. ఇండోసోల్‌కు 8458 ఎకరాలు ధారాదత్తం
. దళిత, గిరిజన గ్రామాల అదృశ్యం
. భూసేకరణ చట్టానికి తూట్లు
. కూటమి ప్రభుత్వంపై నిరసన గళం
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామం రాష్ట్ర చిత్రపటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అక్కడ బలవంతపు భూ సేకరణకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని బాధిత రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల పేరుతో ఊళ్లను తరిమేసి..కార్పొరేట్ కంపెనీలకు వేలాది ఎకరాల భూముల్ని ధారాదత్తం చేసే ప్రభుత్వ నిర్ణయాల్ని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సొంత టీడీపీతోపాటు వామపక్ష, కాంగ్రెస్, వైసీపీ, ప్రజా సంఘాలు, రైతులు, స్థానికులు ఆందోళనబాట పట్టడంతో అక్కడ ఎంత భూదోపిడీ, అన్యాయం జరుగుతుందనేదీ స్పష్టమవుతోంది. కరేడులో షిర్డిసాయి అనుబంధ ఇండోసోల్ కంపెనీకి 8458 ఎకరాల భూమిని అప్పనంగా ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో సోలార్ ప్లాంట్‌ను ఇండోసోల్ నిర్మించనుంది. ఈ భారీ భూసమీకరణతో కరేడు గ్రామంలోని ఇళ్లు, రైతుల పొలాలు, స్థలాలు అంతరించిపోయే ప్రమాదముంది. అక్కడి కష్టజీవులు, రైతులు, ప్రజలు ఉనికి కోసం వేరే ప్రాంతాలకు వలసలు పోయే పరిస్థితిని ప్రభుత్వమే స్వయంగా కల్పించినట్లవుతుంది. మరో మూడు గ్రామాలు..రామకృష్ణపాలెం, ఉప్పర పాలెం, బొట్టనగుంటలో భూ సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో రెండు దళిత, గిరిజన గ్రామాలు..గ్రామాలే లేచిపోయి..సామాజిక అంశం సమస్యగా మారింది. పరిశ్రమలకు భూములు ఇవ్వడాన్ని అందరూ స్వాగతిస్తారేగానీ, 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా ఊళ్లను తరిమేసేసి..కార్పొరేట్/ప్రైవేట్ కంపెనీలకు భూములను ధారాదత్తం చేయడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం 2లక్షల ఎకరాల వరకు వివిధ కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్రంలో కారుచౌకగా భూములు కట్టబెట్టినప్పటికీ ఎక్కడా పరిశ్రమలు నెలకొల్పలేదన్న విమర్శలున్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన సమస్య అలాగే ఉంది. ఇండోసోల్ కంపెనీకి సోలార్ ప్లాంట్ పెట్టుకునేందుకుగాను కరేడు గ్రామం మినహా మిగిలిన ఏ ప్రాంతం కన్పించలేదా?, నిరుపయోగంగా ఉన్న అనేక ప్రాంతాల్లో భూములపై ఎందుకు ఆ కంపెనీ దృష్టి పెట్టడంలేదంటూ బాధిత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారికి వామపక్షాలతో పాటు కాంగ్రెస్, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. సామాజిక అంశాలపై సర్వే ఏదీ? కరేడులో భూములను ఇండోసోల్‌కు కట్టబెట్టే ప్రయత్నానికి ముందు అక్కడి సామాజిక పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి సర్వేలు చేపట్టలేదు. భూసేకరణ చట్టం2013 అనేది ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరించే ప్రక్రియను వివరించడానికి భారత ప్రభుత్వం రూపొందించింది. వారి భూమిని స్వాధీనం చేసుకునే ముందు భూ యజమానుల సమ్మతిని పొందడం చాలా ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. స్వాధీన ప్రక్రియ సమయంలో భూ యజమానుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునేలా ఈ నిబంధన ఉద్దేశించబడిరది. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా ప్రయత్నించడంతోనే స్థానిక రైతులు, ప్రజల నుంచి పెద్దఎత్తున తిరుగుబాటు ఎదురైంది. ప్రభుత్వం భూములను సేకరించేటప్పుడు ప్రజలకు న్యాయం చేయడం, హక్కుల పరిరక్షణ, భూసేకరణ ప్రక్రియలోని రైతుల, గ్రామస్థుల, పేదల హక్కులను కాపాడేలా చట్టం అండగా నిలుస్తుంది. భూసేకరణ చేసే సమయంలో గ్రామసభ ఆమోదం తప్పనిసరి. బాధితులకు న్యాయమైన పరిహారం, గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువ కన్నా అనధికారికంగా నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో అనధికంగా రెండు రెట్లు పరిహారం ఇవ్వాలి. భూమిని కోల్పోయే రైతులకు మళ్లీ భూమిగానీ, శాశ్వత పునరావాసంగానీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. భూసేకరణ వల్ల స్థానిక ప్రజల జీవనంపై పడే ప్రభావాన్ని ముందుగా అధ్యయనంతోపాటు వారికి పునరావాస, పునర్స్థాపన ప్యాకేజ్‌లు కల్పించాలి. ఈ చట్టంలోని అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా, సామాజిక పరిస్థితులపై సర్వే చేయకుండా, కనీసం గ్రామ సభలు నిర్వహించకుండా గ్రామస్తుల అంగీకారం పొందకుండా భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
నాడు ఇండోసోల్‌పై విమర్శలు..నేడు అదే కంపెనీకి భూములు
గత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇదే ఇండోసోల్ కంపెనీకి రామాయపట్నం పోర్టు వద్ద భూములివ్వాలని నిర్ణయించగా, ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అనేక మీడియా సమావేశాలు నిర్వహించి, భూ కుంభకోణం జరిగిందని, అది జగన్ బినామీ కంపెనీ అంటూ ఆరోపించారని, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే కంపెనీకి గత ప్రభుత్వం కంటే ఇంకా అధికంగా భూములను ఎలా కట్టబెడతారంటూ వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ఏ రకమైన క్విడ్ ప్రోకోలో భాగంగా ఆ గ్రామానికి చెందిన భూములిస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. కరేడు గ్రామంలోని భూములన్నీ కట్టబెట్టే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఆ ఒక్క గ్రామమే కాకుండా రామకృష్ణపాలెం, ఉప్పరపాలెం, బొట్టనగుంటలో తీసుకోనున్నారు. ఇందులో రెండు దళిత, గిరిజన గ్రామాలున్నాయి. కొత్తగా వచ్చిన కంపెనీతో వెంటనే ఉపాధి లేకపోగా దళిత, గిరిజన గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయని… తీసుకున్న భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వబోరన్న ప్రచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు సైతం కరేడు గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ నిర్బంధకాండ కొనసాగించటంతో అక్కడ పెద్దఎత్తున స్థానికల నుంచి తిరుగుబాటు ఎదురైంది. అటు ఇండోసోల్ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలని, ప్రజలపై నిర్బంధకాండను ప్రయోగించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ దాసరిభవన్‌లో గతనెల 30వ తేదీన సమావేశంలో పది వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.


