హైదరాబాద్: అపోలో హాస్పిటల్స్ అరుదైన రికార్డు సృష్టించింది. 24 రోజుల్లో 25 క్లిష్టమైన స్లీప్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సలు చేసింది. ఒకే రోజు రెండు శస్త్రచికిత్సలు చేయడం ప్రపంచంలోనే అరుదైన ఘనతగా చెప్పవచ్చు. అది కూడా 24 గంటలలో డిశ్చార్జితో. డాక్టర్ ధనుంజయరావు గింజుపల్లి ఆధ్వర్యంలో ఈ రికార్డు స్థాయి శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని అపోలో మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ మూమెంట్ డిసార్డర్స్ వంటి పార్కిన్సన్స్ వ్యాధి, ఎసెంషియల్ ట్రెమర్స్, డిస్టోనియా లాంటి వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో ఈ వ్యాధుల సంఖ్య అధికంగా ఉన్నాయన్నారు. పార్కిన్సన్స్ వ్యాధి దేశంలో పది లక్షల మందికి పైగా ప్రభావితం చేస్తుందన్నారు. ఇది భారతదేశాన్ని న్యూరాలజికల్ వ్యాధుల ప్రధాన కేంద్రంగా మార్చుతుందని చెప్పారు. దీనిని నివారించేందుకు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ ఫాస్ట్ ట్రాక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్సను ప్రవేశపెట్టిందని తెలిపారు.