ఈసీకి సుప్రీం ఆదేశం
న్యూదిల్లీ: బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఓటర్ల గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆధార్ వాస్తవికతను పరిశీలించిన తర్వాతనే ఓటరు నిర్ధరణకు వినియోగించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్ ద్వారా నిజమైన పౌరులను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని పేర్కొంది. నకిలీ పత్రాల ఆధారంగా నిజమైన పౌరులని చెప్పుకునే వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఓటర్ల ధ్రువీకరణకు ఆధార్‌ను అధికారులు ఎందుకు స్వీకరించట్లేదని గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ధర్మాసం ఆదేశించింది. బీహార్‌లో ఓటరు నిర్ధారణ కోసం ప్రస్తుతం 11 పత్రాలను పౌరులు సమర్పిస్తుండగా… ఆధార్‌ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలని ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అయితే ఆధార్ పౌరసత్వానికి మాత్రం ధ్రువీకరణ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమ వలసదారుల సమస్య దృష్ట్యా, అవసరమైన వేళ ఎన్నికల కమిషన్ సదరు ఆధార్ సరైనదేనా అనేది తనిఖీ చేయవచ్చని వెల్లడిరచింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), ఏఐఎంఐఎం (ఏఐఎంఐఎం) ఇతర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషన్ల వాదనలు విన్న తరువాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో చేర్చడానికి లేదా తొలగించడానికి ఆధార్ కార్డును కూడా కమిషన్ ప్రకటించిన ధ్రువీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా పరిగణించాలని పేర్కొంది. ఇది 1950 నాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా తీసుకొన్న నిర్ణయమని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ జాబితాలో పాస్‌పోర్టు, బర్త్ సర్టిఫికెట్ వంటి 11 పత్రాలను ఐడీ ప్రూఫ్‌లుగా ఎలక్షన్ కమిషన్ స్వీకరిస్తోంది. కనుక తమ ఆదేశాలు ప్రజలకు తెలిసేలా ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్‌లో ఆధార్ ధ్రువీకరణ పత్రం ఆమోదయోగ్యమే అని తెలుపుతూ నోటీసులు ప్రదర్శించాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతకు ముందు ఎలక్షన్ కమిషన్ తరఫున రాకేష్ ద్వివేది తన వాదనలు వినిపిస్తూ ఈసీ ఆధార్‌ను ప్రూఫ్‌గా స్వీకరించడానికి అంగీకరించినా, పిటిషనర్లు దానిని 12వ గుర్తింపు పత్రంగా చేర్చమని కోరడం దేనికని ప్రశ్నించారు. పౌరసత్వ ధ్రువీకరణ విషయంలో పాస్‌పోర్టుకు ఉన్న విలువ ఆధార్‌కు లేదని ఆయన చెప్పారు. అలాంటప్పుడు దానిని ఆ జాబితాలో ఎలా చేరుస్తామని అన్నారు. విచారణ సందర్భంగా ఆర్జేడీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఆధార్‌ను ఉద్దేశ పూర్వకంగానే ఎన్నికల సంఘం మినహాయిస్తోందని, 11 నోటిఫైడ్ డాక్యుమెంట్లను మినహా వేటినీ రిజస్ట్రేషన్ ఆఫీసర్లు అంగీకరించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆధార్ వంటి యూనివర్సల్ డాక్యుమెంట్‌ను నిరాకరిస్తే ఇంక్ల్యూజివ్ ఎక్సర్‌సైజ్ అనే మాటకు అర్థం ఉండదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ… కేవలం ‘ఆధార్’ ఆధారంగానే ఓటర్ స్థాయిని నిర్ధారించాలని పిటిషన్ల అభిప్రాయమా అని ప్రశ్నించారు. దీనికి సిబల్ సమాధానమిస్తూ, తాను 2025 ఎన్నికల జాబితాలో ఉన్నానని, ఇంక ప్రూవ్ చేసుకోవడం అనే ప్రశ్న ఎలా తలెత్తుందని అన్నారు. బీఎల్‌ఓలు తన పౌరసత్వాన్ని నిర్ధారించలేరని పేర్కొన్నారు. ఈసీ కోర్టులో చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో అధికా రులకు ఇస్తున్న ఆదేశాలకు మధ్య తేడా కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడిరది. తాము ఆదేశాలిచ్చిన ప్పటికీ ఆధార్ అక్కరలేకుండా 11 డాక్యుమెంట్లనే ఎందుకు కాపీలో ప్రస్తావిస్తున్నారని నిలదీసింది. దానికి ఎన్నికలసంఘం తరఫు న్యాయవాది రాకేష్ ద్వివేదీ సమాధానమిస్తూ… ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో చూస్తానని, ఆధార్ అంగీకరించాలని కోర్టు ఇచ్చిన గత ఆదేశాలను ఎన్నికల సంఘం ప్రచురించిందని తెలిపారు.


