. పార్లమెంటును ముట్టడిరచిన ఆందోళనకారులు
. భద్రతాబలగాల కాల్పుల్లో 20 మంది మృతి
కాట్మండు: నేపాల్‌లో ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలపై, ఇటీవల వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి కీలక సామాజిక మాధ్యమా లపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మ కంగా మారింది. వేలాది మంది యువత రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాట్మండులో జరిగిన ఘర్షణల్లో 20 మంది మృతి చెందారు. 300 మంది వరకూ గాయపడ్డారు. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా పార్లమెంటు వెలుపల జనరేషన్` జెడ్ ఆందోళనకారులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులు పార్లమెంటు గేటును ధ్వంసం చేయడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. జలఫిరంగులను ప్రయోగించారు. భాష్ప వాయువుని వదిలారు. రబ్బరు బుల్లెట్లను ప్రయోగిం చారు. దీంతో చాలామంది గాయాలపాలయ్యారు. 20 మంది మృతి చెందారని ప్రముఖ మీడియా కాట్మండు పోస్టు తెలిపింది. ఏకంగా నేపాల్ పార్లమెంటు ఆవరణలోకి చొచ్చుకువచ్చిన ఆందోళనకారులు దాడులకు పాల్పడటంతో భద్రతా సిబ్బంది తమను తాము కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. వేలాది మంది ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఇనుపరాడ్లు, సీసాలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. నిరసనకారుల దాడుల్లో అనేకమంది భద్రతాసిబ్బంది గాయపడ్డారు. వారి షీల్డ్‌లు విరిగిపోయాయి. భద్రతా బలగాలు ప్రయోగించిన భాష్పవాయు గోళాలను నిరసనకారులు తిరిగి వారిపైనే ప్రయోగించారు. తీవ్ర ప్రతిఘటనతో తమను తాము రక్షించుకునేందుకు భద్రతా బలగాలే అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
ఉపాధి దెబ్బతింది: ఆందోళనకారుల ఆగ్రహం
ఒకేసారి భారీ స్థాయిలో సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల ఉపాధి దెబ్బతిందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై ఆధారపడ్డ యూట్యూబర్లు, వ్లాగర్లు, బ్లాగర్లు ఇలా అందరి ఉపాధి నాశనమవుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.
నేపాలీ కళాకారులు, నటులు, సంగీతకారుల మద్దతు
నిర్దిష్ట గడువు లోగా కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కాలేదంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, లింక్డిన్ వంటి సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగస్టు 28 నుంచి ఏడు రోజుల్లోగా రిజిస్టర్ కావాల్సి ఉంది. టిక్‌టాక్, వైబర్, విట్క్, నింబజ్, పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ జరుగుతోంది. కాగా కీలకమైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్‌లకు దూరమవడంతో నేపాల్ యువత రోడ్డెక్కింది. నేపాలీ కళాకారులు, నటులు, సంగీత కారులు నిరసనలకు మద్దతు పలకడంతో అది తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకరమనీ, రాజ్యాంగం భరోసా ఇచ్చిన సమాచార హక్కును కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.
దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించం: ప్రధాని
మరోవైపు దేశంలో ఘర్షణలు ఉద్రిక్తంగా మారడంపై ప్రధాని కేపీ శర్మ ఒలి స్పందించారు. తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టంచేశారు. చట్టాలను ఉల్లంఘించి ఆ సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని, వాటిని సహించబోమని వివరించారు. సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోయినప్పటికీ దాని కన్నా దేశమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.


