Tuesday, December 10, 2024
Homeఆంధ్రప్రదేశ్అత్యాచారాలపై మాటలయుద్ధం

అత్యాచారాలపై మాటలయుద్ధం

. పరస్పర విమర్శలతో హోరెత్తిన మండలి
. వైసీపీ సభ్యులపై హోంమంత్రి ఆగ్రహం
. మంత్రి తీరుకు నిరసనగా వైసీపీ వాకౌట్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై సాగుతున్న అత్యాచారాలు, హత్యల అంశంపై శాసనమండలి దద్దరిల్లింది. మండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పరస్పర విమర్శల దాడికి దిగారు. మంత్రులు జవాబులిచ్చే సమయంలో వైసీపీ సభ్యులు అడ్డు తగులుతూ… ఉప ప్రశ్నలు వేశారు. అలాగే వైసీపీ సభ్యులు మాట్లాడుతున్న ప్పుడు కూటమి సభ్యులు అడ్డుతగిలారు. హోంమంత్రి అడిగిన ప్రశ్నలకు సమా ధానాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారని వైసీపీ అభ్యంతరం తెలిపింది. తొలుత మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు అంశంపై వైసీపీ సభ్యులు వరుదు కల్యాణి, టి.కల్పలత, చంద్రగిరి ఏసురత్నం ప్రశ్నలు అడిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, మహిళలు, ఆడ బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దిశ చట్టాన్ని, యాప్‌ను నిర్వీర్యం చేయడంపై ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యత: హోంమంత్రి అనిత
ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ హయాంలో క్రైమ్‌ రేటు తగ్గిందని, అత్యాచార ఘటన లను రాజకీయ చేయొద్దని సూచించారు. నిర్భయ చట్టాన్ని పక్కన పెట్టి గత ప్రభు త్వంలో దిశ చట్టం తెచ్చారని, మహిళలపై అత్యాచారాలు జరిగినా పట్టించుకోలేదని, ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టిందన్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారని, అసలు దిశ చట్టం ఉందా.? గంజాయిపై ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా ?, అంటూ వైసీపీ సభ్యులను ప్రశ్నించారు. జగన్‌ తల్లి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా ఉంటామని ఆమె వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా వైసీపీ సభ్యులు తమ సీట్లలో నుంచి లేచి…నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, బాధ్యతాయుత హోంమంత్రి అనిత సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు హోం మంత్రి స్పష్టంగా సమాధానం ఇవ్వని కారణంగా… ఆ ప్రశ్న వరకు సభ్యులు వాకౌట్‌ చేశారు. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ మంత్రి మాటలను బొత్స వక్రీకరించారన్నారు. అనంతరం కర్నూలుజిల్లాలో కృష్ణానదిపై వంతెన నిర్మాణ అంశంపై సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తిరుమల నాయుడు అడిగిన ప్రశ్నలకు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లేదని బదులిచ్చారు. అంగన్‌వాడీ భవనాలు, బాలల సంజీవని పథకం అంశాలపై సభ్యులు వంకా రవీంద్రకుమార్‌, టి.కల్పలత అడిగిన ప్రశ్నలకు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,977 అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని, జనవరి, 2024 నుంచి ఇప్పటి వరకు రూ.32.64 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మూత్రశాలలు లేకుండా 2,941 అద్దె భవనాలున్నాయని, సాధ్యమైన చోట్ల మరుగు దొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని, అన్ని వసతులున్న వేరే భవనాలకు వాటిని మార్చుతున్నట్లు వివరించారు. గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గృహ విద్యుత్‌ వినియోదారులపై అదనపు భారం అంశంపై సభ్యులు దువ్వారపు రామారావు, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ వివరణ ఇచ్చారు. 2019` 2024 మధ్య కాలంలో గృహ వినియోగదారులపై టారిఫ్‌ నిమిత్తం మొత్తం రూ.1769.92 కోట్ల అదనపు భారం ఉందని, దాంతోపాటు ట్రూ ఆప్‌ ఎఫ్‌పీసీఏ చార్జీల నిమిత్తం రూ.5,851.82 కోట్లను విధించారన్నారు. ఇమామ్‌, మౌజమ్‌లకు గౌరవ వేతనంపై సభ్యులు ఇసాక్‌ బాషా, మహ్మద్‌ రుహుల్లా అడిగిన ప్రశ్నలకు మైనార్టీశాఖ మంత్రి ఫరూక్‌ అబ్దులా సమాధానమిస్తూ, ఇమామ్‌, మౌజమ్‌ లకు గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉందన్నారు. కాగా వైసీపీ సభ్యులు తమ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని నిరసనకు దిగారు. దీంతో రాత పూర్వకంగా పంపాలని మంత్రికి చైర్మన్‌ సూచించారు. జాబ్‌ క్యాలెండర్‌, కార్పొరేషన్లు, ప్రభుత్వ శాఖల నుండి నిధుల మళ్లింపు, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాలు, రాష్ట్రంలో వయోజన విద్యా కేంద్రాలు అనే నాలుగు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పినట్లుగా శాసన మండలి చైర్మన్‌ ప్రకటించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన అనేక బిల్లులను మండలి ఆమోదించినట్లు వెల్లడిరచారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సవరణ బిల్లు, ఏపీ విద్యుత్‌ రెండో సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ తాత్కాలిక బిల్లులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం శాసనమండలిని మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు