పేకాటలో పట్టుబడిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవర్నీ ఉపేక్షించమని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్పష్టం చేశారు. పేకాటలో పట్టుబడిన అనంతపురం ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. వివరాలు… బుక్కరాయసముద్రం పోలీసు స్టేషన్ పరిధిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు నిన్న సాయంత్రం పక్కా సమాచారం అందింది. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు బుక్కరాయసముద్రం సి.ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆ పోలీసులు మరియు జిల్లా స్పెషల్ టీం దాడులు నిర్వహించారు. ఆసందర్భంగా 17 మంది పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. వీరి నుండీ రూ.31,600/- నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడిన వారిలో అనంతపురం ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. మిగితా పేకాటరాయుళ్లతో పాటు సదరు ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ పై చట్ట పరమైన చర్యలు తీసుకున్నారు. ఏ.పి గేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతేకాకుండా శాఖాపరమైన చర్యలులో భాగంగా సదరు హెడ్ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట వ్యతిరేక కలాపాలకు పాల్పడినా, అక్రమాలలో తలదూర్చినా లేదా పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు వచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.