భారత అత్యున్నత న్యాయస్థానం అప్పడపðడూ ‘పాము చావ కుండా.. కర్ర విరగకుండా’ తీర్పులిస్తూ ఉంటుంది. తాజాగా ఉరి శిక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అద్భుతమేమీ కాకపోయినా, ఆశ్చర్యకరమేమీ కాదు. ఉరి తీయడానికి బదులుగా నొప్పి తెలియ కుండా ప్రాణాంతక ఇంజక్షన్ ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయ మార్గా ల్లో మరణశిక్షను అమలుపరిచే పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మహోన్నత న్యాయస్థానం కొట్టివేస్తూనే, ప్రస్తుతం అమలులో ఉన్న మరణదండన పద్ధతిని నిపుణుల సాయంతో సమగ్రంగా సమీక్షించుకోవచ్చని, అందుకు ఈ తీర్పు అడ్డంకి కాదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఈ తీర్పునకు అర్థం ఇదే అంశంపై భవిష్యత్‌లో రాజ్యాంగపరమైన సమీక్ష జరగరాదని కాదు. 1983 నాటి దీనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పునకు ప్రాతిపదిక అయిన వైజ్ఞానిక, వైద్య ప్రమాణాలు, సాక్ష్యాలు చెల్లుబాటు కాకుండాపోయిన పరిస్థితులు తలెత్తితే, దీనిపై భవిష్యత్ లో సమీక్ష జరపవచ్చు’ అని ధర్మాసనం పేర్కొనడం గమనార్హం. 2017లో సీనియర్ న్యాయవాది రిషిమల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తొమ్మిదేళ్లకు తాజా నిర్ణయం వెలువరించింది. వ్యాజ్యకర్త ఆవేదనను తోసి పుచ్చలేం. ఉరిశిక్షను రద్దు చేసి, అంతకన్నా తక్కువ నొప్పిని కలిగించే ప్రాణాంతక ఇంజెక్షన్, తుపాకీతో కాల్చి చంపడం, విద్యుదాఘాతం, గ్యాస్ చాంబర్లోకి పంపడం వంటి ప్రత్యామ్నాయాలు అమలుచేసే అవకాశాన్ని పరిశీలించాలనేది ఆయన వాదన. ఏదేనా ఒక మనిషిని అధికారికంగా చంపడమే. కాకపోతే మొక్కకు అంటుకట్టినట్లు సున్నితంగా చంపాలన్నది ఆయన కోరిక. మానవ నాగరికత పరిణామ క్రమంలో నేరానికి విధించే శిక్షల స్వభావం నిరంతరం మారుతూ వస్తోంది. ప్రాచీన కాలంలో ప్రతీ కారేచ్ఛతో కూడిన శిక్షలు ఉండేవి. కాలక్రమంలో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరస్థుడిలో మార్పు తీసుకురావడం లేదా కఠినమైన హెచ్చరికను పంపడమే ప్రధాన లక్ష్యాలుగా మారాయి. నేర న్యాయ వ్యవస్థల్లో ‘మరణశిక్ష’ (క్యాపిటల్ పనిష్మెంట్) అనేది తీవ్రమైన, తిరుగులేని శిక్ష. అయితే, ప్రాణం తీసే హక్కు రాజ్యానికి ఉందా లేదా అనే ప్రాథమిక ప్రశ్నతో పాటు, ఒకవేళ మరణశిక్ష తప్పనిసరి అయితే దానిని అమలుచేసే విధానం ఎంతవరకు మానవీయంగా ఉండాలనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో దశాబ్దాలుగా లోతైన మేధోమథనం సాగుతోంది. చరిత్ర గతిలో శిక్షా పద్ధతుల పరిణామం ఓ వైచిత్రి. చరిత్రను పరిశీలిస్తే, గతంలో మరణశిక్షలను అత్యంత క్రూరమైన, భయానకమైన పద్ధతుల్లో బహిరంగంగా అమలు చేసేవారు. శిరచ్ఛేదం, రాళ్లతో కొట్టి చంపడం, సజీవ దహనం, ఏనుగులతో తొక్కించడం, గిలెటిన్ వంటి పద్ధతులు సమాజంలో భయోత్పాతాన్ని కలిగించి నేరాలను అదుపు చేయాలనే ఉద్దేశంతో సాగాయి. అయితే, మానవ హక్కుల స్పృహ పెరగడంతో ప్రపంచ దేశాలు వీటిని రద్దు చేస్తూ వచ్చాయి. ఆ క్రమంలోనే ఆధునిక యుగంలో అత్యధిక దేశాలు ఉరితీతను ప్రామాణికంగా స్వీకరించాయి. ఆ తర్వాత తక్కువ సమయంలో ప్రాణం పోతుందన్న భావనతో అమెరికా వంటి దేశాల్లో విద్యుత్ కుర్చీ శిక్షను ప్రవేశపెట్టారు. నొప్పి లేకుండా మరణం సంభవిస్తుందన్న వాదనతో విషవాయు గదులు అమలులోకి వచ్చాయి. వైద్య సాంకేతికత ఆధారంగా శరీరంపై బాహ్య గాయాలు లేకుండా ప్రాణం తీసే పద్ధతిగా ప్రాణాంతక ఇంజెక్షన్ అనేది ప్రాచుర్యం పొందింది. ఇవికాకుండా, ఆక్సిజన్ అందకుండా చేసి నొప్పిలేని మరణం కలిగించే సరికొత్త ప్రయోగంగా నైట్రోజన్ హైపోకిస్యా ఇటీవల కొన్ని చోట్ల తెరపైకి వచ్చింది. ఈ మార్పులన్నీ శిక్ష తీవ్రతను కాపాడుతూనే, అమలు ప్రక్రియలో బాధను, అమానవీయతను వీలైనంత తగ్గించాలనే తాపత్రయాన్ని స్పష్టం చేస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైన’ సూత్రం అనేది భారత న్యాయవ్యవస్థ దృక్పథం కావచ్చు. భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మరణశిక్షపై న్యాయపరంగా పరిపక్వమైన వైఖరి వ్యక్తమవుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అత్యున్నతమైనది. చట్టబద్ధమైన పద్ధతి ద్వారా తప్ప ఏ వ్యక్తినీ ప్రాణం నుంచి దూరం చేయలేరు. బచ్చన్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం (1980) అనే చారిత్రక కేసులో సుప్రీంకోర్టు “అరుదైన వాటిలో అత్యంత అరుదైన” సూత్రాన్ని ప్రతిపాదించింది. సమాజం మనస్సాక్షిని తీవ్రంగా కలచివేసే ఘోర నేరాల్లో, నిందితుడు మారే అవకాశం పూర్తిగా లేదని భావించినప్పుడు మాత్రమే మరణశిక్షను విధించాలని స్పష్టం చేసింది. మచ్చి సింగ్ కేసు (1983)లో నేరం స్వభావం, సమాజంపై దాని ప్రభావం, నిందితుడి నేపథ్యం వంటి అనేక మార్గదర్శకాలను మరింత స్పష్టంగా క్రోడీకరించింది. మరణశిక్షను సాధారణ శిక్షగా కాకుండా, అత్యవసరమైన ఆఖరి అంగంగా మాత్రమే భారత న్యాయవ్యవస్థ చూస్తోంది. భారత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ/ బీఎన్‌ఎస్‌ఎస్) ప్రకారం ‘మెడకు ఉరివేసి ప్రాణం పోయే వరకు వేలాడ దీయడం’ అనేది మరణశిక్ష అమలు విధానం. ఈ పద్ధతి శారీరక వేదనను కలిగిస్తుందని, ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా ఇతర ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలంటూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. శిక్షను అమలు చేసే ప్రక్రియలో గౌరవప్రదమైన మరణం, నొప్పి లేని విధానాలపై శాస్త్రీయ అధ్యయనం జరగవచ్చని కోర్టు పేర్కొంది. అదే సమయంలో, ఉరితీత రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ, దీనిని పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చింది. తాడుకట్టి ఉరి వేయాలని సీఆర్‌పీసీ సెక్షన్ 354(5) రాజ్యాంగబద్ధమేనని 1983లో ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చిన తర్వాత దీనిపై చర్చ ఇంకా విస్తృతమైంది. ఒకటి మాత్రం నిజం. ప్రాణాంతక ఇంజెక్షన్లు కూడా ఎల్ల పðడూ నొప్పి లేకుండా ఉండవని, కొన్ని సందర్భాల్లో రసాయనాల మిశ్రమం విఫలమై తీవ్ర వేదనకు దారితీసిన ఉదంతాలు విదేశాల్లో ఉన్నా యని నిపుణులు ప్రస్తావిస్తుంటారు. కాబట్టి, ఉరి విధానం కంటే మరొకటి పూర్తి శ్రేయస్కరమని శాస్త్రీయంగా నిరూపితమయ్యేంత వరకు చట్టసభలు నిర్ణయించిన నిబంధనలను గౌరవించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరణశిక్ష కొనసాగాలని సమర్థించే న్యాయ కోవిదులు, సామాజిక విశ్లేషకులు బలమైన తార్కిక అంశాలను ముందుంచుతారు. సమాజ భద్రత, న్యాయ సమతుల్యతను దృష్టిలో పెట్టుకుంటారు. చిన్న పిల్లలపై లైంగిక దాడులు, క్రూరమైన సామూహిక హత్యలు, దేశ భద్రతను ప్రమాదంలో పడేసే ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు సమాజంలో అపారమైన ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతాయి. అటువంటి ఘోరాలకు పాల్పడిన వారికి గరిష్ట శిక్ష పడటం వల్ల సమాజంలో చట్టంపై, న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందనేది వారి వాదన. అత్యంత కఠినమైన శిక్షలు చట్టంలో ఉండటం వల్ల తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిలో భయం కలుగుతుందని, ఇది నేర ప్రవృత్తిని అడ్డుకునే నిరోధకంగా పనిచేస్తుందని చెపుతారు. అలాగే, కంటికి రెప్పలా కాపాడుకున్న తమవారిని అన్యాయంగా కోల్పోయిన కుటుంబాలకు, హంతకుడికి పడే శిక్ష ఒక నైతిక ఉపశమనాన్ని, న్యాయం జరిగిందనే సంతృప్తిని ఇస్తుందనేది వాస్తవమే.మరణశిక్ష సమర్థ నీయమైనప్పటికీ, దాని అమలు పద్ధతిపై ఆరోగ్యకరమైన చర్చ జరగడం ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనం. రాజ్యాంగం ప్రసాదించిన మానవ గౌరవం మరణించే క్షణంలోనూ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వైద్య నిపు ణులు, ఫోరెన్సిక్ సైంటిస్టులు, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ద్వారా వివిధ మరణశిక్ష అమలు పద్ధతుల ప్రభావాలను నిరంతరం సమీక్షించాలి. ఉరితీత ప్రక్రియలో సాంకేతిక ప్రమాణాలు మరింత ఖచ్చితంగా ఉండేలా చూడటం ద్వారా అనవసర శారీరక వేదనను నివారించవచ్చు. క్షమాభిక్ష పిటిషన్ల వేగవంతమైన పరిష్కారం దక్కాలి. శిక్ష ఖరారైన తర్వాత దశాబ్దాల పాటు అనిశ్చితిలో మగ్గడం మానసిక చిత్రహింసగా మారుతుంది. అందువల్ల అప్పీళ్లు, క్షమాభిక్ష ప్రక్రియలు నిర్దిష్ట గడువులోగా ముగిసేలా చూడాలి. శిక్ష అనేది పగ తీర్చుకోవడం కోసం కాకుండా, సమాజంలో ధర్మాన్ని, శాంతిని పునఃప్రతిష్టించడం కోసమే ఏర్పడింది. ఒక వైపు సమాజ విద్రోహ శక్తులకు, కరక్కశ హంతకులకు గట్టి హెచ్చరిక పంపేలా చట్టం దృఢంగా ఉండాలి. మరోవైపు శిక్ష అమలులో అత్యంత మానవీయమైన, ఆధునికమైన పద్ధతులను అవలంబించే విచక్షణను న్యాయవ్యవస్థ ప్రదర్శించాలి. ఉరిశిక్ష రద్దు లేదా కొనసాగింపుపై జరిగే చర్చలు సమాజ భద్రతను, రాజ్యాంగ మానవతా విలువలను సమన్వయం చేసే దిశగా సాగడమే నేటి నాగరిక సమాజానికి అత్యంత శ్రేయస్కరం.


