Tuesday, November 18, 2025
Homeవిశ్లేషణఅటకెక్కిన కౌలు రైతులకిచ్చిన హామీలు

అటకెక్కిన కౌలు రైతులకిచ్చిన హామీలు

- Advertisement -

పి.జమలయ్య

ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు పూర్తవుతున్నది. వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలురైతులందరికీ గుర్తింపు కార్డులు జారీ కాలేదు. అన్నదాత సుఖీభవ పథకం అక్టోబర్‌కు వాయిదా పడిరది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాక ముందే గుర్తింపుకార్డులు ఇవ్వాలని మొత్తుకున్నప్పటికి ఇవ్వకుండా రెండున్నర నెలలు జాప్యం చేశారు. పంటలువేసే కాలంలో రుణాలు అందించకుండా నిర్లక్ష్యం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం అవసరమైన వారికి ఇవ్వకుండా అవసరంలేని వాళ్లకే ముందస్తుగా ఇచ్చారు. ఇప్పుడు సమీక్ష సమావేశాలు వేసి కౌలు రైతుల సంక్షేమం గురించి మాట్లాడటం బాధాకరం. ఆగస్టు 18 న రాష్ట్ర సచివాలయంలో వర్చువల్‌గా వ్యవసాయ, బ్యాంకు, రెవెన్యూ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి అర్హులైన కౌలు రైతులందరికీ సిసిఆర్సి కార్డుల ఆధారంగా ‘‘స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌’’ నిబంధనల ప్రకారం పంట రుణాలు మంజూరు చేయాలని లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్లను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
కౌలురైతులకు రుణాల మంజూరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసేందుకు అధికారులు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యంలో 91శాతం మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు అందజేశామని తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించినప్పుడు 91 శాతం సిసిఆర్సి కార్డులు ఇచ్చినట్లు పేర్కొన్నప్పటికీ ఆ కార్డులు కౌలు రైతులకు అందలేదు. కంప్యూటర్‌లోనే ఉండిపోయాయి. మరొక అంశం ఏంటంటే ఒక కౌలురైతు సాగు చేస్తున్న భూమి ఎన్ని సర్వే నెంబర్లలో ఉంటే ఒక్కొక్క సర్వే నెంబర్‌కు ఒక్కొక్క కార్డు ఇచ్చి గతంలో ఎన్నడూలేని విధంగా 91 శాతం కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. కౌలు గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతుల జాబితాను రైతు సేవా కేంద్రంలో కానీ, గ్రామ సచివాలయంలోగానీ బహిరంగ పరచలేదు. సిసిఆర్సీ కార్డుల జాబితాను పరిశీలించడానికి అందుబాటులో ఉంచకుండా విస్తృతంగా ఇచ్చామని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వర్చువల్‌ సమావేశంలో ప్రముఖంగా పేర్కొన్న మరొక అంశం ఏమిటంటే గడచిన సంవత్సరంలో రెండు సీజన్‌లకు కలిపి రూ.4 వేలకోట్లు పంట రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.4,474.11 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. ఇది మరీ విచిత్రంగా ఉంది. గత ఖరీఫ్‌ సీజన్‌లోనే కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలంటే భూ యజమాని సదరు బ్యాంకులో బకాయి ఉన్నా లేదా ప్రస్తుతం పంట రుణం తీసుకున్నా ఆ సర్వే నంబరు గల భూమిపై ఎటువంటి పంట రుణాలు జారీ చేయకూడదని ‘‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌’’ లో రూపొందించుకొని అన్ని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్లకు, బ్యాంక్‌ బ్రాంచ్‌లకు సర్కులర్‌ జారీ చేశారు.
రాష్ట్రంలో భూమి కలిగిన యాజమానులు తమ భూములను కౌలురైతులకు ఇచ్చి బ్యాంకుల నుంచి పంటలు రుణాలు తీసుకునే వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. అలాంటప్పుడు కౌలు రైతులకు పంట రుణాలు ఏ విధంగా ఇచ్చారో సమాధానం చెప్పటంలేదు. ఏదో కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చామని చెప్పుకోవడం బాధాకరం. ఒకవేళ ఇచ్చారని అనుకున్న పంట రుణాలు పొందిన కౌలు రైతులు జాబితాను బ్యాంకు వద్ద గాని, రైతు సేవా కేంద్రం వద్ద గాని, గ్రామ సచివాలయం వద్ద గాని బయట పెట్టడంలేదు. ఎవరికి రుణాలు ఇచ్చారో కూడా తెలియదు. సిసిఆర్సీ కార్డుల ఆధారంగా పంట రుణాలు పొందితేనే వాస్తవంగా పంట రుణాలు తీసుకున్నట్టు లెక్క. అలా గాకుండా ‘‘సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులల్లో ఉన్న కౌలురైతుల మహిళలకు రుణాలు ఇచ్చి ఆ రుణాలను పంట రుణాలుగా మార్చి లెక్కలు చెప్పటం హాస్యాస్పదంగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 లక్షల సిసిఆర్సీ కార్డులిచ్చామని ఇందులో 75,858 కార్డులు రెన్యువల్‌ చేసినట్లు చెప్పారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలోనే కౌలుగుర్తింపు కార్డు జారీ ప్రక్రియ ప్రారంభించేవారు. కూటమి సర్కారు వచ్చిన నేపథ్యంలో ఈసారి రెవిన్యూ శాఖ ద్వారా కాకుండా వ్యవసాయ శాఖ ద్వారా కార్డులు ఇస్తామని, దానికి అనుగుణంగా నూతన చట్టం తీసుకురానున్నామని ఘంటాపథంగా చెప్పారు. చట్టం రాలేదు. దాదాపు రెండున్నర నెలలు నిర్లక్ష్యం చేసి కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టకుండా రెవిన్యూ శాఖ నిద్దుర పోయింది. ఆ సంగతే మరిచిపోయారు. గతంలో ఎన్నికల సందర్భంగా కూటమినేతలు ‘‘ఆంధ్రప్రదేశ్‌ పంట సాగుదారు హక్కుల చట్టం’’ ద్వారా కౌలు గుర్తింపు కార్డులు పొందడం సాధ్యం కావడం లేదని, దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ పని చేయకుండా పాత చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. నూతనంగా తీసుకొస్తామని చెప్పిన చట్టం గురించి ప్రస్తావించక పోవడం చాలా బాధాకరం. వాగ్దానాలు, హామీలు ఏనాడో అటకెక్కాయి.
సమీక్ష సమావేశంలో పేర్కొన్న మరొక అంశం ఏమిటంటే గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు ఈ ఏడాది మొత్తంగా రూ.8 వేలకోట్లు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించుకోగా, ఇప్పటి వరకూ రూ.838 కోట్లు మంజూరు చేశామన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ఎటువంటి హమీ లేకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని సమావేశంలో ఆదేశించారు. ఈ ఆదేశాలను ఆచరణలో అమలు పరిశీలిస్తే ‘‘ఎద్దు మూతికి చిక్కం కట్టి వరిగడ్డి వాము దగ్గరికి తీసుకెళ్లి మేత మేయమన్నట్లు’’ ఉంది. పైన తెలియజేసిన విధంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు ఆంధ్రప్రదేశ్‌ పంట సాగు ద్వారా హక్కుల చట్టంలోని సెక్షన్‌ 5 లో పేర్కొన్న నియమాలకు విరుద్ధంగా నిబంధన రూపొందించి పంట రుణాలు కౌలు రైతులకి ఇవ్వాలని ఆదేశించడం కౌలు రైతులను నమ్మించడానికి తప్ప మరొకటి కాదు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామంలో 9 ఎకరాలు కౌలు చేస్తున్న నిమ్మగడ్డ వాసు గత రెండు నెలల నుంచి గుర్తింపు కార్డు ఇవ్వమని గ్రామ సచివాలయ అధికారులను అడుగుతుంటే అదిగో ఇదిగో అని చెబుతూ ఇంతవరకు ఇవ్వలేదు. విజయవాడ రూరల్‌ మండలం పైడూరుపాడులో పెయ్యల నాగరాజుకు గుర్తింపు కార్డు ఇస్తామని చెబుతూ ప్రదక్షిణలు చేయించు కుంటున్నారు తప్ప కార్డు ఇవ్వడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం, పాందువ గ్రామానికి చెందిన నలుగురు దేవాదాయ కౌలురైతులకు పంటరుణాలు ఇస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు అందజేయలేదు.
నూతనంగా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసిన జాబితాతో పాటు రుణాలు పొందిన వివరాలు సంబంధిత ఆఫీసుల వద్ద బహిరంగ పర్చితే వాస్తవంగా కార్డులు పొందిన వారెవ్వరో, పంటరుణాలు తీసుకుంటున్న వారి వివరాలు వెలుగులోకి వస్తాయి. ఈ కృషిలో వివిధ శాఖల పనితీరు పారదర్శకత ఏమిటో కుడా ప్రజలకు బోధపడుతుంది. లేకపోతే కార్డులు జారీ చేసిన రెవెన్యూ శాఖ, రుణాలు ఇస్తున్న బ్యాంకుల నిజాయితీని శంకించవలసి ఉంటుంది. అర్హులైన కౌలు రైతులందరూ లబ్ధిపొందేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సమావేశంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చాలా సంతోషం కానీ వాస్తవంగా చెప్పాలంటే గత దశాబ్ద కాలం నుంచి వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు, బ్యాంకుల ఉన్నతాధికారులు, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో ఉమ్మడి నిర్ణయాలు కూడా చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి చట్టబద్ధమైన విధానాలు రూపొందించకుండా సమీక్షా సమావేశాల్లో పేర్కొన్న మినిట్స్‌, సూచనలు, సలహాలు, ఆచరణలో అమలు కానీ ఆదేశాలు చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు అందించి ఆదుకోవాలనే ఒక దృఢమైన సంకల్పం ఉంటే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను ఎత్తివేయాలి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు పంట హామీపై రుణాలు జారీ చేయాలి. కౌలు రైతు సాగు చేస్తున్న భూమి యొక్క దామాషాను బట్టి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు ఇవ్వాలి. వీటిని అమలు చేయాలంటే చట్టబద్ధమైన విధానాలను తీసుకు రావాలి. కౌలురైతులకు నిర్ధేశించిన పథకాలు అమలుపై ఎప్పటికÄÄÄÄప్పుడు పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను గుర్తించాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. కౌలు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

  • ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం, ప్రధాన కార్యదర్శి
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు