Friday, May 3, 2024
Friday, May 3, 2024

పోస్టల్ బ్యాలెట్ మరియు హోం ఓటింగ్ ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : ప్రస్తుతం జరగబోవు పార్లమెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల సందర్భంగా అనంతపురము జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కమీషన్ వారు ఈ ఎన్నికలలో 85 సంవత్సరములు నిండిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు మరియు సర్వీసు ఓటర్లు, ఎన్నికల విధులలో పాల్గొనే పోలింగు సిబ్బంది యితర ఎన్నికల విధులకు హాజరగు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఎన్నికల విధులకు హాజరయ్యే డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు మరియు అత్యవసర సేవలందించు వివిధ శాఖలకు చెందిన సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు పోస్టల్ బ్యాలట్, (సర్వీసు ఓటర్లు) మరియు హోం ఓటింగ్ ద్వారా ప్రత్యేక సౌకర్యము కల్పించడం జరిగిందన్నారు.
ముఖ్యంగా 85 సంవత్సరములు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులు మరియు కోవిడ్ 19 పాజిటివ్ పేషంట్లు వారు కోరుకోన్నచో వారి ఇంటి వద్దనే వారి ఓటును వేయుటకు ప్రత్యేక పోలింగ్ టీములు ఏర్పాటు చేసి ఇళ్ళ వద్దకు టీములు పంపబడునని తెలిపారు. వారికి అందరికి సంబంధిత BLO ల ద్వారా ఫారం 12డి అందజేసి, హోం ఓటింగుకు సమ్మతి తెల్పిన వారినుండి పూరించిన ఫారం 12 డి బి ఎల్ వో ల ద్వారా 23.04.2024 వరకు స్వీకరించి వాటిని ఆమోదించిన పిదప 05.05.2024 నుండి 09.05.2024 వరకు హోం టీముల ద్వారా వారి ఇంటి వద్ద ఓటు వేయించుకొని స్వీకరించబడునన్నారు. జిల్లాలో 9,799 మంది 85 సంవత్సరములు పైబడిన ఓటర్లు మరియు 25,993 మంది దివ్యాంగులు ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 594 మంది 85 సంవత్సరములు పైబడినవారు మరియు 720 మంది దివ్యాంగులు మొత్తము 1314 తమ ఓటు హక్కును ఇంటివద్దే వినియోగించుకొనుటకు ఫారం 12డి ద్వారా దరఖాస్తు చేసుకుని ఉన్నారన్నారు. వాటిని పరిశీలించి వారికి ఓటు హక్కును ఇంటివద్దే వినియోగించుకొనేందుకు అవకాశం కల్పించబడునన్నారు.
జిల్లాలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, రాప్తాడు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు చొప్పున పోలింగ్ టీములను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ టీములు మే 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పర్యటించడం జరుగుతుందన్నారు.
ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగికి మరియు అధికారులకు పోలీసు సిబ్బందికి, ఎన్నికల విధులకు హాజరగు నాన్ గవర్నమెంట్ ఉద్యోగులు డ్రైవర్లు, క్లీనర్లు, కండక్టర్లు, వీడియోగ్రాఫర్లు, అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకొనుటకు అవకాశం కల్పించబడినదన్నారు. వారు 28.05.2024 తేదీలోగా ప్రారం 12 ను పూరించి వారు అనంతపురము జిల్లాలో పనిచేయు ప్రాంతములోని రిటర్నింగ్ అధికారికి సమర్పించవలెను మరియు పోలింగు సిబ్బందికి జరుగు ట్రైనింగుల యందు ఫారం 12 ఇవ్వవచ్చును. వీరికి ఓటింగు సౌకర్యము కల్పించుటకు ట్రైనింగు సెంటర్ల వద్ద మరియు రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయము వద్ద ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 03.05.2024 నుండి 06.05.2024 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఉదయం 9.00 గం. నుండి సా.5.00 గం. వరకు ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగు సౌకర్యం కల్పించబడును. 85 సంవత్సరములు పైబడిన ఓటర్లు, దివ్యంగులు ఓటర్ల మరియు కోవిడ్ -19 కొరకు క్రింద తెలిపిన తేదీల యందు పోలింగ్ టీములు గ్రామాల్లో పర్యటిస్తారన్నారు.
మే 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నియోజకవర్గాల్లో పోలింగ్ టీములు గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. రాయదుర్గం నియోజకవర్గంకు సంబంధించి రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల (గ్రౌండ్ ఫ్లోర్), రిటర్నింగ్ అధికారి కార్యాలయంలలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉరవకొండ నియోజకవర్గంకు సంబంధించి ఉరవకొండలోని శ్రీకరిబసవేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో, గుంతకల్లు నియోజకవర్గానికి సంబంధించి గుంతకల్లులోని డా.సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హై స్కూల్ కసాపురం రోడ్ లో, రిటర్నింగ్ అధికారి కార్యాలయములో, తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి తాడిపత్రిలోని ఆటోనగర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రిటర్నింగ్ అధికారి కార్యాలయములో, సింగనమల నియోజకవర్గంకు సంబంధించి బుక్కరాయసముద్రంలోని సిద్ధిరాంపురం రోడ్డులో ఉన్న వినికిడి లోపం ఉన్న పిల్లల ఆర్డీటీ హైస్కూల్లో, రిటర్నింగ్ అధికారి కార్యాలయములో, అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం న్యూటన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి కళ్యాణదుర్గంలోని అనంతపురం రోడ్డులో ఉన్న ఎస్.వి.జి.ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్లో మరియు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రాప్తాడు దగ్గరలోని పంగల్ రోడ్డు దగ్గర ప్రజ్ఞా క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న టెక్నికల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (టిటిడిసి) మరియు సిఎల్ఆర్సి భవనంలో మరియు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో పనిచేసే ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు మరియు అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి యొక్క ఓటును వినియోగించుకొనుటకు ఫామ్ 12 ను ప్రస్తుతం అనంతపురము జిల్లాలో పనిచేయు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి అందచేయవలెనన్నారు. వాటిని సంబంధిత జిల్లాలకు పంపి ఆ జిల్లాల నుండి పోస్టల్ బ్యాలట్ ను తెప్పించి అనంతపురము జిల్లాలో పెసిలిటేషన్ సెంటర్లలో వారి ఓటు హక్కును వేసుకొనేందుకు అవకాశం కల్పించబడును. అదేవిధముగా అనంతపురము జిల్లాకు చెంది ఇతర జిల్లాలలో పని చేయు ఉద్యోగులు మరియు అధికారుల యొక్క ఫారం 12 వారు పనిచేయు జిల్లా కలెక్టర్ వారి నుండి స్వీకరించబడును. మరియు వారు పనిచేయు జిల్లాలకి పోస్టల్ బ్యాలట్ పంపి సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోని ఫెసిలిటేషన్ లో ఓటును వేసుకొనవచ్చును.

అత్యవసర సేవలు అందించు వివిధ శాఖల ఉద్యోగులు :

పోలింగు రోజు డ్యూటీలో వున్న అత్యవసర సర్వీసులో పనిచేయు 33 శాఖలకు చెందిన అనగా (మెట్రో, రైల్వే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, మీడియా సిబ్బంది, ఎలక్ట్రిసిటీ ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. బి.ఎస్.ఎన్.ఎల్. పోస్టల్ అండ్ టెలిగ్రామ్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, స్టేట్ మిల్క్ యూనియన్ అండ్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీస్, హెల్త్ డిపార్టుమెంటు, ఫుడ్ కార్పోరేషన్ డిపార్టుమెంటు, విమానయాన శాఖ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్ పోలీస్, అంబులెన్సు సేవలు, షిప్పింగ్ సేవలు, ఫైర్ ఫోర్సు శాఖ, జైళ్ళ శాఖ, ఎక్సైజ్ శాఖ, వాటర్ అథారిటీ, ట్రెసరి సేవలు, అటవీ శాఖ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, పోలీసు శాఖ, సివిల్ డిఫెన్స్ మరియు హోమ్ గార్ల్స్, ఫుడ్ సివిల్ సప్లయిస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్, పవర్ ఏ.పి.ట్రాన్స్కో, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, విపత్తు నిర్వహాణ శాఖ) సంస్థల ఉద్యోగులకు, అధికారులకు పోస్టల్ ఓటింగు సౌకర్యం కల్పించడం జరిగినదన్నారు. వారు పారం 12డి దరఖాస్తును రిటర్నింగ్ అధికారికి అందచేసి రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయము నందు ఏర్పాటు చేసిన పోస్టల్ ఓటింగ్ సెంటర్నందు 08.05.2024 నుండి 10.05.2024 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకొనవచ్చునన్నారు. మే 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక నియోజకవర్గానికి ఒకటి చొప్పున పోస్టల్ ఓటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఆర్మీ నందు ఇతర మిలటరీ సిర్వీసులందు పనిచేయు సర్వీస్ ఓటర్లకు ఈటీపీ బి ఎం ఎస్ ద్వారా పోస్టల్ బ్యాలట్ సౌకర్యము కల్పించబడినది. వీరికి ఈ టి పి బి ఎం ఎస్ పోర్టలు ద్వారా పోస్టలు బ్యాలట్ ను ఆన్ లైన్ ద్వారా వారికి పంపి వారినుండి పోస్టు ద్వారా పోస్టల్ బ్యాలట్ ను స్వీకరించబడును. ప్రస్తుతము అనంతపురము జిల్లాలో 2,115 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. వీరికి 29.04.2025 తేదీన ఈ టి పి బి ఎం ఎస్ ద్వారా బ్యాలట్ పేపర్ పంపి కౌంటింగ్ తేదీ ముందురోజు వరకు పోస్టు ద్వారా స్వీకరించబడునని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img