. ‘మున్సిపల’ తొలి సమరం మిర్యాలగూడ నుంచే…
. రెండేళ్లలో ఎసఎల్‌బీసీ పూర్తి చేస్తాం: రేవంత్
విశాలాంధ్ర – నల్లగొండ బ్యూరో: త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్‌లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు పేదలకు మంజూరు చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ మండలం గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 100 నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తొలి సమరం మిర్యాలగూడ నుంచే ప్రారంభమైందని సీఎం ప్రకటించారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం పేదలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, యువత కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ కార్డులు ఇచ్చి, మూడు కోట్ల 15 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వ్యవసాయానికి ఉచిత కరెంట్ అందిస్తున్నామని, దీని వల్ల 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కింద 25 లక్షల 30 వేల మంది రైతులకు రూ.21 వేల కోట్లు ఇచ్చామని, రైతు భరోసా కింద ఒకేరోజు రూ.తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో విడత రైతు భరోసా నిధులు అందిస్తామని ప్రకటించారు. దేశంలోనే రైతుల సంక్షేమానికి రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, స్వయం సహాయక సంఘాల మహిళలను 1000 బస్సుల యజమానులుగా చేశామని పేర్కొన్నారు. మహిళలకు జీరో వడ్డీపై రూ.27 వేల కోట్ల రుణాలు ఇప్పించామని వెల్లడించారు. తమ ప్రభుత్వం తొలి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. ఏప్రిల్ బడ్జెట్‌లో లక్షలాది ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను, రెండు సంవత్సరాల్లో ఎసఎల్‌బీసీని పూర్తిచేస్తామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రూ.17,472 కోట్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.2,028 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తొలుత రూ.200 కోట్ల వ్యయంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, వేముల వీరేశం, పద్మావతి రెడ్డి, వంశీకృష్ణ, జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.


