Monday, December 23, 2024
Homeఇంత జాప్యమా?

ఇంత జాప్యమా?

. ఆలస్యంగా బి.ఫార్మసీ షెడ్యూలు
. పక్క రాష్ట్రాలకు విద్యార్థుల పరుగు
. అధికారుల తీరుపై విమర్శలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఫలితాలు వచ్చిన ఆర్నెళ్లకు బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. ఈ జాప్యానికి కారకులె వరనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. నెలల తరబడి కౌన్సెలింగ్‌కు షెడ్యూలు విడుదల కాకపోవడంతో రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. కేవలం బి.ఫార్మసీనే కాదు. ప్రతి విద్యా సంవత్సరం ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లోనూ అదే తంతు కొనసా గుతోంది. బి.ఫార్మసీ కన్నా ఇంజినీరింగ్‌ ప్రవేశాలు కొంతమేరకు ముందు ముగిశాయి. ఏపీ ఈఏపీసెట్‌2024లో భాగంగా ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో బి.ఫార్మసీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ ప్రవేశాలు పూర్తయినప్పటికీ, బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌కు షెడ్యూలు ఆలస్యంగా విడుదలైంది. విద్యా సంవత్సరం నష్టపోకుండా సకాలంలో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు పదేపదే విన్నవించినప్పటికీ స్పందించలేదు. రాష్ట్రంలో మొత్తం 177 కళాశాలలు ఫార్మా కోర్సులను అందిస్తున్నాయి. ఇందులో 39 ప్రభుత్వ కళాశాలల్లో బి.ఫార్మాకు 1520 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మే 23న ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు జరగ్గా… జూన్‌ 11న ఫలితాలు ప్రకటించారు. వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశపరీక్షలకు 80,766 హాజరుకాగా… 70,352 మంది అర్హత సాధించారు. దాదాపు ఆరు నెలల తర్వాత బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించ డంతో విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగింది. మిగిలిన రాష్ట్రాల్లో ముందస్తుగా కౌన్సెలింగ్‌ ప్రారంభం కావడంతో వేలాదిమంది ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. కౌన్సెలింగ్‌ ఆలస్యానికి గల కారణాలను మంత్రి నారా లోకేశ్‌ గుర్తించి… బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫీజు చెల్లింపునకు రెండు రోజుల గడువు
బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌ జాప్యాన్ని ప్రభుత్వ యంత్రాంగం విద్యార్థులపై నెట్టడానికి చూస్తోంది. కౌన్సెలింగ్‌ షెడ్యూలు జారీజేసిన వెంటనే ఎంపీసీ విద్యార్థులకు ఈనెల 29, 30 తేదీల్లో రెండు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం విమర్శలకు దారితీస్తోంది. ఆప్షన్ల నమోదుకు కేవలం మూడు రోజులే సమయం ఇచ్చారు. బైపీసీ విద్యార్థుల ఫీజు చెల్లింపునకు మాత్రం డిసెంబరు 30 నుంచి 5 వరకు గడువు విధించారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. ఫీజు చెల్లింపునకు మరింత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. జూన్‌ 11వ తేదీన ఏపీఈఏపీసెట్‌ ఫలితాలు వెల్లడికాగా, బి.ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ డిసెంబరు 12వ తేదీతో ముగియనుంది. దీంతో విద్యార్థులు దాదాపు సగం విద్యా సంవత్సరం కోల్పోనున్నారు. ఏడాదికి రెండు సెమిష్టర్ల విధానంతో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదే ఈఏపీసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశాలు పొందిన వారికి డిసెంబరు నుంచి జనవరి వరకు మొదటి సెమిష్టర్‌ పరీక్షలకు ప్రణాళిక రూపొందించారు. బి.ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యే నాటికే డిసెంబరు కానుంది. ఈ క్రమంలో వారికి మొదటి, రెండు సెమిష్టర్‌ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేదీ ప్రశ్నార్థకంగా మారింది.
బి.ఫార్మసీ కౌన్సెలింగ్‌ ఇలా…
ఎంపీసీ విద్యార్థులకు శుక్రవారం నుంచి 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఈనెల 29 నుంచి డిసెంబరు 1వరకు పరిశీలిస్తారు. ఆప్షన్ల నమోదుకుగాను ఈనెల 29 నుంచి 1 వరకు ఇస్తారు. ఆప్షన్ల మార్పునకు డిసెంబరు 2వ తేదీన అవకాశం కల్పించి… 4వ తేదీన సీట్లు ఖరారు చేస్తారు. 46 తేదీల మధ్య వ్యక్తిగత నివేదికకు షెడ్యూలు విధించారు. 5 నుంచి తరగతుల ప్రారంభమవుతాయి. బైపీసీ విభాగంలో ఈనెల 30 నుంచి డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లింపునకు గడువు విధించారు. డిసెంబరు 2 నుంచి 6 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 3 నుంచి 7వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు ఉంటుంది. 8వ తేదీన ఆప్షన్ల మార్పు, 11న సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. విద్యార్థులు వ్యక్తిగత నివేదికను 1114 తేదీల మధ్య ఆయా కళాశాలల్లో చేయాలి. 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు