Homeవిశ్లేషణఅడుగంటుతున్న భూగర్భ జలాలు… ఎండుతున్న పంటలు

అడుగంటుతున్న భూగర్భ జలాలు… ఎండుతున్న పంటలు

- Advertisement -

గంగారపు మునిరత్నం

రాయలసీమలో 2026 నైరుతి రుతుపవనాల పరిస్థితి రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ 1 నుంచి ఆగస్టు 20 వరకు నమోదైన సమీకృత వర్షపాత గణాంకాలు చూస్తే ఈ ప్రాంతంలో వర్షాభావం తీవ్రంగా కొనసాగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టు 20 నాటికి అన్నమయ్య జిల్లాలో-75.9 శాతం, చిత్తూరులో-66.5 శాతం, శ్రీ సత్యసాయిలో-56.8 శాతం, వైఎస్సార్ కడపలో-52.7 శాతం, నంద్యాలలో-49.6 శాతం, అనంతపురంలో-40.4 శాతం, తిరుపతిలో-36.4 శాతం, కర్నూలులో-36.3 శాతం వరüలోటు నమోదైంది. రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లోనూ సాధారణ వర్షపాతానికి లోటు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అన్నమయ్య జిల్లాలో జూన్ 1 నుంచి ఆగస్టు 20 వరకు సాధారణంగా 245.73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 59.28 మి.మీ. మాత్రమే నమోదైంది. చిత్తూరులో సాధారణం 271.93 మి.మీ.కాగా 91.16 మి.మీ., వైఎస్సార్ కడపలో సాధారణం 241.58 మి.మీ. కాగా 114.33 మి.మీ. మాత్రమే నమోదయ్యాయి. ఇది కేవలం వర్షపాతం లోటు కాదు. వర్షం లేక సాగుకు నోచుకోని పొలాలు, విత్తిన పంటను కాపాడేందుకు నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు, అడుగంటుతున్న భూగర్భజలాలు, ఎండిపోతున్న బోర్లు, వాడిపోతున్న మామిడి-చీనీ తోటలు, పశుగ్రాస కొరత, తగ్గుతున్న వ్యవసాయ పనులు-ఇవన్నీ కలిసి రాయలసీమలో బహుముఖ సంక్షోభానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. రాయలసీమ వ్యవసాయానికి సకాలంలో వర్షం కీలకం. ఈ ఏడాది వర్షాలు లేక ఖరీఫ్ వ్యవసాయ క్యాలెండర్ అనేక ప్రాంతాల్లో తారుమారైంది. వేరుశెనగ, కంది, పెసర, మినుము వంటి పంటలు ఆశించిన స్థాయిలో సాగుకు నోచుకోలేదు. వర్షం కోసం ఎదురుచూస్తూ సాగు సమయం దాటిపోవడంతో అనేక ప్రాంతాల్లో భూములను ఖాళీగా ఉంచాల్సి వచ్చింది.
ఆగస్టు చివర్లోనూ తగ్గని ఎండ తీవ్రత : వర్షాభావానికి తోడు ఆగస్టు చివర్లోనూ రాయలసీమలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. “నా 60 సంవత్సరాల జీవితంలో ఆగస్టు చివర్లో ఇలాంటి ఎండ తీవ్రతను చూడలేదు” అని పలువురు రైతులు, గ్రామీణ ప్రజలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. నేలలో తేమ లేక, పగటి వేడి కారణంగా మామిడి-చీనీ తోటలు దెబ్బతింటున్నాయి. అడుగంటుతున్న భూగర్భజలాలు, ఎండిపోతున్న బోర్లు, తగ్గిపోతున్న పచ్చిమేతకు తోడు ఈ వేడి రైతు కుటుంబాలపై అదనపు భారాన్ని పెంచుతోంది. రాయలసీమ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ఉద్యాన పంటలకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కడప ప్రాంతాల్లో మామిడి, చీనీతో పాటు అరటి, బొప్పాయి, టమాటా, కూరగాయల సాగుపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వర్షాభావంతో నేలలో తేమ తగ్గి, బోర్ల నీటిమట్టాలు పడిపోవడం, నీటిపారుదల ఖర్చులు పెరగడంతో తోటలపై ఒత్తిడి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో మామిడి, చీనీ చెట్లు వాడిపోవడం, ఆకులు రాలిపోవడం, కొమ్మలు ఎండిపోవడం రైతులను కలవరపెడుతోంది. శాశ్వత ఉద్యాన పంటలకు ఇది సాధారణ పంట నష్టం కాదు. సంవత్సరాల పాటు పెంచిన చెట్టు ఎండిపోతే రైతు పెట్టుబడితో పాటు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా కోల్పోతాడు. అందువల్ల ఎండిపోయే దశలో ఉన్న తోటలను గుర్తించి అత్యవసరంగా నీటిని అందించాల్సిన అవసరం ఉంది. వర్షాలు తగ్గడంతో రాయలసీమలో రైతులు బోర్లపై ఆధారపడుతున్నారు. నీటిమట్టాలు లోతుకు పడిపోవడంతో పంటలకు అవసరమైన నీటిని అందించడం రైతులకు కష్టంగా మారుతోంది.ఒక బోరు ఎండిపోతే మరో బోరు వేయాల్సి వస్తోంది. బోరు తవ్వకం, మోటారు, పైపుల కోసం అదనపు ఖర్చు చేయాల్సి రావడంతో రైతులపై అప్పుల భారం పెరుగుతోంది. కొత్త బోరు విఫలమైతే పెట్టిన పెట్టుబడి నష్టమవుతోంది.
పశుగ్రాస సంక్షోభం.. పశువులను కాపాడేందుకు సబ్సిడీపై దాణా ఇవ్వాలి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పచ్చి మేత కొరత ఏర్పడి పశువుల పోషణ రైతులకు భారంగా మారుతుంది. కరువు కాటకాలు వచ్చినప్పుడు మేత లేక రైతులు తమ పశువులను అతి తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దీంతో పశువులపై పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు అప్పులపాలవుతున్నారు. పశువులను కోల్పోవడంతో కుటుంబానికి వచ్చే రోజువారీ ఆదాయానికి గండి పడుతుంది. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తీవ్ర వరüలోటు ఉన్న మండలాల్లో సబ్సిడీపై పశుదాణా, ఎండుగడ్డి, పచ్చిమేతను అందించాలి. పశువుల సంఖ్యను అంచనా వేసి దాణా నిల్వలు ఏర్పాటు చేయాలి.
అవసరమైన ప్రాంతాల్లో పశుగ్రాస బ్యాంకులు, సైలేజ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.కరువు ముదిరిన తర్వాత స్పందించడం కాదు.. పశుగ్రాస కొరత ఏర్పడే పరిస్థితులనే ముందుగానే నివారించాలి. వర్షాభావం వల్ల వ్యవసాయ పనులు తగ్గి రైతులతో పాటు వ్యవసాయ కూలీల ఆదాయంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. పంటలు లేకపోతే కూలి పనులు తగ్గుతాయి. ఆదాయం లేక కుటుంబాలను పోషించుకోవడం కష్టమై గ్రామాల నుంచి పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు, వ్యవసాయ కార్మికుల వలసలను ఆపేందుకు కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు, వ్యవసాయ కూలీలకు కరువు పెన్షన్ లేదా ప్రత్యేక జీవన భృతి అందించాలి. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలను పెంచి కుటుంబాలకు కనీస ఆదాయ భద్రత కల్పించాలి. రాయలసీమను కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలి ప్రస్తుత వర్షపాతం లోటు, ఖరీఫ్ సాగుపై ప్రభావం, ఉద్యాన తోటల పరిస్థితి, పశుగ్రాస కొరత, భూగర్భ జలాల పరిస్థితి, వ్యవసాయ కూలీల ఉపాధి సంక్షోభాన్ని సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని రాయలసీమలో తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలు, మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించాలి. కరువు ప్రకటన కేవలం ఉత్తర్వుగా మిగలకుండా రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, ఉద్యాన రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలి.
ప్రభుత్వం ముందున్న అత్యవసర డిమాండ్లు : రాయలసీమలో తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలు, మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించాలి. తీవ్ర వర్షాభావంతో సాగు చేయలేకపోయిన రైతులకు కరువు సహాయం, పంట నష్టపరిహారం అందించాలి. వేరుశెనగ, కంది, పెసర, మినుము తదితర పంటల సాగు నష్టాన్ని అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ, పరిహారం ఇవ్వాలి. మామిడి, చీనీ తదితర ఉద్యాన పంటలకు ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలి. జిరామ్‌జీ కింద ఎండిపోతున్న మామిడి, చీనీ తదితర ఉద్యాన తోటలకు అత్యవసర నీటి సరఫరా కల్పించాలి.ఎండిపోయిన, ఎండిపోయే దశలో ఉన్న శాశ్వత తోటలను గుర్తించి ప్రత్యేక నష్టపరిహారం, రక్షణాత్మక నీటిపారుదల అందించాలి.తీవ్ర వరüలోటు ఉన్న మండలాల్లో సబ్సిడీపై పశుదాణా, ఎండుగడ్డి, పచ్చిమేత అందించాలి. రైతులు, వ్యవసాయ కూలీలకు కరువు పెన్షన్ / ప్రత్యేక జీవన భృతి అందించాలి. రైతులు, వ్యవసాయ కార్మికుల వలసలను అరికట్టేందుకు గ్రామాల్లోనే ఉపాధి, ఆదాయ భద్రత కల్పించాలి. రైతుల పంట రుణాలను పునర్వ్యవస్థీకరించి వడ్డీ భారాన్ని తగ్గించాలి. కౌలు రైతులను కూడా కరువు సహాయ ప్యాకేజీలో చేర్చాలి.తాగునీటి ప్రమాద గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు, పెర్కొలేషన్ ట్యాంకులను పునరుద్ధరించాలి. ప్రతి గ్రామానికి నీటి బడ్జెట్ రూపొందించి భూగర్భజలాల రీచార్జ్ పనులను వేగవంతం చేయాలి. ప్రభుత్వం ఇక వెంటనే కార్యాచరణలోకి రావాలి రాయలసీమలో పరిస్థితి ఇక గణాంకాల చర్చగా మిగలకూడదు. వరüలోటు, ఎండ తీవ్రత, వేరుశెనగ-పప్పుధాన్యాల సాగు దెబ్బతినడం, ఎండిపోతున్న ఉద్యాన తోటలు, అడుగంటుతున్న భూగర్భజలాలు, పశుగ్రాస కొరత, వ్యవసాయ కూలీలకు తగ్గుతున్న ఉపాధి-ఇవన్నీ పరస్పరం ముడిపడిన సంక్షోభాలు. వర్షం కోసం ఎదురుచూస్తూ కాలం గడపకుండా ప్రభుత్వం ఇప్పుడే క్షేత్రస్థాయిలోకి దిగాలి. జిల్లా, మండలాల వారీగా వాస్తవ పరిస్థితిని అంచనా వేసి రైతులు, పశుపోషకులు, ఉద్యాన రైతులు, వ్యవసాయ కూలీలకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలి. రైతు మరో బోరు కోసం అప్పు చేయకముందే… మరో పశువును తక్కువ ధరకు అమ్ముకోకముందే… మరో మామిడి, చీనీ చెట్టు ఎండిపోకముందే… మరో రైతు, వ్యవసాయ కూలీ వలస వెళ్లకముందే ప్రభుత్వం కార్యాచరణలోకి రావాలి. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే కరువు కోసం చేసే సిద్ధత కాదు… ఇప్పటికే రైతు ఇంటి గడపకు చేరిన సంక్షోభానికి ఇవ్వాల్సిన తక్షణ స్పందన ఇది.
సెల్ : 9493758949

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు