వివిధ వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఆ కాలనీలలో రూ.కోట్లు నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 277 రెవిన్యూ గ్రామాలలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం కొరకు అత్యాధునిక సర్వే పద్ధతులలో సమగ్ర రీ సర్వే చేస్తున్నామని వివరించారు. డి ఆర్ డి ఏ ద్వారా మహిళ సాధికారత కొరకు అనేక పథకాలను ప్రభుత్వం సమర్ధంగా అమలు చేస్తుందన్నారు. వేడుకలలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, అదనపు ఎస్పీ పి.మహేష్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img