Tuesday, March 4, 2025
Homeఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ముందంజ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ముందంజ

. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో ‘గాదె’ గెలుపు
. ఆధిక్యంలో ఆలపాటి
. కొనసాగుతున్న లెక్కింపు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తన పట్టు కొనసాగించింది. దాదాపు 12 జిల్లాల పరిధిలోని జరిగిన కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల లెక్కింపు మందకొడిగా సాగుతోంది. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజక వర్గంలో మాత్రం మూడో రౌండ్‌ ముగిసేసరికి కూటమి బలపర్చిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ దాదాపు 30వేల మెజార్జీతో స్పష్టమైన విజయ సంకేతాలతో దూసుకువెళుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో మాత్రం త్రిముఖ పోటీలో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన కూటమి బలపర్చిన రఘువర్మను అధిగమించి రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో పీఆర్‌టీయూ అభ్యర్థిగా నిలబడిన మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం ఓట్ల లెక్కింపు ఏలూరు సమీపంలోని వట్లూరు సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో చేపట్టారు.
710 ఓట్లతో గాదె గెలుపు
దాదాపు 11 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీటీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 10మంది బరిలో ఉండగా.. ఎనిమిది మందిని ఎలిమినేట్‌ చేశారు. మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్‌ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా గాదె శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించి విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో మొత్తంగా 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్ల్లినవిగా అధికారులు గుర్తించారు. దాదాపు 1000కి పైగా ఓట్లు చెల్లనివిగా మిగిలాయి. తొలిరౌండ్‌లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనంతరం 9237 ఓట్లు లభించగా,ప్రధాన ప్రత్యర్థి ఏపీటీిఎఫ్‌ బలపరిచిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కు 8527 ఓట్లు లభించాయి. దీంతో రఘువర్మపై 710 ఓట్ల ఆధిక్యతతో శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు శ్రీనివాసులు నాయుడు, తొలిసారిగా 2007 లో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.మరోసారి 2013 లో జరిగిన ఎన్నికలలో కూడా విజయం సాధించారు. అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు.2019 లో ఎపిటిఎఫ్‌ బలపరిచిన పాకలపాటి రఘువర్మ విజయం సాధించారు. మరోసారి శ్రీనివాసులు నాయుడు గెలుపొందడంతో, మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లుగా చెప్పవచ్చు.ఈ ఎన్నికలలో తెలుగుదేశం,జనసేన పార్టీలు సిట్టింగ్‌ ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మకు మద్దతు తెలిపాయి.కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం రఘువర్మకు మద్దతు ఇవ్వాల్సి ఉండగా, అలా చేయకుండా గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు తెలిపింది. అలాగే రఘువర్మకు మద్దతుగా,టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన, ఎమ్మెల్యేలు,మంత్రులు, పార్టీలకు చెందిన నియోజకవర్గాల స్థాయి నాయకులు బహిరంగంగా మద్దతు ప్రకటించగా, బీజేపీ నాయకులు మాత్రం ఆంతరంగికంగా గాదె శ్రీనివాస నాయుడు విజయానికి సహకరించారు.
భారీ మెజార్టీ దిశగా ఆలపాటి
కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో రౌండ్‌ ఆలపాటి రాజాకు 16,722 ఓట్లు రాగా.. పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావుకు 7,403 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్‌ ముగిసేసరికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ 30,065 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్‌లో కూటమి అభ్యర్థి ఆలపాటికి 17,246 ఓట్లు, రెండో రౌండ్‌లో 17,506 ఓట్లు, మూడో రౌండ్‌లో 16,722 చొప్పున రాగా.. తన సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావు తొలి రౌండ్‌లో 7,156, రెండో రౌండ్‌లో 6,710, మూడో రౌండ్‌లో 7403 చొప్పున ఓట్లు సాధించారు. మొత్తంగా తొమ్మిది రౌండ్‌లు కాగా.. ఒక్కో రౌండ్‌లో 28వేల చొప్పున ఓట్లు లెక్కిస్తున్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికీ లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 371 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదు కాగా.. 55 ఓట్లను చెల్లనివిగా అధికారులు నిర్ధరించారు. సరైన నిబంధనలు పాటించని కారణంగా 55 ఓట్లు చెల్లబాటు కాలేదని అధికారులు తెలిపారు.
మందకొడిగా లెక్కింపు
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మందకొడిగా కొనసాగుతోంది. రాత్రి 9 గంటల సమయానికి కూడా తొలి రౌండ్‌ పూర్తి కాలేదు. ఉదయం 11గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. మొత్తంగా 243 పోస్టల్‌ బ్యాలెట్లకు గాను 201 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లగా.. 42 చెల్లనివిగా గుర్తించారు. ఆ తర్వాత జనరల్‌ బ్యాలెట్‌ ఓట్లలో చెల్లుబాటైనవి, కానివిగా విడదీశారు. బ్యాలెట్లను కట్టలు కట్టేందుకే దాదాపు 12గంటల సమయం పట్టింది. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 2,18,902 ఓట్లు పోల్‌ అవ్వగా.. మొత్తం 8 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. రాత్రి 10.30గంటల తర్వాత తొలి రౌండ్‌ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాదాపు 700మంది కౌంటింగ్‌ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పాల్గొంటున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు