Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మోదీ ఆత్మ స్తుతి-పరనింద

ఆత్మ స్తుతి పరనింద ప్రధానమంత్రి మోదీకి చాలా ఇష్టమైన క్రీడ. కాంగ్రెస్‌ శుక్రవారం విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక ముస్లిం లీగ్‌ సిద్ధాంతంలా ఉంది అని మోదీ విమర్శించారు. ఆ ప్రణాళికలోని ప్రతి పేజీ దేశాన్ని ముక్క ముక్కలుగా చీల్చడానికి ఉద్దేశించిందేనని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళికలు కేవలం ఒక తంతుగా మిగిలిపోయాయి. అయినా కాంగ్రెస్‌ను దుయ్యబట్టడానికి అందులో బోలెడంత సమాచారం కనిపించింది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక అబద్ధాల పుట్ట అని ఆయన నిందించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌ పూర్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక అచ్చం ముస్లింలీగ్‌ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉంది అన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక స్వాతంత్య్రానికి ముందు ముస్లిం లీగ్‌ భావన లాగే ఉంది అని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పాలనలో పేదల అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్తూనే తన ఆత్మ స్తుతీ దండిగానే చేసుకున్నారు. కాంగ్రెస్‌ లూటీకి అడ్డుకట్ట వేసింది తనేనన్నారు. ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగవలసిఉన్న చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్‌లోనూ సోమవారం ఆయన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో లోపాలు ఎన్నడంతోనే సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్‌ హయాంలో భారత్‌ అవినీతికి ప్రతీకగా మారిపోయిందని, లూటీ చేయడానికి లైసెన్సు ఉండేదని అన్నారు. పేదల బాధ కాంగ్రెస్‌కు ఎన్నడూ అర్థం కాలేదని ఎత్తి పొడిచారు. కరోనా మహమ్మారి పంజా విసిరినప్పుడు పేదల గతి ఏమవుతుందన్న తీవ్ర ఆందోళన వ్యక్తమైనప్పుడు ‘‘నేను వారికి టీకా లిప్పించాను, రేషన్‌ అందించాను’’ అన్నారు. టీకా తయారు చేసింది ఆయనే అయినట్టు, ఆహార ధాన్యాల సరఫరా తన జేబులోంచి తీసి ఇచ్చినట్టు మోదీ మాట్లాడుతున్నారు. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు అని చెప్పినప్పుడు మాత్రం ‘‘మా ప్రభుత్వం’’ అన్నారు. మిగతాదంతా ఆయన ఘనతే. అవినీతివల్ల ఎక్కువగా నష్టపోయేది పేదలేనని చెప్పారు. ‘‘అవినీతి పేదల హక్కులను కాజేస్తుంది. 2014 కు ముందు లక్షలాది కోట్ల కుంభకోణాలు జరిగాయి. ప్రభుత్వం విడుదలచేసే సొమ్ములో 85 శాతం దారి మళ్లుతోంది, ప్రజలకు అందేది కేవలం పదిహేను శాతమేనని రాజీవ్‌ గాంధీ అన్నారు’’ అని చెప్తూ రాజీవ్‌ మాటలను వాటంగా తన అసత్య ప్రచారానికి వినియోగించుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరవాతే ప్రభుత్వం అందించే ప్రతి పైసా పేదలకు అందుతోందట. గత పదేళ్ల కాలంలో రూ.34 లక్షల కోట్లు పేదలకు అందించింది తానేనట. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే మొత్తం 34 కోట్లలో 28 కోట్లు ఆ పార్టీ అవినీతి ఖాతాలో పడిపోయేవని దెప్పి పొడిచారు. కాంగ్రెస్‌ నాయకుల లూటీని అంతం చేస్తుంటే తనను దూషిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆ మధ్య పార్లమెంటులో మాట్లాడుతూ ‘‘వాళ్లు అంత మంది. నేనొక్కణ్నే. నా ఒక్కడి మీద ఇంత మంది దాడి చేస్తున్నారు’’ అని ఏడ్చినంత పని చేశారు. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలను ఎదుర్కోవడానికి ప్రజా మద్దతు తనకు డాలులా ఉపకరిస్తోందట. మోదీ నోరు తెరిస్తే స్వీయ కీర్తి గానంలోనే కాలం గడిపేస్తారు. ‘‘బెదిరింపులకు నేను భయపడను. ఇండియానే నా కుటుంబం. నా దేశాన్ని రక్షించడమే నాకు సరిపోతోంది. లూటీ నుంచి నా కుటుంబాన్ని రక్షించడమే నాపని. నేను అవినీతిపరులను తొలగించండి అంటే వాళ్లు అవినీతిపరులను కాపాడండి అంటారు’’ అని మోదీ ఆరోపణ తానేచేసి జవాబూ తానే చెప్తారు. కాంగ్రెస్‌, ప్రతిపక్షాల ర్యాలీలు అవినీతి పరులను కాపాడడానికేనట. తనను ఎంత బెదిరించినా అవినీతిపరులు జైలుకెళ్లడం ఖాయం అని మోదీ తన భవిష్యత్‌ కార్యాచరణను ఆవిష్కరిస్తున్నారు. ‘‘ఇది మోదీ గ్యారంటీ’’ అంటున్నారు. మోదీ గ్యారంటీ అన్న మాటే తప్ప బీజేపీ, ప్రభుత్వ ప్రస్తావన ఎక్కడా ఉండదు. మంచంతా తన పంచల్లోనే ఉంటుందని మోదీ భావిస్తారు. గత రెండు మూడు రోజుల ఎన్నికల ప్రచార సభల్లో మోదీ శ్రీ రామ నవమి ప్రస్తావన తీసుకురావడంలో హిందుత్వ ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం బహిరంగంగానే కనిపిస్తోంది.
కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక ఆసరాగా మోదీ విమర్శనాస్త్రాలను విశ్లేషించాలంటే ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ఎన్ని అవినీతి ఆరోపణలను దేశ భద్రత పేరు చెప్పి గంప కింద కమ్మేశారో గమనించాల్సిందే. రాఫెల్‌ లాంటి అతి పెద్ద కుంభకోణంలోనే దేశ భద్రత పేరు చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆ వ్యవహారాన్ని విచారించకుండా అడ్డు తగులుతున్నారు. తామే అవినీతి పరులని ముద్రవేసి నానా హడావుడిచేసి ఆ ప్రతిపక్ష నేతలందరినీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దాడి చేయించి బీజేపీలో చేర్చుకున్న విషయాన్ని మోదీ సులభంగా విస్మరించగలరు. అధికారంలోకి వచ్చి పదేళ్లయినా మోదీ కాంగ్రెస్‌ను, ఇతర ప్రతిపక్ష పార్టీలను తప్పు పట్టడం మానలేదు. ఈ పదేళ్ల కాలంలో సాధించిందేమీ లేనందువల్ల ఓటమి భయం మోదీని వెంటాడుతూనే ఉంది కనక నోరుపారేసుకుంటున్నారు. సకల నియమాలను తుంగలో తొక్కుతున్నారు. తమ ఎన్నికల ప్రణాళిక ముస్లింలీగ్‌ భావజాలానికి ప్రతిరూపంగా ఉంది అని మోదీ విమర్శించినందుకు కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ వ్యవహారసరళి చూస్తే ఈ ఫిర్యాదు పోస్టు చేయని ఉత్తరంగా మిగిలిపోక తప్పదేమో! ఎన్నికల ప్రణాళిక బీజేపీకి ఒక తంతుగానైనా మిగలలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలు ఒక విడత పూర్తి అయిన తరవాత బీజేపీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. ఈ సారీ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నాయకత్వంలో 27 మందితో ఓ కమిటీ గత వారం ఏర్పాటు చేశారు. మొదటి దశ పోలింగ్‌ నాటికి ఆ ప్రణాళిక విడుదలైతే అక్కడికదే గొప్ప. అయినా ఎన్నికల ప్రణాళికతో మోదీకేం పని? ఆయన నోటి నుంచి వెలువడ్డ ప్రతి మాటా ఎన్నికల ప్రణాళికే. బీజేపీ 370 స్థానాలు సాధిస్తుంది, ఎన్‌.డి.ఎ. 400 సీట్లలో విజయం సాధిస్తుందిలాంటి ప్రగల్బాలన్నీ ఎన్నికల ప్రణాళికలే అనుకోవాలి. బీజేపీ ఎన్నికల ప్రణాళిక రూపొందించడానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ నాయకత్వంలో 27 మందితో కమిటీ నియమిస్తే అందులో సమన్వయ కర్త, సహ సమన్వయ కర్త మినహా అందరూ రాజకీయంగా అనేక మందిని సంతృప్తి పరిచే ప్రయత్నమే కనిపిస్తుంది. అందులో మౌలిక సదుపాయాల కల్పనకోసం విశేష కృషి చేశాడంటున్న గడ్కరి పేరు లేదు. అలాగే బీజేపీ హిందుత్వ రాజకీయాలకు ప్రతీక అయిన యోగీ ఆదిత్యనాథ్‌ పేరు కూడా లేదు. కానీ ఆదిత్యనాథ్‌ కు ప్రత్యామ్నాయ నాయకుడనుకుంటున్న రాధా మోహన్‌ సింగ్‌ పేరు మాత్రం ఉంది. ఎన్నికల ప్రణాళిక మోదీ హయాంలో ఓ తంతు మాత్రమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img