Thursday, December 5, 2024
Homeఆంధ్రప్రదేశ్అది మైనారిటీ విద్యాసంస్థ

అది మైనారిటీ విద్యాసంస్థ

అలీగఢ్‌ ముస్లిం వర్సిటీపై 4`3 మెజారిటీతో
సుప్రీంకోర్టు అభిప్రాయం

న్యూదిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మైనారిటీ హోదాపై కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏఎంయూకు మైనార్టీ హోదా వర్తిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్‌, దీపాంకర్‌ దత్తా, ఎస్‌సీ శర్మ, సంజీవ్‌ ఖన్నా, జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం 4-3 మెజారిటీతో ఉత్తర్వులు జారీచేసింది. రాజ్యాంగంలోని అధికరణ 30 కింద మతపరమైన, భాషాపరమైన మైనారిటీల సాధికారత కోసం విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతి ఉన్నట్లు కోర్టు తెలిపింది. దీని ప్రకారమే ఏఎంయూకు మైనారిటీ హోదా వర్తిస్తుందని తేల్చింది. ఇదే వ్యవహారంలో 1967 నాటి తీర్పును కొట్టివేసింది. ఎనిమిది రోజుల పాటు సాగిన వాదనల అనంతరం ఈ కేసులో తీర్పును ఫిబ్రవరి 1న సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌ చివరి పనిదినాన దీనిపై తీర్పు ఇచ్చింది. ‘1875లో మహమ్మదన్‌ ఆంగ్లో-ఓరియంటల్‌ కాలేజీగా ఏర్పాటైన విద్యాసంస్థ… 1920లో బ్రిటిష్‌ పాలనలో అలీగఢ్‌ యూనివర్సిటీ అయింది. దానిని మైనారిటీలు ఏర్పాటు చేయలేదని చెప్పలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఏఎంయూ సవరణ చట్టం1981 మైనారిటీ హోదాను కల్పించిందని పేర్కొంది. మైనారిటీ విద్యాసంస్థల్లో లౌకిక విద్యకు అవకాశమున్నట్లు తెలిపింది. ఇలాంటి వ్యవస్థల లక్షణాలను ఉల్లంఘించనంత వరకు మైనారిటీ విద్యావ్యవస్థలను ప్రభుత్వం నియంత్రించవచ్చని కోర్టు అభిప్రాయపడిరది. తాజా తీర్పు 43 మెజారిటీతో వెలువడగా విభేదించిన న్యాయమూర్తుల్లో జస్టిస్‌ దత్తా ఉన్నారు. ఏఎంయూ మైనారిటీ విద్యావ్యవస్థ కాదన్నారు. కాగా, మైనారిటీలకు సేవ చేసే సంస్థల నియంత్రణ మైనారిటీ వర్గమే చూసుకోవాలని జస్టిస్‌ శర్మ అన్నారు. లౌకిక విద్యకూ విద్యార్థులకు అవకాశం ఉండాలని చెప్పారు.
పూర్వాపరాలు
మతపరమైన, భాషాపరమైన మైనారిటీ సాధికారత కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు మైనారిటీలకు అధికారాన్ని రాజ్యాంగంలోని అధికరణ 30 ఇస్తుంది. దీని ఆధారంగానే ఏఎంయూకు మైనారిటీ హోదా వర్తిస్తుంది. 1875లో అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీని ఆంగ్లో-ఓరియంటల్‌ కాలేజీగా స్థాపించారు. ఇంపీరియల్‌ (సామ్రాజ్యవాద) చట్టం ద్వారా 1920లో విశ్వవిద్యాలయం చేశారు. అయితే ఈ చట్టాన్ని 1951లో సవరించారు. తద్వారా ముస్లిం విద్యార్థులకు తప్పనిసరి చేసిన మతపరమైన సూచనలు రద్దు అయ్యాయి. 1981లో రెండవ సవరణను ప్రతిపాదించారు. 1951కు ముందున్న స్థితిని పునరుద్ధరించాలని ఆ సవరణ ప్రతిపాదించగా, ఆ పని మనస్ఫూర్తిగా జరగలేదని సీజేఐ అన్నారు. ఈ సవరణ సగం పని మాత్రమే చేసిందని చెప్పారు. కాగా, కేంద్ర వర్సిటీగా ఉన్న ఏఎంయూ… మైనారిటీ విద్యావ్యస్థ కాదని 1967లో ఎస్‌ అజీజ్‌ పాషా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇదిలావుంటే ఫిబ్రవరిలో వాదనలు జరిగినప్పుడు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తదితరులు ఏఎంయూకు వచ్చే నిధుల గురించి ప్రస్తావించారు.
2019`2023 మధ్య కాలంలో రూ.5వేల కోట్లకుపైగా నిధులను కేంద్రప్రభుత్వం నుంచి పొందినందునే మైనారిటీ స్వభావాన్ని ఏఎంయూ విడనాడిరదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏఎంయూ మైనారిటీ విద్యాసంస్థ కాదంటూ 1981లో జరిగిన సవరణను 2006లో అహ్మదాబాద్‌ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 2006లో ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాల్‌ చేసింది. ఇదే తీర్పుపై వేరుగా యూనివర్సిటీ పిటిషన్‌ వేసింది. నాటి సీజేఐ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వ త్రిసభ్య ధర్మాసనం దీనిని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది. తాజా విచారణ క్రమంలో ఏఎంయూకు మైనారిటీ హోదా వర్తిస్తుందంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు