Sunday, December 29, 2024
Homeఉత్సాహం…ఉద్వేగం… శత వసంతం

ఉత్సాహం…ఉద్వేగం… శత వసంతం

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సీపీఐ శత వార్షికోత్సవాలు

. కదంతొక్కిన రెడ్‌షర్ట్‌ వలంటీర్లు
. అమరవీరులకు నివాళులు
. కష్టజీవుల రాజ్యస్థాపనే సీపీఐ లక్ష్యం: రామకృష్ణ

విశాలాంధ్ర-విజయవాడ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 99 ఏళ్లు పూర్తిచేసుకుని వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రక క్షణాన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనడంతోపాటు ఒకింత ఉద్వేగభరితులయ్యారు. విజయవాడ హనుమాన్‌పేటలోని సీపీఐ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌ వద్ద అరుణపతాకాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆవిష్కరించారు. రెడ్‌షర్ట్‌ వలంటీర్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఉన్న పార్టీ సీనియర్‌ నాయకులు చండ్ర రాజేశ్వరరావు విగ్రహం వద్ద జెండా ఎగురవేశారు. చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ శత వార్షికోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ది విజయవాడ టాక్సీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్వర్యంలో పార్టీ సీనియర్‌ నాయకులు కంచర్ల నాగేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయంత్రం సీపీఐ విజయవాడ నగర సమితి అధ్వర్యంలో లెనిన్‌ పార్కులో జరిగిన భారీ బహిరంగ సభలో రామకృష్ణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ 1925 డిసెంబరు 26వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారత దేశంలోని మేధావులు, విద్యావేత్తలు, లెనిన్‌, మార్క్స్‌ సిద్ధాంతాలపై విశ్వాసం ఉన్న వారు భారత కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీని మొగ్గలోనే తుంచేయాలనే కుట్రతో బ్రిటీష్‌ పాలకులు అక్రమకేసులు బనాయించి జైళ్లలో పెట్టారన్నారు. అయినా కోట్లాది కష్టజీవుల కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు. స్వాతంత్య్రానంతరం సంస్థానాల విలీనం కోసం పోరాటాలు చేసినట్లు చెప్పారు. తెలంగాణ సాయుధపోరాటంలో 4వేల మంది కమ్యూనిస్టు నాయకులు ప్రాణ త్యాగాలు చేశారని తద్వారా వేలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం సాధన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ చేపట్టిన పోరాటంలో భాగంగా 32 మంది ప్రాణాలు అమరులయ్యారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావటమనే దాంతో నిమిత్తం లేకుండా కష్టజీవుల రాజ్య స్థాపన లక్ష్యంగా ఎన్నేళ్లయినా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఏ వర్గం వారైన పోరాటంలోకి వస్తే వారికి అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని నొక్కి చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న పార్టీగా ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అందువల్ల వారికి మహాత్మాగాంధీ, జవర్‌లాల్‌ నెహ్రూ, బీఆర్‌ అంబేద్కర్‌ … అయన రాసిన రాజ్యాంగం అంటే గౌరవం లేదన్నారు. దిల్లీ సరిహద్దులో రైతులు ఉద్యమాలు చేస్తుంటే సమస్యను పరిష్కరించకుండా పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తు పార్లమెంటులో హోంమంత్రి అమిత్‌ షా అంబేద్కర్‌ను అవమానించారని చెప్పారు. అమిత్‌ షా రాజీనామా చేయాలని కోరుతూ ఈ నెల 30న వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు మర్చిపోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.15,486 కోట్లు భారం ప్రజలపై వేశారని ధ్వజమెత్తారు. సెకీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం అదాని వైపు ఉంటారా? ప్రజల వైపు ఉంటారా? తేల్చుకోవాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి నోరెత్తని చంద్రబాబు మిట్టల్‌ ఉక్కు గురించి మోదీతో మాట్లాడారని చెప్పారు. పోలవరం నిర్వాసితులకు తగిన న్యాయం చేయటానికి కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ అభివృద్ధిని కాంక్షించే అభ్యుదయ వాదులందరూ వెలుగులోకి వచ్చి కమ్యూనిస్టు పార్టీని స్థాపించటం ద్వారా దేశంలో సాంస్కృతిక మార్పు వచ్చిందన్నారు. పేదలు గౌరవప్రదంగా జీవించటానికి అవకాశం వచ్చిందన్నారు. నాటి పోరాట ఘట్టాలను వివరిస్తూ రావి నారాయణరెడ్డి పోరాటాన్ని గుర్తు చేశారు.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ కార్మికవర్గం హక్కుల కోసం చేస్తున్న ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు, తద్వారా జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్‌.కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్‌, సీనియర్‌ నాయకులు వై.చెంచయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, ఇన్సాఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌ అఫ్సర్‌, ప్రొఫెసర్‌ సి.నరసింహారావు, డాక్టర్‌ రాంప్రసాద్‌, డాక్టర్‌ సదానందం, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, వీధి విక్రయదారుల ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావుతో పాటు సీపీఐ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, కమ్యూనిస్టు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య, రాష్ట్ర నాయకులు ఎస్‌కే.నజీర్‌ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు