పది ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత
. 1680 పాఠశాలల్లో నూరు శాతం బ 19 నుంచి సప్లిమెంటరీ
. కాకినాడకు చెందిన నేహాంజనికి 600/600
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 4,98,585 మంది ఉత్తీర్ణులైనట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌వేదికగా వెల్లడిరచారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మార్చి 17 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. మూడోతేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా తొమ్మిదో తేదీతో ముగిసింది. కేవలం ఏడు రోజుల్లోనే పదో తరగతి పబ్లిక్ పరీక్ష మూల్యాంకనం ముగించి త్వరితగతిన ఫలితాల్ని విడుదల చేశారు. 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమంగా నిలవగా… అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలికల్లో 84.09 శాతం, బాలురలో 78.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. 1,680 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే అతి తక్కువుగా 47.64శాతం నమోదైంది. కాకినాడకు చెందిన నేహాంజనికి 600/600 మార్కులు వచ్చాయి. ఈమె భాష్యం పాఠశాలలో చదువుతోంది. ఎలమంచిలి చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత 599 మార్కులు సాధించింది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ విద్యార్థులు ఫలితాల్ని అందుబాటులో ఉంచారు. మన మిత్ర వాట్సప్ నంబర్ 9552300009కు ‘హి’ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ఎంచుకున్న తర్వాత పదో తరగతి పరీక్షల ఫలితాల ఆప్షన్ వస్తుంది. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు, ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో క్షణాల్లో పొందుతారు. కొందరు విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే, అలాంటి వారు రీకౌంటిగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని మార్కులు పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మే 19 నుంచి 28 వరకు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు నిర్వహించనున్నారు.