Friday, May 3, 2024
Friday, May 3, 2024

సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు నామినేషన్‌

. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల భారీ ర్యాలీ
. కోటేశ్వరరావును గెలిపించాలని రామకృష్ణ, నేతల పిలుపు

విశాలాంధ్ర – విజయవాడ : ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్‌, సీపీఎం బలపర్చిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ స్థానానికి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాన్ని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాలు, కోలాహలం మధ్య నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ సుంకర పద్మశ్రీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ, కేవీవీ ప్రసాద్‌, ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, లాయర్స్‌ అసోసియేషన్‌ నాయకులు చలసాని అజయ్‌కుమార్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ, వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ కోటేశ్వరరావు, కౌలు రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు, సీపీఐ సీనియర్‌ నాయకులు కొరగంజి దుర్గాంబ, సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, కృష్ణాజిల్లా కార్యదర్శి టి.తాతయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని జి.కోటేశ్వరరావుకు మద్దతు ప్రకటించారు. ముందుగా రామకృష్ణ ర్యాలీ ప్రారంభించి ప్రసంగించారు. నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న కోటేశ్వరరావుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న సుజనా చౌదరి దిల్లీ నుంచి ఊడిపడ్డారని, స్థానిక సమస్యలపై ఆయనకు అవగాహన ఉండదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసిందని రామకృష్ణ విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీపీఐ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి… స్థానికంగా పరిచయాలు గల జి.కోటేశ్వరరావును గెలిపించటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సీపీఐ అభ్యర్థి విజయంతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ నియోజకవర్గంలో 55 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సీపీఐ గెలవాలని ఆకాంక్షించారు. సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు తమ్మిన పోతరాజు, మరుపిళ్ల చిట్టి, ఆపిఫ్‌ పాషా, పోతిన చిన్నా, ఉప్పలపాటి రామచంద్రరాజు, కె.సుబ్బరాజు, షేక్‌ నాసర్‌వలి స్ఫూర్తితో ప్రజల పక్షాన నిలిచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలరా హాస్పటల్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ రథం సెంటర్‌ వద్ద ముగిసింది. ర్యాలీ ముగింపు సందర్భంగా జరిగిన సభకు దోనేపూడి శంకర్‌ అధ్యక్షత వహించారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు, సుంకర పద్మశ్రీ, జల్లి విల్సన్‌ ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు ఆవశ్యకతను వివరించారు. జి.కోటేశ్వరరావుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఇండియా కూటమి నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, బోయ సత్యబాబు, దోనేపూడి శంకర్‌తో కలిసి కోటేశ్వరరావు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ సమర్పించారు.
నూతనోత్సాహంతో సాగిన ర్యాలీ
పశ్చిమ నియోజకవర్గంలోని కేఎల్‌ రావు పార్కు, కలరా హాస్పటల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ చిట్టినగర్‌, తమ్మిన పోతరాజు రోడ్డు, నెహ్రూ బొమ్మ సెంటర్‌, బ్రాహ్మణ వీధి, రథం సెంటర్‌ వరకు సాగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రనాయక్‌, రాష్ట్ర కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య, రాష్ట్ర నాయకులు ఎస్‌కే నజీర్‌ సారధ్యంలో కళాకారుల కోలాట నృత్యాలు, డప్పు డ్యాన్సులు, విచిత్ర వేషధారణలు, వీధి ప్రదర్శనలతో ర్యాలీ సాగింది. ఉదయం 9 గంటలకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో కలరా హాస్పటల్‌ వద్దకు చేరుకున్నారు. ఎర్ర బెలూన్లు, గొడుగులు, టోపీలు, ధరించి సీపీఐ జెండాలు చేతబూని ఎండను సైతం లెక్క చేయకుండా వడివడిగా నడుస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఎర్రచీరలు ధరించి మహిళలు, రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు ర్యాలీని క్రమశిక్షణతో సమన్వయం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ సత్తా చాటారు.
నామినేషన్‌ ఫీజుకు ఆర్చర్‌ చెరుకూరి డాలీ శివాని విరాళం
కిడ్‌ ఆర్చర్‌ చెరుకూరి డాలీ శివాని తాను పోటీలలో గెలుచుకున్న నగదు ప్రోత్సాహం నుంచి సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు నామినేషన్‌ ఫీజు కోసం పదివేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ ఎన్నికలలో కోటేశ్వరరావు విజయం సాధించాలని ఆకాంక్షించారు. తండ్రి చెరుకూరి సత్యనారాయణ, తల్లి చెరుకూరి కృష్ణకుమారికి కోటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img