Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

లుకలుకలు

. బీజేపీతో పొత్తుపై వణుకుతున్న టీడీపీ, జనసేన
. మైనార్టీల ఓట్లపై ఆందోళన
. ప్రచారంలో ఎవరిదారి వారిదే
. బాబు, పవన్‌ సభల్లో కానరాని కాషాయ నేతలు, జెండాలు

విశాలాంధ్ర – బ్యూరోఅమరావతి: రాష్ట్రంలో టీడీపీజనసేన`బీజేపీ ఎన్డీఏ కూటమిగా పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ…ఆశించినంత రాజకీయ మైలేజీ రాకపోవడంతో ఆ పార్టీలకు దిక్కుతోచడం లేదు. పేరుకే పొత్తులు కనిపిస్తున్నాయి కానీ ప్రచారంలో ఆ ఒరవడి కనిపించడంలేదు. మూడు పార్టీల శ్రేణులు మమేకమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇక నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ మూడు పార్టీల మధ్య ఇంకా సీట్ల పంచాయితీ సద్దుమణగలేదు. చాలా చోట్ల నేతలు ఉమ్మడిగా ప్రచారం చేయకుండా ఎవరివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకుగాను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగాయి. పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆయా పార్టీల మధ్య సయోధ్యబాగానే ఉన్నప్పటికీ, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మార్పు కన్పిస్తున్నది. బీజేపీ నేతలను, ఆ పార్టీ జెండాలను, కండువాలను టీడీపీ, జనసేన నేతలు పక్కన పెట్టేస్తున్నారు. ఆ పార్టీతో పొత్తువల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. ఎన్నికల ప్రచారానికి ఎక్కువగా టీడీపీ, జనసేన నేతలే వెళ్తున్నారు. వారి సభల్లోను టీడీపీ, జనసేన జెండాలే కన్పిస్తున్నాయి. బీజేపీ జెండాలు, మోదీ బొమ్మలు కానరావడం లేదు. ముస్లింలు, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అసలు బీజేపీ ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ రెండు పార్టీలు బీజేపీతో అయిష్టంగానే పొత్తుకు దిగినట్లు స్పష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా నిలదిక్కుకోవాలని బీజేపీ ఎంతోకాలంగా ప్రయత్నిస్తోంది. ఓటింగ్‌ శాతం పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నది. అయినా ఆ పార్టీకి ప్రజాదరణ కరువైంది. ఏపీలో 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువగా ఓట్లు రావడం గమనార్హం. టీడీపీ, జనసేనలను లోబర్చుకుని తమ వైపుకు తిప్పుకోగలిగింది. అప్పటివరకు టీడీపీ, జనసేన కూటమికి కాస్త మైలేజీ ఉందనుకునేలోగా… బీజేపీ కలిసిన వెంటనే ప్రజా వ్యతిరేకత పెరిగింది. దేశంలోను, రాష్ట్రంలోను బీజేపీ, మోదీపై ప్రజాగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో చేరడం ద్వారా ఆ పార్టీకి మిత్రపక్షాలుగా మారిన టీడీపీ, జనసేనతో పాటు లోపాయికారీ అవగాహనతో బీజేపీతో కలిసినడుస్తున్న వైసీపీపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్డీఏ, వైసీపీపై ముస్లిం, మైనార్టీల ఆగ్రహం
ముస్లింలు, మైనార్టీలపై దాడుల పరపరంతో ఎన్డీఏ కూటమిపై, వైసీపీపై ముస్లిం, మైనార్టీలు వ్యతిరేకతతో ఉన్నారు. దీనిని గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నట్లే పెట్టుకుని… ఆ పార్టీ జెండాలను ఎక్కడా దరిచేరనీయడంలేదు. ఇప్పటివరకు అధికంగా చంద్రబాబు, పవన్‌ కల్యాణే ఉమ్మడిగా ప్రసంగాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పెడన, మచిలీపట్నం బహిరంగ సభల్లోను చంద్రబాబు, పవన్‌ మాత్రమే పాల్గొన్నారు. ఆయా సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎక్కడా కన్పించలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన సభల్లోనూ చంద్రబాబు, పవన్‌ మాత్రమే అధికంగా పర్యటించారు. దీనికితోడు చంద్రబాబు, పవన్‌ ప్రసంగాల్లో మోదీ ప్రస్తావన ఎక్కడా విన్పించడం లేదు. టీడీపీ, జనసేన జెండాలతో కలిసి కాషాయ జెండా రెపరెపలు కనిపించడం లేదు. గతంలో చిలకలూరిపేట వేదికగా జరిగిన ఎన్డీఏ కూటమి తొలి సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సభలో ప్రసంగించిన మోదీ సీఎం జగన్‌పై విమర్శలు చేయలేదు. మోదీకి ముందు చంద్రబాబు, పవన్‌ మాట్లాడి…జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. చెల్లికి, తల్లికి జగన్‌ ద్రోహం చేశారంటూ చంద్రబాబు మండిపడగా… మోదీ తన ప్రసంగంలో వైసీపీ, కాంగ్రెస్‌ ఒక్కటేనని వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో పరోక్షంగా జగన్‌కు మోదీ సహకారం ఉందన్న సంగతి చంద్రబాబు, పవన్‌కు అర్థమైంది. బీజేపీతో కలవడంతో టీడీపీ, జనసేనకు ముస్లిం, క్రైస్తవ సోదరులు పూర్తిగా దూరమయ్యే పరిస్థితులున్నాయి. బీజేపీపై ఎంత వ్యతిరేకత ఉందో, అంతే స్థాయిలో టీడీపీ, జనసేన పార్టీలపైనా మైనార్టీలు వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇక రాష్ట్రంలో మైనార్టీలకు ఎన్డీఏ కూటమి నుంచి అతి తక్కువగా అసెంబ్లీ సీట్లు కేటాయించారు. టీడీపీ కేవలం ముగ్గురికే ఎమ్మెల్యే సీట్లిచ్చింది. ఈ పరిణామంపై ముస్లింలు ఎన్డీఏ కూటమిని దుయ్యబడుతున్నారు. చేయకూడనిదంతా చేసి, ఎన్నికలకు మరో 25 రోజుల ముందు టీడీపీ, జనసేన మాత్రమే ఉమ్మడిగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ జెండాలు, కండువాలను దూరం పెడుతున్నారు. అసలే ఎన్డీఏ కూటమికి ముస్లిం, క్రైస్తవుల ఓట్ల శాతం చాలా తక్కువ ఉండగా… ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీతో కలసిమెలసి తిరిగితే… ఉన్న ఓట్లు కాస్తా పోతాయన్న ఆందోళన టీడీపీ, జనసేనలో ఏర్పడిరది. జనసేన పార్టీ నుంచి సగానికిపైగా నియోజకవర్గ స్థాయి నేతలు వైసీపీలో చేరారు. ఆ పార్టీ క్రమేపీ బలహీన పడుతోంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులు కలవరం చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img