తగినంత మంది పోలీసులు లేరు
కశ్మీర్‌లో తగినంత మంది పోలీసులు లేరంటే ఈ పరిస్థితి దేన్ని తెలియజేస్తుంది? ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పైన కశ్మీర్ ప్రజలకు విశ్వాసం కలగడంలేదు. ఇందిరాగాంధీ పాలనా కాలంలోనే ఇలాంటి పరిస్థితి ప్రారంభమైంది. ఆనాటి పరిస్థితి నేడు మరింత ఘోరంగా మారింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జమ్ము`కశ్మీర్ రాజకీయ చరిత్రలో అనేక గందరగోళ సంఘటనలు జరిగాయి. వీటిలో అత్యంతగా గణించదగిన సంఘటన జరిగింది. ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావం కలిగిన గొప్ప నాయకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లాను కేంద్రప్రభుత్వం అరెస్టు చేసింది. షేక్ అబ్దుల్లాను తరచుగా ‘‘లైన్ ఆఫ్ కశ్మీర్’’ అని పిలిచారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కశ్మీర్ ప్రధాని ఆయన. ప్రజలకు ఎంతో ఇష్టమైన నాయకుడాయన. ఉపఖండం విభజన తర్వాత సంవత్సరాలలో రాజకీయ వాతావరణాన్ని ప్రజానుకూలంగా మార్చడంలో ఆయన కీలకమైన పాత్రను నిర్వహించారు. 1950 లలో భూ సంస్కరణలను అమలు చేసి గొప్పగా ప్రజాదరణను పొందారు. అనేక శతాబ్దాలుగా నెలకొని ఉన్న భూస్వామ్య విధానాన్ని నిర్మూలించి పేదరైతులకు భూములను పంపిణీ చేశారు. దీనితో కశ్మీర్‌లో సామాజిక, ఆర్థిక మార్పులు జరిగాయి. ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని ఆర్టికల్ 370 కింద కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను సాధించారు.1953లో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. షేక్ అబ్దుల్లాను ప్రభుత్వం నుంచి తొలగించారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. అప్పుడు శ్రీనగర్‌కు, న్యూదిల్లీకి మధ్య అవిశ్వాసం ఏర్పడిరది. ఆనాడు చోటుచేసుకున్న ప్రాంతీయ రాజకీయాలు నేడు ప్రగాఢమైపోయాయి. షేక్ అబ్దుల్లా అరెస్టుతో జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. అబ్దుల్లా అరెస్టు తర్వాత కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దిగజారిపోయాయి. అవి 1984లో మరింత దెబ్బతిన్నాయి. అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అక్కడ పాలక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో విభజన తీసుకువచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాను తొలగించింది. అనంతరం ఆయన స్థానంలో బావమరిది గులాం మహమ్మద్ షాను నియమించింది. పార్టీలో ఆయన అసమ్మతివాదిగా ఉన్నారు. మహమ్మద్ షా పాలన దాదాపు రెండేళ్లు సాగింది. అయితే ఈ కాలంలో శాంతి భద్రతల సమస్యలు తీవ్రమై తరచుగా కర్ఫ్యూ పెట్టారు. 1989లో తీవ్రవాదం తలెత్తి కశ్మీర్ గవర్నరుగా జగ్‌మోహన్‌ను నియమించారు. ఆయన కాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జగ్‌మోహన్ కాలంలో అధికార లెక్కల ప్రకారం, 40 వేల మందికిపైగా హతమయ్యారు. 1990 నుంచి 96 వరకు రాష్ట్రపతి పాలన సాగింది. ఈ సమయంలో ప్రజాస్వామ్యంలో శూన్యం ఏర్పడిరది. రాజకీయ సంస్థలపైన ప్రజలకు విశ్వాసం లేకుండాపోయింది. పెద్దసంఖ్యలో ప్రజలకు ఓట్లు లేకుండా పోయాయి. ఎన్నికైన ప్రభుత్వాలు లేవు. విశాల ప్రజానీకంలో మానవహక్కులు లేక ఆందోళన చెందారు.1996లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది.
డాక్టర్ కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
పహల్గాం దారుణానికి గురై ఎంతగానో బాధలు పడుతున్న ప్రజలను, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారిని కొంచమైనా శాంతపరచేందుకు తక్షణం జమ్ముకశ్మీర్‌ను పూర్తిస్థాయి రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్రంగా ప్రకటిస్తామని ప్రధాని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో హామీ ఇచ్చి అనేక సంవత్సరాలు అవుతోంది. అయినా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. ఇండియాకు జమ్ముకశ్మీర్ ఒక అందమైన బహుమతి. సహజ సిద్ధమైన అందం, ఎటుచూసినా పుష్పాలు, పండ్ల తోటలు, పర్వతశ్రేణులు, పచ్చిక బయళ్లు, నీలి జలాలు పారే నదులు కశ్మీర్ నిండా అల్లుకున్నాయి. జమ్ము`కశ్మీర్ రాజధాని అద్భుతమైన శ్రీనగర్‌కు 2025 జులై 23 న చేరుకున్నాం. ఎంతో అందమైన శ్రీనగర్‌ను మొదటిసారిగా సందర్శించే అవకాశం నాకు లభించింది. సీపీఐ బృందం శ్రీనగర్ నుంచి పహల్గాంకు బయల్దేరింది. ప్రతి ఫర్లాంగు దూరంలో ఒకచోట పోలీసుల నిఘా, తనిఖీ చేయడం మాకు అనుభవమైంది. సైనిక దర్యాప్తు, విచారణతో విసిగిపోయాను. మేము ఎక్కడకు వెళుతున్నామని…మీరు ఎవరని ప్రశ్నించి విసిగించారు. కశ్మీర్‌లో ఏడు లక్షలమంది వివిధ ర్యాంకులకు చెందిన సైనిక సిబ్బందిని నియమించారు. నిఘా కోసం టెర్రరిస్టులు, దాడులు జరిపే వారితో పోరాడేందుకు వీరిని నియమించారు. ఒక్కమాటలో చెప్పాలంటే, కశ్మీర్ సైనిక పాలనలోనే ఉంది. ఎన్నికైన ప్రభుత్వ పాలనలో కశ్మీర్ లేదు. కశ్మీర్‌కు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమేమిటి? భారత ప్రభుత్వంపైన ఇప్పటికీ కశ్మీర్ ప్రజలకు విశ్వాసంలేదు. కశ్మీర్ ప్రజలను టెర్రరిస్టులుగా అనేకసార్లు ముద్ర వేశారు. ఇది వాస్తవమా? ఇలా ముద్ర వేయడానికి ఏమైనా రాజకీయ కారణం ఉందా అనేది పరిశీలించాలి.
షేక్ అబ్దుల్లా కశ్మీర్‌కు మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆనాడు అలా పిలిచేవారు. ఆయన పాలనలో ‘‘రైతులకు భూమి’’ అనే నినాదంతో భూ సంస్కరణలను అమలుచేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు చేయకుండా కొత్త చట్టాలను తీసుకువచ్చి భూ సంస్కరణలను అమలు చేయలేదు. మొదట భూ సంస్కరణలను అమలు చేసినప్పుడు భూములు లేని కుటుంబాలే లేవు. రైతులు వరి పండిరచారు. యాపిల్, లిచీ పండ్ల వనాలను పెంచారు. ఆనాడు పేదరికం లేదు. అలాంటి రాష్ట్రంలో అరాచకం ఎందుకు చోటుచేసుకుంది? స్వాతంత్య్రం అనంతరం కాలంలో రాజకీయాలు ప్రజలకు మంచి జీవనాన్ని అందించాయి. ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగాలను కల్పించింది. అయితే ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వంపై కశ్మీర్ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. అధికార కాంక్షతో కేంద్రం అనేక తప్పులుచేసింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని టెర్రరిజం బలపడిరది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా టెర్రరిస్టులను పెంచిపోషించింది. భారత ప్రభుత్వం కశ్మీర్ ప్రజలకు తమపై విశ్వాసం లేకుండా చేసింది. పాకిస్థాన్ జోక్యం చేసుకునేందుకు అవకాశం కలిగి అనేకసార్లు దాడులు జరిపింది.
శ్రీనగర్‌ను సందర్శించిన వారిలో నేను, రామకృష్ణ పాండా, అజీజ్‌పాషా ఉన్నాం. అందరమూ సీపీఐ జాతీయ కార్యదర్శులమే. మేమంతా పహల్గాంను సందర్శించాం. సిందూర్ ఆపరేషన్ జరిగిన ప్రాంతాన్ని కూడా సందర్శించాలని ఆశించాం. ఆ ప్రాంతానికి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. పహల్గాంను కూడా ఎంతో కష్టంతో చేరుకోగలిగాం. చిల్లర దుకాణాల వ్యాపారులతో, గుర్రాలను నడిపే సహాయకులతో (సిసెస్) మాట్లాడాం. సామాన్య ప్రజలు, చిల్లర దుకాణాలు నడిపేవారు చెప్పిన వాస్తవాలకు మోదీ పదేపదే చేస్తున్న ప్రచారానికి ఏ మాత్రం సంబంధం లేదు. అక్కడ జరిగిన వాస్తవాలు విని ఎంతో ఆశ్చర్యపోయాను. పహల్గాంలో టెర్రరిస్టులు అత్యంత ఘోరంగా అమాయకులైన భారత యాత్రికులు 22 మందిని హతమార్చారు. యాత్రికులు అత్యంత విలువైన ప్రాణాలను వదిలారు. చనిపోయినవారి కుటుంబాలకు కేవలం లక్ష రూపాయల చొప్పున మోదీ ప్రభుత్వం పంపిణీ చేసింది. అంతటితో తమ బాధ్యత ముగిసిందని భావించింది. ఒక్కొక్క కుటుంబానికి కనీసం కోటి రూపాయలైనా ఇచ్చి ఉండవలసింది. పహల్గాంలో ఎంతో దుర్మార్గమైన, ఘోరమైన సంఘటనలు జరిగిన తర్వాత కనీసం 500 కుటుంబాలు కశ్మీర్ నుంచి తాము జీవిస్తున్న ప్రాంతాలు వదిలి వెళ్లిపోయాయి. వీరిని గురించి ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. సిందూర్ ఆపరేషన్ సందర్భంగా 5 జెట్ విమానాలు కూలిపోయాయి. సరిహద్దుల్లో నివసిస్తున్న ప్రజలు మా స్థావరాలను కోల్పోయామని చెప్పారు. కశ్మీర్‌లోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లారు. టెర్రరిస్టుల దాడుల కారణంగానే వీరు వలస వెళ్లారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను (పీఓకే) మన సైన్యం ఆక్రమించుకోగలదని దేశ ప్రజలంతా ఆశించారు. యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేశారు. సిందూర్ ఆపరేషన్‌ను ఎన్నికల ప్రచారానికి మోదీ ఉపయోగించుకున్నారు. కశ్మీర్‌కి యాత్రికులను ప్రోత్సహిస్తున్నారు. అయితే యాత్రికులు భయభ్రాంతులవుతున్నారు. చిల్లర దుకాణదారులు మనుగడ సాగించలేకపోతున్నారు. పహల్గాం దుర్ఘటన జరగడానికి ముందు వేయి గుర్రాలను నిలిపిఉంచారు. అయితే ప్రస్తుతం మహా అయితే వంద గుర్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు యాత్రికులు కశ్మీర్‌కు రావడంలేదు. అందమైన పర్వత శ్రేణుల వైపు యాత్రికులు వెళ్లడంలేదు. ప్రజలంతా విచారంలో ఉన్న కాలంలో సైతం మోదీ ఈ దుర్ఘటనను ఎన్నికల కోసం వినియోగించుకుంటు న్నారు. మోదీ విషతుల్యమైన రాజకీయాలను నడుపుతున్నారు.
2019 ఆగస్టు 5 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి 370 వ అధికరణను రద్దు చేసి దానికిగల ప్రత్యేక రాజ్యాంగ స్థానాన్ని తొలగించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. ఒమర్‌అబ్దుల్లా ప్రభుత్వం 2024 అక్టోబరులో ఏర్పడిన తర్వాత 9 నెలలపైగా ప్రజలలో గల అవిశ్వాసం చాలా ఎక్కువగా ఉన్నది. ఎన్నికైన ప్రభుత్వాన్ని చీల్చిన తర్వాత కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించింది. అయినప్పటికీ, సమర్థమైన ప్రభుత్వాన్ని నిర్వహించలేకపోయారు. లెఫ్టినెంట్ గవర్నర్ కాలంలోనే ప్రజలలో విసుగు పెరిగింది. పరిపాలనలో గందరగోళం ఏర్పడిరది. విధానాలు రూపొందించడం జాప్యమైపోయింది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, పూర్తిస్థాయి రాష్ట్రాన్ని ప్రకటించాలి.
సెల్ : 9490952222


