Homeఈసీలో విభేదాలు

ఈసీలో విభేదాలు

- Advertisement -

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు

  • కీలక నిర్ణయాలపై 14 సార్లు ఇద్దరు కమిషనర్‌ల అభ్యంతరాలు
  • ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంచలన నివేదిక
  • 13 కోట్లకుపైగా ఓటర్ల తొలగింపుపై రాజకీయ దుమారం
  • ఈసీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుమ్మక్కు
  • జ్ఞానేశ్కుమార్ అరెస్టుకు ప్రతిపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న అంశం రాజకీ యంగా తీవ్ర చర్చకు దారితీసింది. తమకు సమాచారం లేదా అనుమతి లేకుండానే ఎన్నికల సంఘం పేరుతో ఏకపక్షంగా నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల కమిషనర్‌లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పరిశోధనాత్మక కథనం వెల్లడించడం కలకలం రేపింది. ఓటర్లను చేర్చడం, తొలగించడం, కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో మార్పులు, ఓటర్ల జాబితా డేటా, సాఫ్ట్‌వేర్‌ను కేంద్రీకృతం చేయ డంపై ఇద్దరు కమిషనర్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. ఒకే రోజున నాలుగు సార్లు అభ్యంతరాలు నమోదు చేసిన సందర్భం కూడా ఉందని తెలిపింది. 2025 జూన్‌లో బీహార్‌లో ప్రారంభమైన ఎస్‌ఐఆర్ ప్రక్రియను తరువాత 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించారు. ఈ ప్రక్రియ లో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్లకుపైగా పేర్లు తొలగించబడినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తెలిపింది. దీంతో ఓటర్ల జాబితాల సవరణ విధానంపై రాజకీయ, న్యాయపరమైన చర్చ తీవ్రతరమైంది.
ఫారం-6 మార్పుపై అభ్యంతరం
కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ప్రశ్నను చేర్చడంపైనా ఇద్దరు కమిషనర్‌లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది. కొత్త ఓటరు లేదా వారి తల్లిదండ్రులు, తాతయ్య-అమ్మమ్మల పేర్లు గత ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాలో ఉన్నాయా అనే వివరాలను అడిగేలా మార్పు చేసినట్లు తెలిపింది. ఈ మార్పు చట్టబద్ధ విధానంలో చేయాలంటే సంబంధిత నిబంధనలను సవరించాల్సి ఉంటుందని వివేక్ జోషి మేలో అభిప్రాయపడగా, సుఖ్బీర్ సింగ్ సంధు కూడా దానితో ఏకీభవించినట్లు నివేదిక పేర్కొంది. ఎన్నికల జాబితాలకు సంబంధించిన ఐటీ వ్యవస్థల పనుల కేటాయింపులో మార్పులపై కూడా సంధు, జోషి కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ను ఆశ్రయించినట్లు కథనం వెల్లడించింది. ఈ మార్పులతో ఓటర్ల జాబితాల సాంకేతిక వ్యవస్థపై ఉన్న పర్యవేక్షణలో ఒక స్థాయి తగ్గిందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఈసీ కుమ్మక్కు: రాహుల్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన నివేదికపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా ఈసీని అడ్డుపెట్టుకుని ఓటు చోరీ చేస్తూ… ఎన్నికల్లో గెలుస్తున్నారని ఆరోపించాయి. ఓటు చోరీ చేయడం రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడి చేయడమేనని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఎన్నికల సంఘం కుమ్మక్కై దేశద్రోహానికి పాల్పడ్డాయని విమర్శలు గుప్పించారు. బాధ్యులను ఉపేక్షించరాదని, దోషులకు శిక్షపడే రోజు ఎంతో దూరం లేదని ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశద్రోహానికి పాల్పడుతున్న ఎన్నికల అధికారులు తప్పించుకోలేరంటూ గతంలో హెచ్చరించిన వీడియోను రాహుల్ పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారించాలని కోరారు. ఎన్నిలక కమిషన్ సభ్యులు తమ విధుల్ని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించలేకపోతే అది ప్రజాస్వామ్యానికి ఆందోళనకర పరిణామమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈ నివేదిక ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రభావం చూపిందని అన్నారు. అదృశ్య హస్తం ఎన్నికల సంఘాన్ని నడుపుతోందని ఆరోపించారు. చట్టపరమైన విధానాలు పాటించకపోతే నిర్ణయాల చెల్లుబాటుపై ప్రశ్నలు తలెత్తుతాయని అన్నారు. ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన ప్రక్రియ కూడా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హరిస్తున్నారన్న ఆరోపణలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ఉన్నాయని, ఆయనకు ఆ బాధ్యతాయు తమైన పదవిలో కొనసాగేందుకు నైతిక అర్హత లేదని వ్యాఖ్యానించారు. సీఈసీని సస్పెండ్ చేయాలని ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం నడిపించిన వారిని వదిలి పెట్టరాదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయనన్నారు.
ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌కు బాధ్యతలు కట్టబెట్టారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఓటు హక్కును హరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్… ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు రక్షణ కల్పించే 2023 చట్టంపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ ప్రభావం ఉందని విమర్శించారు. టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సాగరికా ఘోష్ నివేదికను ప్రస్తావిస్తూ… ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ… ఎన్నిక సంఘం సాఫ్ట్‌వేర్ మార్పుల కారణంగా ఓటర్ల పేర్లు అన్యాయంగా తొలగించబడుతున్నాయని ఆరోపించారు. ఫారమ్-6లో మార్పులకు గెజిట్ నోటిఫికేషన్ లేదని, ఓటర్ల పేర్ల మార్పులు చేర్పుల ప్రక్రియలో అధికారాలు ప్రైవేట్ సంస్థలకు బదిలీ అయ్యాయని ఆరోపించారు. ‘జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల ప్రక్రియను బలహీనపరిచారని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. దాని ద్వారానే మోదీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఈ దారుణాలకు పాల్పడినందుకు జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఆయన నేతృత్వంలో జరిగిన దిల్లీ, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలి’ అని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ తొలగింపు ప్రక్రియను పార్లమెంట్ ప్రారంభించాలని సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ కోరారు. ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు