Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జైలు నుంచి పాలన

ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఇ.డి.) దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ను ఈ నెల 21న అరెస్టు చేసింది కనక ఆయనను పదవి నుంచి తొలగించాలని సుర్జీత్‌సింగ్‌ యాదవ్‌ పెట్టుకున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు గురువారం కొట్టేసింది. కేజ్రీవాల్‌ అరెస్టయిన తరవాత ఆయన రాజీనామా చేయలేదు. పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రి కూడా ఆయనే. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన పూర్వోదంతం లేదు. అరెస్టు అయిన తరవాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న నియమేమీ లేదు కనక కేజ్రీవాల్‌ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రులు ఆయన అరెస్టు అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆయన నిర్బంధంలో ఉండగానే కేజ్రీవాల్‌ తన భార్య సునీతకు ఓ సందేశం పంపించారు. దాన్ని ఆమె విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. అంతే కాకుండా ఇద్దరు మంత్రులకు నిర్బంధం నుంచే కేజ్రీవాల్‌ రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇ.డి. నిర్బంధంలో ఉండగా ఆయన ఈ పనులు ఎలా చేయగలిగారు, దానికి ఇ.డి. అధికారులు సహకరించారా, సమ్మతించారా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ అది విషయాంతరమే. అరెస్టు అయిన తరవాత కూడా నిర్బంధంలోంచే పరిపాలన కొనసాగిస్తానని కేజ్రీవాల్‌ ప్రకటించడమే కాక ఆ పని చేయడం ఓ వినూత్నమైన పరిస్థితికి అవకాశం ఇచ్చింది. ఆయన అరెస్టయిన తరవాత దిల్లీ శాసనసభ సమావేశం నిర్వహించారు. ఆయన వచ్చే ఒకటో తేదీదాకా ఇ.డి. నిర్బంధంలోనే ఉంటారు. ఆయన అరెస్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కేజ్రీవాల్‌ పెట్టుకున్న అర్జీపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆయనకు ఉపశమనం కలిగించలేదు కానీ ఆయన అర్జీకి సమాధానం ఇవ్వాలని ఇ.డి.ని ఆదేశించి రెండో తేదీదాకా గడువిచ్చింది. ఆయనను అరెస్టు చేసిన తరవాత గురువారం దాకా ఇ.డి. నిర్బంధంలో ఉంచుకోవడానికి అనుమతించారు. మళ్లీ ఆ నిర్బంధాన్ని ఒకటవ తేదీదాకా పొడిగించారు. అరెస్టయినందువల్ల ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలులేదని అందువల్ల ఆయనను తొలగించాలని సుర్జీత్‌ సింగ్‌ యాదవ్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ ను విచారించిన దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్‌ మోహన్‌, న్యాయమూర్తి మన్మీత్‌ అరోరాతో కూడిన బెంచి కేజ్రీవాల్‌ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి నిరాకరించింది. అరెస్టయితే ముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదని ఏ చట్టంలో చెప్పండి అని న్యాయమూర్తులు నిలదీశారు. అరెస్టు అయితే రాజీనామా చేయాలన్న నిబంధన ఏ చట్టంలోనూ లేని మాట నిజమే. అంతే కాక ముఖ్యమంత్రిని తొలగించే అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని కూడా న్యాయమూర్తులు చెప్పారు. ముఖ్యమంత్రిని తొలగించడం కార్యనిర్వాహక వర్గం చూసుకోవలసిన అంశం అని కూడా న్యాయమూర్తులు చెప్పారు. కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసనసభా పక్షం సమావేశమై కొత్త నాయకుడిని ఎన్నుకోవడం. రెండవది: ముఖ్యమంత్రి అరెస్టు అయినందువల్ల అందుబాటులో లేరు కనక రాజ్యాంగం ప్రకారం పరిపాలనా నిర్వహణ సాధ్యం కావడంలేదు కనక ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సిఫార్సు చేయడం. ఏ లెఫ్టినెంటు గవర్నరుకూ ఇప్పటి దాకా కేజ్రీవాల్‌తో సఖ్యతలేని మాట నిజమే కాని ప్రస్తుత లెఫ్టినెంటు గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ఇప్పటి దాకా ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.
జైలు నుంచే ఓ ముఖ్యమంత్రి పరిపాలన నిర్వహించిన సందర్భం ఇంతవరకు లేదు కనక దానికి సంబంధించి నిర్దిష్టమైన విధివిధానాలేమీ లేవు. అలా లేకపోవడం కేజ్రీవాల్‌ పదవిలో కొనసాగడానికి వీలుందా అన్నదీ పెద్ద ప్రశ్నే. నిర్దిష్టమైన నిబంధనలు, గతానుభవాలు లేవు కనక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ముఖ్యమంత్రి ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణ ఉంది కనక ఆయనను పదవిలో ఉండనివ్వకూడదన్నది ప్రజాప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేసిన యాదవ్‌ వాదన. కేజ్రీవాల్‌ పదవిలో కొనసాగడం న్యాయ ప్రక్రియకు భంగం కలిగిస్తుందని, న్యాయానికి విఘాతం కలిగిస్తుందని, అందువల్ల రాజ్యాంగ యంత్రాంగం విఫలమవుతుందన్నది పిటిషనర్‌ వాదన. కానీ దాదాపు వారం నుంచి కేజ్రీవాల్‌ ఆదేశాలు పంపిన సందర్భాలున్నాయి కాని రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందన్న వాదన వినిపించలేదు. రేపో మాపో పరిస్థితి మారినా మారొచ్చు. కేజ్రీవాల్‌ పదవిలో కొనసాగడం రాజ్యాంగంలోని 163, 164 అధికరణాలలోని కొన్ని భాగాలకు విరుద్ధమైనవని కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఆయన నిర్బంధంలో ఉన్నందువల్ల తన అధికార బాధ్యతలు నిర్వహించే అర్హత కోల్పోయారని కూడా ఈ అర్జీలో వాదించారు. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు కనక దీనికీ సమాధానం అన్వేషించవలసిందే. నిర్బంధంలో ఉన్న ముఖ్యమంత్రి చట్టం ప్రకారం వ్యవహరించలేరన్నది మరో వాదన. పైగా ఆయన నిర్బంధంలో ఉండగానే పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించాలంటే కొన్ని ఫైళ్లు పరిశీలించవలసి రావొచ్చు. వాటిలో బయటకు పొక్క కూడని అంశాలూ ఉండొచ్చు. ఈ అంశాలన్ని జైలు అధికారులు కూలంకషంగా పరిశీలించి ఫైళ్ల లాంటివి అందిస్తారా, కేజ్రీవాల్‌ చేసే సూచనలను, ఆదేశాలను మంత్రివర్గానికో, పాలనా విభాగానికి అందజేసే మార్గం ఏమిటి అన్న సందేహాలూ ఉన్నాయి. ఈ ప్రక్రియ అంతా సాధ్యం అవుతుందనుకున్నా రహస్యాలను కాపాడతానని ముఖ్యమంత్రి చేసిన ప్రమాణానికి భంగం కలగదా అన్నది మరో ప్రశ్న. అరెస్టయిన ముఖ్యమంత్రి నిర్బంధంలో ఉండగానే పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించడానికి ఫైళ్లు పరిశీలించడం అవసరం. దిల్లీ పాలనా యంత్రాంగానికి సంబంధించిన 1993 నాటి నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రికి ఫైళ్లు చూసే అధికారం ఉంటుంది. ఆరోపణలు ఉన్న వ్యక్తే ఈ ఫైళ్లు చూసే అవకాశం ఉండకూడదన్నది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన యాదవ్‌ బాధ. ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ఉన్నాయి కనక ఆ ఫైళ్లు చూస్తే పరిస్థితి ఏమిటన్నది మరో సమస్య. కేజ్రీవాల్‌ జైలు నుంచి ఆదేశాలు జారీ చేయకుండా నివారించాలని అభ్యర్థిస్తూ సుర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూదా దాఖలు చేశారు. ఇది ఇంకా విచారణ దశకు రాలేదు. ఈ వాదోపవాదాలన్నీ న్యాయానికి, చట్టానికి సంబంధించిన అంశాలు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించనందువల్ల దీనికి సంబంధించిన చట్టాలు, నిబంధనలు లేకపోవడం విచిత్రం కాదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసనసభాపక్షానికి ఇప్పటికీ కేజ్రీవాల్‌ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచి ప్రతికూల స్పందన ఇంతవరకు రాలేదు. ఆదేశాలు జారీ చేయడం, సందేశాలు పంపడం, దానికోసం ఏర్పాట్లు చేయడం అంత క్లిష్టమైంది కాకపోవచ్చు. కానీ సమీక్షా సమావేశాలు, మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమత్రి భావిస్తే దానికి ఏర్పాట్లు ఎవరు చేయాలన్నదీ సమాధనం లేని ప్రశ్నే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img