Wednesday, July 2, 2025
Homeకర్నాటకకు కొత్త ముఖ్యమంత్రి?

కర్నాటకకు కొత్త ముఖ్యమంత్రి?

. తుది నిర్ణయం అధిష్టానానిదేనన్న ఖడ్గే
. త్వరలో ‘డీకే’ సీఎం అవుతారని ఎమ్మెల్యేల ప్రకటనలు
. సుర్జేవాలా రాకతో ఊపందుకున్న ఊహాగానాలు
. ఐదేళ్లూ ప్రభుత్వం కొనసాగుతుంది: సిద్దరామయ్య

బెంగళూరు : కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటూ కొంతకాలంగా జరుగు తున్న ప్రచారానికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలను ఆయన ఖండిరచకపోగా…ఈ వ్యవహారానికి సంబంధించిన తుది నిర్ణయం పార్టీ అధిష్టానం చేతుల్లో ఉంటుందని స్పష్టం చేయడం ద్వారా ఉత్కంఠను మరింత పెంచారు. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ రానున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా బెంగళూరు పర్యటన ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఆయన పార్టీ శాసనసభ్యులతో విడివిడిగా భేటీలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ పనితీరుపై ఫిర్యాదుల గురించి ఆయన తెలుసుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఖడ్గే సమాధానమిస్తూ… ‘‘అక్టోబర్‌లో కర్నాటక ముఖ్యమంత్రిని మారుస్తారని అంటున్నారు కదా?’’ అని అడగ్గా… ‘‘అది అధిష్టానం పరిధిలోని అంశం. అధిష్టానంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఎవరూ చెప్పలేరు. ఈ విషయాన్ని అధిష్టానానికే వదిలేశాం, తదుపరి చర్యలు తీసుకునే అధికారం వారికే ఉంది. ఎవరూ అనవసరంగా సమస్యలు సృష్టించకూడదు’’ అని ఖడ్గే వ్యాఖ్యానించారు. మరోవైపు, డీకే శివకుమార్‌ వర్గానికి చెందిన నేతలు నాయకత్వ మార్పుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హెచ్‌.ఏ. ఇక్బాల్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ… ‘‘వచ్చే రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావొచ్చు’’ అన్నారు. పార్టీ గెలుపు కోసం శివకుమార్‌ పడిన శ్రమ, ఆయన వ్యూహాలు అందరికీ తెలుసని, సరైన సమయంలో అధిష్టానం ఆయనకు అవకాశం ఇస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ తర్వాత రాష్ట్రంలో రాజకీయపరమైన కీలక మార్పులు ఉంటాయని కొందరు నేతలు చెబుతున్నారని, దాని గురించే తాను మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇదే తరహాలో రాష్ట్ర సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న కూడా ఇటీవల మాట్లాడుతూ, సెప్టెంబర్‌ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు ఉంటాయని సంకేతాలిచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖడ్గే కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని, తదుపరి నిర్ణయం కూడా వారే తీసుకుంటారని ఎమ్మెల్యే హుస్సేన్‌ గుర్తుచేశారు. కాగా, తమ ప్రభుత్వం ఐదేళ్లు రాయిలా పటిష్టంగా ఉంటుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. తనకు, డీకే శివకుమార్‌కు మధ్య చీలికలు తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని స్పష్టం చేశారు. సోమవారం మైసూరులో డీకే శివకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఇద్దరూ చేయిచేయి కలిపి పైకి లేపి ఐక్యతను చాటారు. ఈ సంవత్సరం ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా వేడుకలను తాను ప్రారంభించబోనని చెబుతున్న బీజేపీ నాయకులను కూడా ఆయన విమర్శించారు. వారు అబద్ధాలు చెప్పడంలో నిపుణులని చమత్కరించారు. సుర్జేవాలా పర్యటన గురించి అడగా… ‘‘ఆయన ఏఐసీసీ ఏఐసీసీ ఇంఛార్జ్‌ ప్రధాన కార్యదర్శి. ఆయన ఎమ్మెల్యేల నుండి అభిప్రాయాలను సేకరిస్తారు, వారి ఆందోళనలను వింటారు. బలోపేతం చేయడానికి ఏమి చేయాలో చర్చిస్తారు. ఆయన తన పని తాను చేసుకుంటారు’’ అన్నారు.
లక్ష్మణరేఖ దాటొద్దు…
ముఖ్యమంత్రి మార్పు విషయమై కాంగ్రెస్‌ పార్టీ నేతల వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలని హోంమంత్రి జి పరమేశ్వర పేర్కొన్నారు. అయితే నాయకులెవరూ పార్టీ గీసిన లక్ష్మణరేఖ దాటి వ్యాఖ్యానాలు చేయవద్దని హెచ్చరించారు. ‘‘కొంతమేర వ్యక్తిగతంగా వారు అభిప్రాయాలను వ్యక్తపర్చవచ్చు. కానీ పార్టీ గీసిన లక్ష్మణరేఖను దాటి మాట్లాడరాదు’ అని పరమేశ్వర పేర్కొన్నారు. ఈ విషయాలు ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. 2023 మే నెలలో కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకలో ఘన విజయం సాధించినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ సమయంలో, అధిష్టానం ఇరువురి మధ్య రాజీ కుదిర్చి, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా, శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా వీరి మధ్య ‘రొటేషనల్‌ సీఎం’ ఒప్పందం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, పార్టీ దీనిని అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించలేదు. తాజా పరిణామాలతో ఈ ఒప్పందం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఖర్గే వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్‌ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపై కేంద్రీకృతమై ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు