హైదరాబాద్: ప్రాణాంతకమైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో బాధపడుతున్న 23 ఏళ్ల మహిళకు హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స అందించింది. రోగి సాదియ (పేరు మార్చబడిరది) తీవ్రమైన కడుపు నొప్పి, ఊపిరి ఆడకపోవడం, తల తిరగడం, బలహీనతతో బాధపడుతున్న పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్య బృందం వెంటనే అవసరమైన పరీక్షలు నిర్వహించి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించడం తో పాటుగా ఆమె ప్రాణాలను కాపాడటానికి తక్షణ చర్య తీసుకుంది. భారతదేశంలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఈ తరహా గర్భాలు అంతర్గత రక్తస్రావం, ఫెలోపియన్ ట్యూబ్ చిట్లడం లేదా షాక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు, ముందుగానే గుర్తించకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదం కలిగే అవకాశాలు కూడా వున్నాయి. అధిక అంతర్గత రక్తస్రావం కారణంగా సాదియ పరిస్థితి విషమంగా మారిన నేపథ్యంలో ప్రసూతి, గైనకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ జ్యోతి కంకణాల నేతృత్వంలోని ఆసుపత్రి నిపుణుల బృందం, ప్రభావితమైన ఫెలోపియన్ ట్యూబ్‌ను తొలగించడానికి మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు.