Friday, May 3, 2024
Friday, May 3, 2024

వలంటీర్ల గండం గట్టెక్కేదెలా?

. రాష్ట్రవ్యాప్తంగా 44 వేల మంది రాజీనామాలు
. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం
. విపక్ష అభ్యర్థుల్లో గుబులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అనుకున్నదదొకటి, అయినది ఇంకొకటి అన్న చందంగా రాష్ట్రంలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు విపక్ష అభ్యర్థులకు కునుకు లేకుండా చేస్తోంది. వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచితే తొలుత ఇబ్బంది లేదని భావించినప్పటికీ ఇప్పుడు వారు పెద్దసంఖ్యలో రాజీనామాలకు తెగించడంతో ఈ పరిణామం వారిలో గుబులు రేపుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందజేయడంతోపాటు, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది వలంటీర్లను నియమిం చారు. నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ప్రత్యక్ష సంబంధాలు కల్గిన వీరికి వైసీపీ ప్రభు త్వంలో అత్యధిక ప్రాధాన్యత ఏర్పడిరది. ముఖ్యంగా రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది వృద్ధులు, వితంతవులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితర పెన్షన్‌ దారులకు ప్రతి నెలా 1వ తేదీ పింఛన్‌ సొమ్ము వారి చేతుల్లో పెట్టడం వీరి విధుల్లో అత్యంత ముఖ్యమైంది. అలాగే వలంటీర్ల పరిధిలోని కుటుంబాలకు పెన్షన్‌, రేషన్‌, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు కావాలన్నా, భూములకు పట్టాలు ఇతరత్రా అన్ని రకాల సేవలకు వీరే సహాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఆయా కుటుం బాలకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా వీరి వద్ద ఉంది. ఎవరు ఏ కులం, ఎవరు ఏ పార్టీ, ఎవరు ఏం పనిచేస్తున్నారనే సమగ్ర సమాచారం వలంటీర్ల గుప్పిట్లో ఉంది. దీంతో ఏపీలో ఎన్నికలు సక్రమంగా, సజావుగా సాగాలంటే వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కేంద్ర ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేసింది. మరోవైపు హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది.ఫలితంగా ఏప్రిల్‌ 1వ తేదీ పెన్షన్‌ల పంపిణీ ఆలస్యమవడమేగాక, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 33 మంది ఎండ దెబ్బకు తట్టుకోలేక మృతి చెందారు. టీడీపీ వల్లే వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని… వారికి సంబంధించిన సంస్థ ఫిర్యాదులు చేసి కోర్టును ఆశ్రయించడం వల్లే వృద్ధులు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చిందని వైసీపీ దుమ్మెత్తి పోసింది. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ తీసుకున్న నిర్ణయం లక్షల సంఖ్యలో ఉన్న పెన్షన్‌దారులు, వారి కుటుంబసభ్యుల్లో తమపై వ్యతిరేకత పెంచే పరిస్థితి ఏర్పడిరదని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. టీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్లను తొలగిస్తారన్న భయాన్ని వారిలో తొలగించే ప్రయత్నాలు చేశారు. వలంటీర్లను కొనసాగిస్తామని, పైగా వారి జీతాన్ని రెట్టింపు చేసి నెలకు రూ.10 వేలు చెల్లిస్తామని ప్రకటించడం ద్వారా వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. అలాగే వృద్ధులకు సచివాలయ ఉద్యోగుల ద్వారా నేరుగా పెన్షన్‌ ఇంటికే పంపిస్తామని, ఏప్రిల్‌ నెల నుంచే రూ.4వేలు ఇస్తామని ప్రకటించారు. కూటమిలోని జనసేన, బీజేపీ నేతలు కూడా వలంటీర్లలో వ్యతిరేకత లేకుండా చూసేందుకు వారికి అనుకూలంగా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ తన వ్యూహాన్ని మార్చి వలంటీర్లను పూర్తిస్థాయిలో ఎన్నికలకు వినియోగించుకునేం దుకు వారితో రాజీనామాలు చేయించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీరి పదవీ కాలం ఎలాగూ జులైతో ముగుస్తున్నందున… వారికి ఈ మూడు నెలలపాటు వైసీపీ అభ్యర్థులే రెట్టింపు జీతాలు చెల్లించడంతోపాటు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మరలా కొనసాగించేలా హామీలు ఇస్తూ రాజీనామాలు చేపిస్తున్నారు. ప్రస్తుతం వలంటీర్ల రాజీనామాల పర్వం రాష్ట్రంలో ఓ ప్రహసనంలా కొనసాగుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రాజీనామాలు చేసిన వలంటీర్ల సంఖ్య ఇప్పటికే 44 వేలు దాటిపోయింది. వీరంతా రాజీనామాలు చేశాక వైసీపీ అభ్యర్థుల విజయానికి స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారు. ఈ పరిణామం కూటమి అభ్యర్థులకు కునుకు లేకుండా చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తే రూ.10వేలు ఇస్తామని, ఉద్యోగం కొనసాగిస్తామని హామీ ఇస్తూ కొంతమందితో కూటమి అభ్యర్థులు కూడా రాజీనామాలు చేపించే ప్రయత్నాలు చేపిస్తున్నప్పటికీ వైసీపీ రాజీనామాల వ్యూహం వారికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వలంటీర్ల గండాన్ని ఏ విధంగా గట్టెక్కాలనే దానిపై కూటమి నేతలు దృష్టి సారించారు. దీనిపై సోమవారం హైకోర్టులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజీనామాలు చేసిన వలంటీర్లు ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నారని తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. వీరు అలా చేయకుండా అడ్డుకోవాలని హైకోర్టును కోరారు. రాష్ట్రంలో 44 వేల మందికి పైగా వలంటీర్లు వైసీపీ ఆదేశాల మేరకు రాజీనామాలు చేసి వారికి ఎన్నికల్లో సహకరిస్తున్నారని… కాబట్టి వారి రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని యాదవ్‌ కోరారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img