Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

బాపట్ల – విశాలాంధ్ర : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. విజయకృష్ణన్ ఆదేశించారు. పదోతరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో జరిగింది.విద్యార్థుల జీవితాలు మార్చే పదోతరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు వ్రాయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. బాపట్ల జిల్లాలో 331 పాఠశాలలనుంచి 17,344 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. వీరికోసం 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఏప్రిల్-3 నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు ఉంటాయన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు రెగ్యులర్ విద్యార్థులకు పరీక్ష జరుగుతుందన్నారు. ఇదే క్రమంలో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఓపన్ స్కూల్ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా సమయానికి అర్ధగంట ముందుగా పరీక్షా కేంద్రానికి విద్యార్థులు హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలని, పోలీస్ బందోబస్తు నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లు అనుమతించరాదన్నారు. పరీక్షా కేంద్రాలలో మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి కేంద్రం వద్ద ప్రాధమిక వైద్యం అందించేలా సిబ్బందిని నియమించాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్ మిషన్లు మూత వేయించాలన్నారు. పబ్లిక్ పరీక్షలు ప్రారంభం నుంచి ముగిసే వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆర్.టి.సి. బస్సులను నడపాలని ఆదేశించారు. పబ్లిక్ పరీక్షలు సమర్థంగా నిర్వహించడానికి స్పాట్ ఆఫీసర్లను ప్రత్యేకంగా నియమించాలని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 25వ తేదీన 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు బాపట్లకు చేరుతాయన్నారు. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచిన తదుపరి ముందస్తుగా గుర్తించిన 29 పోలీస్ స్టేషన్లకు ప్రశ్నాపత్రాలను పంపాలన్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ గాకుండా పటిష్టమైన పోలీస్ భద్రత కల్పించాలన్నారు. ప్రశ్నాపత్రాలు తరలించడానికి వాహనాలు సిద్ధం చేసుకోవాలన్నారు. 103 మంది చీఫ్ సూపరింటిండెంట్లు, మరో 103 డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లుగా తొమ్మిది మందిని, మరో తొమ్మిది మందిని అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లుగా నియమించామన్నారు. 10 ఫ్లయింగ్ స్క్వాడ్ లను, 870 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, ఏ.ఎస్.పి. మహేష్, డి.ఇ.ఓ. పి.వి. రామారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి విజయలక్ష్మి, డి.పి.ఓ. వై. శంకర్ నాయక్, ఆర్.టి.ఓ. చంద్ర శేఖర రెడ్డి, ఆర్.టి.సి. ఆర్.ఎమ్. రామారావు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img