Homeకర్నాటక సీఎంగా డీకే

కర్నాటక సీఎంగా డీకే

- Advertisement -

. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర
. మరో 12 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
. హాజరైన ఖడ్గే, రాహుల్, రేవంత్

బెంగళూరు: కర్నాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమ ంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీ కారం చేశారు. బుధవారం సాయం త్రం లోక్ భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాత్ ఈ మేరకు డీకే శివకుమార్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, వీడీ సతీశన్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ఏఐసీసీ నాయకులు రణదీప్ సింగ్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్, కర్నాటక ప్రధాన న్యాయ మూర్తి విభా బక్రూ హాజరయ్యారు. రాజ్యాంగం మినీబుక్‌ను చేతబట్టి డీకే ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు వేదికపై నుంచి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తన సీనియర్ అయిన సిద్ధరామయ్యను వేదికపైనే డీకే సత్కరించారు. కాగా డీకేతో పాటు జి. పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా, మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, మల్లికార్జున ఖడ్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రివర్గంలో చోటుదక్కింది. కేహెచ్ మునియప్ప, కె.జె.జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యు.టి.ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్‌కు మంత్రి పదవులు దక్కాయి. ప్రస్తుతం మంత్రివర్గంలో డీకే శివకుమార్‌తో సహా ముగ్గురు వొక్కలిగ మంత్రులు, ముగ్గురు లింగాయత్, ముగ్గురు దళితులు, ఇద్దరు కురుబలు, వాల్మీకి-నాయక, ముస్లిం, క్రైస్తవ వర్గాల నుండి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే… ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దినేష్ గుండూ రావు, న్యాయ, శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న హెచ్‌కే పాటిల్, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సమయంలో పార్టీని దెబ్బతీశారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజెడ్ జమీర్ అహ్మద్‌లను మంత్రివర్గం నుండి తొలగించారు. నటులు ధ్రువ సర్జా, శివరాజ్‌కుమార్, ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్, రమ్య, దల్లి ధనంజయ్, నేపథ్య గాయని, సంగీత దర్శకుడు గురు కిరణ్, డి.కె. శివకుమార్ స్నేహితుడు, నటుడు సిహి కహి చంద్రు, క్రికెటర్ అనిల్ కుంబ్లే, జైమాల, పెద్ద సంఖ్యలో సాధువులు కూడా గణనీయ సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 1100 మందికి లోక్‌భవన్ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పించారు. 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, అధికారం చేపట్టింది. అయితే, ఆ సమయంలోనే సీఎం పదవి కోసం డీకే తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, సీనియర్ నేత సిద్ధరామయ్యకు అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత అవకాశం కల్పిస్తామని అప్పట్లో హైకమాండ్ మాట ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. గతేడాది నవంబరుతో సగం కాలం పూర్తికాగా.. నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ జరిగింది. కానీ, తాత్కాలికంగా ఆ సంక్షోభాన్ని నివారించిన కాంగ్రెస్ పెద్దలు.. చివరకు సిద్ధరామయ్యను ఒప్పించి రాజీనామా చేయించారు.
నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర
ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన శివకుమార్, 2028 అసెంబ్లీ ఎన్నికలకు రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయం మిగిలి ఉండగా బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన రాజకీయ జీవితంలో, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎనఎస్‌యÖఐ)లో విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి, కర్నాటకలోని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రముఖ నాయకులలో ఒకరిగా ఎదిగారు. డీకే.శివకుమార్ 1962 మే 15న జన్మించారు. కెంపేగౌడ, గౌర అమ్మ దంపతులకు జన్మించారు. 2020 నుంచి కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గతంలో 2008 నుంచి 2010 వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, 2014 నుంచి 2019 వరకు కర్నాటక ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు. 2008 నుంచి కనకపుర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకముందు 1989 నుంచి 2008 వరకు సాతనూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. డీకే.సురేష్ అనే సోదరుడు ఉన్నారు. 1993లో ఉషను వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు, ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకున్నారు.
సీడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్ధరామయ్య
కర్నాటకలో నాయకత్వ మార్పు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా నియమించింది. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థలో ఆయనకు చోటు కల్పిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటన విడుదల చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు