Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పాకిస్థాన్‌కు ‘క్షిపణి’ సాయం…

చైనా సంస్థలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్‌ : అంతర్జాతీయ వేదికపై అమెరికా- చైనాల ఆధిపత్య పోరు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌ క్షిపణి కార్యక్రమాలకు పరికరాలు సరఫరా చేస్తున్నాయంటూ మూడు చైనా సంస్థలతోపాటు బెలారస్‌కు చెందిన ఓ కంపెనీపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు ఇస్లామాబాద్‌తో సామూహిక విధ్వంసకర ఆయుధాలతో చేపట్టే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ తెలిపారు. అణ్వస్త్రాలు, ఆయుధ సాంకేతికత విస్తరణను అడ్డుకునే విషయానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. పాకిస్థాన్‌ మిత్రదేశమైన చైనా… ఆయుధాలు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తూ ఆ దేశ సైనిక ఆధునికీకరణకు తోడ్పడుతోంది. అమెరికా పేర్కొన్న వివరాల ప్రకారం.. బీజింగ్‌కు చెందిన జియాన్‌ లాంగ్డే సంస్థ పాకిస్థాన్‌ దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి ఫిలమెంట్‌ వైండిరగ్‌ మెషిన్‌ సహా క్షిపణి సంబంధిత పరికరాలను సరఫరా చేసింది. గ్రాన్‌పెక్ట్‌, టియాంజిన్‌ కంపెనీలు రాకెట్‌ మోటార్‌లను పరీక్షించే, ప్రొపెల్లెంట్‌ ట్యాంకుల తయారీకి వినియోగించే సామగ్రిని సమకూర్చాయి. బెలారస్‌లోని మిన్స్క్‌ వీల్‌ ట్రాక్టర్‌ ప్లాంట్‌… దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి అవసరమైన ప్రత్యేక వాహన ఛాసిస్‌లను అందజేసింది. తైవాన్‌కు ఆయుధ సాయం చేశాయన్న నెపంతో అమెరికాకు చెందిన రెండు రక్షణ సంస్థలపై బీజింగ్‌ ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. జనరల్‌ అటామిక్స్‌ ఏరోనాటికల్‌ సిస్టమ్స్‌, జనరల్‌ డైనమిక్స్‌ ల్యాండ్‌ సిస్టమ్స్‌కు సంబంధించిన చైనాలోని ఆస్తులను స్తంభింపజేసింది. దీంతోపాటు ఆయా కంపెనీల మేనేజ్‌మెంట్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకట్ట వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img